రికార్డుల నిర్వహణలో పారదర్శకత కరువు

రికార్డుల నిర్వహణలో పారదర్శకత కరువు

పాలనలో పారదర్శకత,  జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి  ప్రభుత్వ రికార్డులు కీలకపాత్ర పోషిస్తాయి.  ప్రభుత్వశాఖలు,  సంస్థలు  నిర్వహించే  నిత్య విధులలో భాగంగా ప్రభుత్వ రికార్డులు కీలకమైన సమాచారం అందిస్తాయి. ప్రభుత్వ కార్యకలాపాలు  రికార్డుల ద్వారా  నిర్వహించడం  ప్రజలకు విశ్వాసం కలిగించడమే కాకుండా  వారికి ఎవరు ఏం పని చేశారనే  సమాచారం ఇస్తాయి.  

ప్రభుత్వ రికార్డులలో అనేకరకాల దస్త్రాలు, పత్రాలు, ఫైళ్లు, నివేదికలు, ఆస్తి రికార్డులు, కోర్టు రికార్డులు, ప్రభుత్వ ఆర్థిక రికార్డులు, ఖర్చులు, బిల్లులు, రసీదులు వగైరా రికార్డులు ఉంటాయి. ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రైవేటు సమాచారం కూడా ప్రభుత్వ రికార్డుగానే పరిగణిస్తారు. 

జనన, ధృవీకరణ పత్రాలు,  మరణ ధృవీకరణ పత్రాలు,  వివాహ లైసెన్స్‌‌లు,  విడాకుల డిక్రీలు వంటి ముఖ్యమైన రికార్డులు కూడా  ప్రభుత్వం నిర్వహిస్తోంది.  డీడ్‌‌లు,  తనఖాలు,  ఆస్తిపన్ను రికార్డులు,  భూమి జోనింగ్ అనుమతులతోసహా  ఆస్తి రికార్డులు, ఆస్తి యాజమాన్యం,  లావాదేవీలు కూడా ఇందులోకి వస్తాయి.  కోర్టు రికార్డులు,  క్రిమినల్ రికార్డులు,  సివిల్ కేసు ఫైళ్లు,  దివాలా దాఖలు,  ప్రోబేట్ రికార్డులు వంటి చట్టపరమైన చర్యలు, అమలును కూడా నమోదు చేస్తాయి. 

పబ్లిక్ రికార్డ్ అంటే..

పబ్లిక్ రికార్డ్ అంటే సాధారణంగా ఒక ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వ సంస్థ విధి నిర్వహణలో భాగంగా చట్టం ప్రకారం తయారుచేసి ఉంచాల్సిన రికార్డు.  ఇది పౌరుల తనిఖీ, పరిశీలన, కాపీకి లోబడి ఉంటుంది.  ప్రభుత సంస్థ లేదా  ప్రభుత్వ అధికారి తయారుచేసే సంప్రదాయ లిఖిత రికార్డులను మాత్రమే కాకుండా ఫొటోలు, మ్యాప్‌‌లు, వీడియోలు, వాయిస్‌‌ మెయిల్‌‌లు, వెబ్‌‌పేజీలు, ఇమెయిల్‌‌లు, టెక్స్ట్ సందేశాలు, సోషల్ మీడియా కంటెంట్‌‌ను కూడా కలిగి ఉంటుంది. 

