తెలంగాణలో దరఖాస్తుదారుల్లో అయోమయం .. రెండో రోజు లొకేషన్లు మార్చి కౌంటర్లు ఏర్పాటు

తెలంగాణలో దరఖాస్తుదారుల్లో  అయోమయం .. రెండో రోజు లొకేషన్లు మార్చి కౌంటర్లు ఏర్పాటు
  • అనుమానాలు నివృత్తి చేస్తూ దరఖాస్తులు తీసుకుంటున్న అధికారులు
  • ఒక్కరే రెండు, మూడు ఫామ్స్ తీసుకోవడం వల్లే సమస్య

హైదరాబాద్, వెలుగు:   ప్రజాపాలన దరఖాస్తులపై జనంలో అవగాహన లేక ఇబ్బందులు వస్తున్నాయి.  ఆరు గ్యారంటీలకు ఆరు అప్లికేషన్లు ఇవ్వాలనుకుని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. గ్రేటర్ సిటీలో నివసిస్తూ.. గ్రామాల్లో భూములు కొనుగోలు చేసిన వారు రైతుబంధు(పెట్టుబడిసాయం) కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలని, రేషన్, ఆధార్ కార్డులపై గ్రామాల అడ్రస్​లు ఉన్నవారు గృహజ్యోతి, రూ.500 గ్యాస్ సిలిండర్​కు ఎలా దరఖాస్తు చేయాలనే అయోమయంలో ఉన్నారు.

 మహాలక్ష్మి కింద అందించే రూ.2,500కు  గ్రామాలతో పాటు ఇక్కడ కూడా దరఖాస్తు చేసుకుంటున్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఇలా అవగాహన లేకనే జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చివరి రోజు అనుకొని దరఖాస్తు పట్టుకుని బారులు తీరుతున్నారు. ఎప్పుడైనా  దరఖాస్తు చేసుకోవచ్చని, కౌంటర్లు ఖాళీగా ఉన్నప్పుడే వచ్చి అప్లయ్ చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. 

అనుమానాలను నివృత్తి చేసేందుకు కొన్ని సెంటర్ల వద్ద  జీహెచ్ఎంసీ సిబ్బందిని నియమించింది. దరఖాస్తు చేయలేని వారికి వలంటీర్లు దరఖాస్తు ఫారాలు నింపి ఇస్తున్నారు. దీంతో రెండో రోజు రద్దీ, తోపులాటలు కనిపించడలేదు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా భూములు కొనుగోలు చేస్తున్నవారు ఆధార్ అడ్రస్ వివరాలు రాస్తే సరిపోతుందని చెబుతున్నారు. మిగతా పథకాలకు ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసిన తర్వాతనే క్లారిటీ రానుంది. ఇప్పుడైతే రేషన్ కార్డు ఉన్నా లేకున్నా దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉంది. 

రెండో రోజు అదే స్పందన 

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ  రెండో రోజు సాఫీగా జరిగింది. డివిజన్లలో లోకేషన్లు మార్చి దరఖాస్తులను స్వీకరించారు. చాలా ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం150 డివిజన్లలో 600 కౌంటర్ల ద్వారా అప్లికేషన్లను తీసుకున్నారు. రెండోరోజు కూడా జనం నుంచి స్పందన కనిపించింది. చాలా సెంటర్లలో  ఫామ్స్ అందుబాటులో ఉంచారు.

 కొన్ని సెంటర్లలో ఒక్కొక్కరు రెండు, మూడు ఫామ్స్ తీసుకుపోయారు. దరఖాస్తు ఫారమ్ లభించనివారు జిరాక్స్ సెంటర్లలో కొనుగోలు చేస్తున్నారు.  ఆరు గ్యారంటీల్లో ఎక్కువగా పెన్షన్లు, ఇండ్లకే  దరఖాస్తులు చేసుకుంటున్నారు. మహిళలకు రూ.2,500 సాయం, రూ.500కే గ్యాస్​సరఫరా వంటి పథకాలకు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

దరఖాస్తుదారులకు రసీదులు అందజేస్తున్నామని, వారికి ఫోన్​ ద్వారా మెసేజ్ ​పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరూ తొందర పడవద్దని, కేంద్రాల వద్దనే ఉచితంగా దరఖాస్తులను అందజేస్తున్నట్టు సూచించారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఎప్పటికప్పుడు  స్పెషల్ అధికారులు, డీసీలను అడిగి తెలుసుకుంటున్నారు. జనం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు.