సీఎం కేసీఆర్​లో అవగాహన లోపం

సీఎం  కేసీఆర్​లో అవగాహన లోపం

ప్రజాస్వామ్యంలో ఉన్న కొన్ని గొప్ప విశిష్టతలలో ఒకటి శాస్త్రీయ కోణం. అనేక వర్గాల, అభిప్రాయాల మధ్య సంఘర్షణలో చివరికి వచ్చే ఫలితం శాస్త్రీయంగా ఉంటేనే ప్రజాస్వామ్యానికి బలం. రాగద్వేషాలకు, సిద్ధాంతాలకు, నమ్మకాలకు అతీతంగా, శాస్త్రంలో ఇమిడి ఉన్న పద్ధతి అందరికీ ఆమోదయోగ్యమైన ఫలితాలను ఇస్తుంది. అన్యాయానికి, ఆశ్రిత పక్షపాత ధోరణికి అడ్డుకట్ట శాస్త్రీయ పద్ధతి ద్వారా వస్తుంది. పౌరులకు అందే ఫలితాలు శాస్త్రం ఆధారంగా ఉంటేనే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పెరుగుతుంది. అన్ని రకాల ఒత్తిడులను తట్టుకుని నిలబడే శక్తి శాస్త్రీయ దృక్పథం ద్వారానే వస్తుంది. నాయకత్వం నుంచి ఆశించే నిర్ణయాలు శాస్త్రీయంగా ఉంటే పౌరుల మన్ననలు సుస్థిరంగా ఉంటాయి. 

భారతదేశం వంటి వైవిధ్యం గల దేశంలో ప్రజాస్వామ్యం ఇచ్చే బలం అంతా ఇంతా కాదు. సైన్స్ సూత్రాలను పాలనలో పాటిస్తే ప్రజాస్వామ్యం వికసిస్తుంది. సామాజిక న్యాయం, సమానత్వం వంటి లక్ష్యాలు చేరుకోవడం చాలా సులువు. ప్రభుత్వం సుస్థిరంగా మనగలిగే అవకాశాలు ఎక్కువ. అయితే శాస్త్రీయ ఫలితాలు, టెక్నాలజీని తమ రాజకీయ అవసరాలకు వాడుకునే నాయకులకు శాస్త్రాల మీద అవగాహన లేకపోవడం మనం చూస్తున్నాం. వారి అజ్ఞానం ఆశ్చర్యం కలిగిస్తుంది. భూమి మీద జరుగుతున్న వాతావరణ మార్పు, జన్యు మార్పిడి లేదా నానో టెక్నాలజీ వంటివి ఈ రాజకీయ నాయకులకు ఎంతవరకు అర్థం అవుతున్నాయని అనే విషయం పక్కన పెడితే.. ఏదైనా టెక్నాలజీ వస్తే మాత్రం అది తమ ఘనతగా చెప్పుకోవడం విస్తుగొల్పుతుంది. 

కేసీఆర్​లో అవగాహన లోపం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు తాను అనేక పుస్తకాలు చదివినట్టు చెబుతూ తనకు జ్ఞానం ఉందని భ్రమ కల్పిస్తుంటారు. కరోనా వ్యాప్తి గురించి ఆందోళన ఉన్నప్పుడు తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ హేళనగా ఒక జ్వరం గోలి వేసుకుంటే తగ్గిపోతుందన్నారు. మాస్కులు కూడా అవసరం లేదని అన్న ఆయన తదుపరి అవసరం లేకున్నా కరోనా నిబంధనలు తీవ్ర స్థాయిలో అత్యంత కఠినంగా అమలు చేయడం చూశాం. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న తరుణంలో సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తన అజ్ఞానాన్ని విజ్ఞానంగా ప్రదర్శించడం కూడా చూశాం. జులై 2022లో గోదావరి ప్రాంతంలో విపరీత వర్షాల వల్ల వరదలు, క్లౌడ్‌‌‌‌బరస్ట్​లను "ఇతర దేశాల కుట్రగా" అభివర్ణించి సమస్య తీవ్రత తగ్గించి, చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం మన ముఖ్యమంత్రి చేశారు. 