రాయడం అంటే చేతిరాత,  టైప్‌‌రైటింగ్,  ప్రింటింగ్,  ఫొటో-స్టేటింగ్,  ఫొటోగ్రాఫింగ్, అక్షరాలు, పదాలు, చిత్రాలు, శబ్దాలు లేదా చిహ్నాలు లేదా అన్ని కలగలిపిన రికార్డుకి మాత్రమే పరిమితం కాదు.  రికార్డ్ చేయడానికి ప్రతి సమాచార మార్గం కూడా ఇందులో భాగమే.  దేశంలో రికార్డులు భారతదేశంలో ప్రభుత్వ రికార్డులు పాలనలో ప్రభుత్వంలో నిర్ణయం తీసుకునే ప్రక్రియలను ప్రతిబింబించే కీలకమైన పత్రాలుగా పనిచేస్తాయి. ఈ రికార్డులలో కొనుగోలు ఆర్డర్లు, ప్రయాణ రికార్డులు, ఎన్నికల అఫిడవిట్లు వంటి విస్తృతశ్రేణి పత్రాలు ఉన్నాయి. 

 ప్రభుత్వ రికార్డులు ప్రభుత్వ అధికారులు నిర్ణయాలు ఎలా తీసుకుంటారనే పద్ధతిపై సమాచారాన్ని అందిస్తాయి. అవినీతి ఉన్నది అని రుజువు చేయడానికి..నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అన్నది చాలా కీలక అంశం. అవినీతి రహిత, పారదర్శక పాలనకు నిదర్శనం ప్రభుత్వ రికార్డులు. వాటి ప్రభుత్వ రికార్డుల నిర్వహణ, అవి పౌరులకు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి వంటి ప్రాతిపదికన మనం గుర్తించవచ్చు.

 ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ కూడా ప్రభుత్వ రికార్డులే. పౌరులకు అవి నిత్యం అందుబాటులో ఉండాలి.  ప్రభుత్వ రికార్డులకు కూడా చట్టాలు ఉన్నాయి. భారత్​లో రికార్డుల నిర్వహణ 1993 పబ్లిక్ రికార్డ్స్ చట్టంతో సహా వివిధ చట్టాలకు లోబడి ఉంటుంది. 

ప్రజా రికార్డుల నిర్వహణ, యాజమాన్యం, నియంత్రణ, సంరక్షణ లక్ష్యంగా ఉన్న ఏకైక చట్టం 1995లో అమలులోకి వచ్చింది. 1995 కు ముందు, ఆ తరువాత కూడా ప్రభుత్వాల పనితీరులో మార్పులు వచ్చినా ప్రభుత్వ రికార్డుల సంరక్షణ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టి లేదు. ప్రభుత్వ రికార్డుల పట్ల పూర్తి నిర్లక్ష్యం దేశమంతటా అన్ని స్థాయిలలో స్పష్టంగా కనపడుతోంది.

డిజిటలీకరణ దిశగా..

ఇప్పటికే అనేక సవాళ్ళు ఉండగా, ఈ మధ్య ప్రభుత్వ రికార్డులు కంప్యూటరీకరణ దాటి డిజిటలీకరణ దిశగా పయనిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యకలాపాలు వెబ్​సైట్, డేటాబేస్,  యాప్​ ద్వారా నిర్వహణకు పూనుకున్నది. అయితే, ఇక్కడ ప్రధానంగా మరుగునపడుతున్న అంశం ఆయా డిజిటల్ రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉండే రూపంలో నిర్వహించకపోవటం, అసలు అందుబాటులోకి రాకపోవటం.  ప్రైవేటు వ్యక్తుల కనుసన్నలలో ఈ రికార్డులు తయారుకావటం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపించటం ఒక రకం సవాళ్లు కాగా,  పాత ప్రభుత్వ రికార్డులకు వీటికి మధ్య పొంతన లేకపోవటం కూడా ఒక ప్రధాన అంశం. 