నీరు, నీటి యాజమాన్యం, ఇరిగేషన్, పరివాహక ప్రాంతం వంటి విషయాల మీద తెలంగాణ నాయకత్వ  అవగాహన లోపభూయిష్టం. కొవిడ్-19 మహమ్మారిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రకటనలు చేశారు. ఏప్రిల్ 2020లో  వైద్యులకు కావాల్సిన గ్లోవ్స్,  పీపీఈ కిట్​ల కొరత మీద వార్తలు ప్రచురించినందుకు మీడియాపై విరుచుకుపడ్డాడు.  జూన్ 2020లో సామాజిక వ్యాప్తి లేదు అని ఐసీఎంఆర్ చెప్పింది అని కారణం చూపెట్టి కరోనా లక్షణాలు లేని వ్యక్తులను వైద్యులు పరీక్షించరు అని నిర్ణయం తీసుకున్నారు.  మార్చి 2020 లో ప్రజలు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను ఉల్లంఘిస్తే  “చూడగానే కాల్చండి” ఆదేశాలను విధించడానికి తన ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు.

 ఏప్రిల్ 2020లో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ, ఎత్తివేస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయన్నారు. ఈ సమస్య మీద వరుస పత్రికా సమావేశాలు పెట్టిన ముఖ్యమంత్రికి ఎక్కడ నుంచి జ్ఞానం వచ్చింది?  డాక్టర్లు చెప్పాల్సిన విషయాలు ఈయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది?  ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధనలు చేస్తూంటే ఈయన తానే పరిశోధించినట్టుగా, తనకే తెలుసు అన్నట్టుగా ఎందుకు ప్రవర్తించారు.  పాలనా సమీక్ష, ప్రకటించాల్సిన దీర్ఘకాలిక వ్యూహాలు తరువాత పూర్తిగా విస్మరించారు. ఎప్పటికప్పుడు గొర్రె దాటుడు తరహా అడుగులు వేయడం తప్ప శాస్త్రీయ సమీక్ష చేయలేదు.

అన్నిటిలో పాశ్చాత్య విజ్ఞానం పనికిరాదు

కొన్నియేండ్ల కిందట, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపూర్ జిల్లాలో జపనీస్ ఎన్సేఫలిటిస్ (మెదడువాపు లక్షణాలు)తో ప్రజలు ఇబ్బంది పడి కొందరు చనిపోతే, అప్పటికి ఆయనకున్న ‘విజ్ఞానం’ మేరకు పందులు అన్నింటిని చంపమని ఉత్తర్వులు ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి పత్రికా సమావేశాలు పెట్టి దోమ యెట్లా కుడతది దగ్గర నుంచి పందులలో వైరస్ పెరుగుతుంది కనుక సమూలంగా నిర్మూలిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని నమ్మి తన అశాస్త్రీయ ఆలోచనని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. పందులే కారణం అయితే మరి పందులను పెంచుతూ దాదాపు వాటితో సహజీవనం చేసే ఎరుకల జాతి ఎప్పుడో  తుడిచిపెట్టుకుపోయేది. ఈయన ఆదేశాల మేరకు పందులని చంపే కార్యక్రమంలో ఒక అపశ్రుతి కూడా జరిగింది. ఒక మేయర్ పంది మీద ఎయిర్ గన్ పేలిస్తే చెత్త ఏరుకునే వ్యక్తి చనిపోయినాడు. అడవుల క్షీణతకు మేకలు కారణం అని పత్రికా సమావేశాలు పెట్టి తన అజ్ఞానం ప్రదర్శించిన సందర్భం కూడా ఉన్నది.

పాలకులు ఖచ్చితమైన ప్రకటనలు చేయాలి

మార్కెట్లో వచ్చే టెక్నాలజీనే తాము తీసుకువచ్చిన ‘అభివృద్ధి’గా మలిచే ప్రయత్నం ఈ రాజకీయ దార్శనిక అధినాయకులు చేస్తుంటారు. వారి వెంటే ఉండే భజన బ్యాచ్ దానికి తగిన వాదనలతో ప్రజలను మభ్యపెడతారు. శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నిరంతరం అన్వేషించాలి. మనకున్న పరిజ్ఞానం ఏ దశలో,  ఏవిధంగా, ఎంత మేరకు సర్వజన సంక్షేమం కోసం ఉపయోగపడుతుందో అలోచించి, సంప్రదించి అమలు చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు. అటువంటి పాలనా పద్ధతుల వల్ల ప్రజలు లబ్ధి పొందితే సంతోషిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి అవసరమైనప్పుడే రాజకీయ నాయకులకు ‘శాస్త్రం’ టెక్నాలజీ గుర్తుకు వస్తాయి. తెలంగాణలో  హైదరాబాద్ ఫార్మా ఉత్పత్తుల రాజధానిగా నిత్యం వల్లె వేసే నాయకులు అదే ఫార్మా పరిశ్రమ వల్ల నిత్యం జరుగుతున్న కాలుష్యం గురించి మాట్లాడరు. కాలుష్యం బారిన పడి ప్రాణాలు, జీవనోపాధి కోల్పోయిన గ్రామీణ కుటుంబాల గురించి ప్రస్తావన కూడా చేయరు. 