భూ రికార్డుల విషయంలో ఈ సమస్య స్పష్టంగా కనపడుతోంది.  అనేక గ్రామీణుల సమాచారం డిజిటల్ రికార్డులలో  గల్లంతు కావడం ఆయా పౌరులకు జీవన్మరణ సమస్యగా మారింది. అస్సాం,  బిహార్  రాష్ట్రాలలో కేంద్ర ఎన్నికల కమిషన్​ చేపట్టిన ఓటర్ల సరికొత్త నమోదు ప్రక్రియలలో ప్రభుత్వ రికార్డుల లోపభూయిష్ట నిర్వహణ వల్ల స్థానికులు, పౌరులు తమ ఉనికినే కోల్పోయే పరిస్థితి దాపురించింది.  ప్రజల దగ్గర ఉన్న ప్రభుత్వం ఇచ్చిన రికార్డును అంగీకరించరు, ప్రభుత్వ వద్ద రికార్డులు లేనే లేవు. ఇదే సమస్య 
భూ రికార్డుల విషయంలో పునరావృతం అవుతున్నది.  

కొరవడిన జవాబుదారీతనం

ప్రభుత్వ విధులను డిజిటలైజ్ చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో ఇంకొక పెద్ద లోపం డూప్లికేట్ రికార్డులు సంరక్షించకపోవటం.  ప్రభుత్వ పెద్దలమీద జవాబుదారీ లేకపోవటం. ప్రభుత్వ రికార్డుల పట్ల బాధ్యతగా నిర్ణయాలు తీసుకోకపోవటం కూడా ప్రజలకు శాపంగా మారింది.  ప్రభుత్వ డిజిటల్ రికార్డులకు సంబంధించి ఎటువంటి నిబంధన లేదు. 

ప్రభుత్వ రికార్డుల చట్టం 1995 మారుతున్న రికార్డుల రూపం, తీరు, వగైరా సవాళ్ళకు అనుగుణంగా సంస్కరించలేదు.  చట్టం, విధి విధానాల మీద కనీస సమీక్ష కూడా లేదు.   రెడ్ టేపిజం తగ్గాలంటే కంప్యూటరీకరణ ద్వారా సాధ్యం అని భావిస్తూ ప్రభుత్వ రికార్డుల నిర్వహణ వివిధ దశలలో వివిధ ప్రభుత్వాధినేతలు లక్ష్యాలు లేని మార్పులకు శ్రీకారం చుట్టారు. 

 ప్రభుత్వ రికార్డుల నిర్వహణ. పారదర్శకతను పెంచుతుంది అని భావిస్తే అసలు రికార్డులు లేని పరిస్థితికి చేరుకున్నాం.  పాత ప్రభుత్వ రికార్డులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ప్రైవేటు సంస్థలకు కూడా వాటి నిర్వహణలో భాగస్వామ్యం కల్పించడంతో పౌరులకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయి.   

కొందరు వ్యక్తులు, కొన్ని సందర్భాలలో అధికారులతో కుమ్మక్కు అయిన బృందాలు ఈ రికార్డులను తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ, ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారు.  ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడానికి ఈ ‘మార్పు కాలం’ అవినీతిపరులకు, అసాంఘిక శక్తులకు ఒక అవకాశంగా మారింది.

ప్రజా రికార్డుల చట్టాలు

కేంద్ర ప్రభుత్వం,  కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన సంస్థలు,  ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, కార్పొరేషన్లు, కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన ద్వారా ఏర్పాటు చేసిన కమిషన్లు.  కమిటీల  ప్రజా రికార్డుల తయారీ, నిర్వహణ,  సంరక్షణకు ఉన్న ఏకైక చట్టం పబ్లిక్ రికార్డ్స్ చట్టం,1993.  అయితే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 కూడా దీనికి సంబంధించిన చట్టం. 

 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 261 ప్రకారం దేశమంతటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు, రికార్డులు, న్యాయస్థానాల తీర్పులకు, రికార్డులకు పూర్తి విశ్వాసం,  గుర్తింపు ఇవ్వాలి.ఈ నిబంధన దేశవ్యాప్తంగా  ప్రజా రికార్డులను గుర్తిస్తూ,  గౌరవించాలని ఆదేశిస్తున్నది.  రాజ్యాంగంలో ఉన్న అధికరణను సాకారం చేసే చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుపై ఉంది.

- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​-