శాస్త్రీయత లేని ఎత్తిపోతలు అనర్థం

నీరు పల్లమెరుగు అనే నానుడి ఉండగా తెలంగాణా విస్తీర్ణం అంతటా అనేక నదులు, ఉపనదులు, వాగులు ఉండగా, మేడిగడ్డ దగ్గర నీరు తెలంగాణా పీఠభూమి కంటే కింద ఉంది. కాలుష్యం గురించి, పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి, వడదెబ్బ మరణాలు తెలంగాణలో పెరిగినా అటువంటి సమస్యల గురించి వీసమెత్తు ఆలోచన చేయని పాలన కూడా అశాస్త్రీయమే. 2020 నుంచి తెలంగాణలో తరచూ సంభవిస్తున్న వరదలు, గుట్టల విధ్వంసంతో అస్తవ్యస్తమవుతున్న నీటి వనరులు, నదీ పరీవాహక ప్రాంతాల గురించి మాట్లాడకుండా కేవలం ఎత్తిపోతల పథకాల గురించి ఊదరగొట్టడం కూడా అశాస్త్రీయ పాలనకు అద్దం పడుతున్నది. పాలకులు శాస్త్రీయంగా ఖచ్చితమైన, విశ్వసనీయ ప్రకటనలు చేయడం ముఖ్యం. అవి చేయాలంటే ప్రభుత్వం ప్రతి విషయంలో విధానాలు తయారు చేయాలి. ఈ విధానాల ఆధారంగా ప్రభుత్వం పాలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.

సంక్షోభ సమయంలో దిశానిర్దేశం

సంక్షోభ సమయాలలో ప్రజలు నాయకత్వం దిశానిర్దేశం కోసం తమ రాజకీయ నాయకుల వైపు చూస్తారు. మహమ్మారి వంటి ముప్పును ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి తో సహా ప్రభుత్వ సామర్థ్యంపై ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అతి పెద్ద సవాలును సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కేసీఆర్ పరిపాలన విఫలమైంది. అధికారంలో ఉన్నవాళ్ళకు అన్ని రంగాలలో జ్ఞానం ఉంటుంది అని ఎవరూ భావించరు, ఆశించరు. పాలకులు సమస్య వచ్చినప్పుడు సమావేశాలు పెట్టి విస్తృతంగా సంప్రదింపులు జరిపి, నిపుణులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో కనపడే ప్రక్రియ, పాటించాల్సిన పద్దతి. ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే దారి ఇది. 

నియంతలు కూడా ఇదే పద్ధతి పాటిస్తారు. కాకపోతే బహిరంగంగా చేసే అవకాశాలు తక్కువ. ఇటీవల కంపెనీలు తమ ఉత్పత్తులు, తమ వ్యాపారాలు ప్రభుత్వ నిధుల ద్వారా పెంపొందించేందుకు పాలకుల దరి చేరి సైన్స్, విజ్ఞానం, కొత్త టెక్నాలజీ అని కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు, ఉత్పత్తులను అంటగడుతున్నారు. వారితో ‘ప్రైవేటు’ భేటిల అనంతరం పాలకులు తమ విజ్ఞానం పెరిగింది, తమకే తెలుసు అనే భావనలో ఉంటారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒకప్పుడు ప్రత్యేక విమానంలో చైనా వెళ్లి రావడం, వచ్చినాక అక్కడి పరిస్థితులను గొప్పగా వర్ణించి ఇక్కడ ఏదో చేస్తా అని ప్రకటించడం చూశాం. అంతే ఆ తరువాత చైనా తరహా అభివృద్ధి ఇక్కడ ఆచరించేందుకు కార్యాచరణ దిశగా ఒక్క అడుగు వేయలేదు.

ప్రజాధనంతో విదేశీ పర్యటనలు

ప్రజాధనం ఉపయోగించి విదేశాలకు విహార యాత్రలు చేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ ఉద్దేశ్యం అక్కడ పాటిస్తున్న ‘అభివృద్ధి’ తెలుసుకోవడానికే అని ప్రకటిస్తారు. వాస్తవానికి అక్కడికి వెళ్ళే ముందుగాని, అక్కడ సమావేశాలలోగాని, వచ్చిన తరువాతగాని ఆయా విషయాలలో లోతులు వీళ్ళకు పిసరంత కూడా అర్థం కాదు. పోనీ నేర్చుకున్న విషయాలు ఇక్కడ సమావేశాలు పెట్టి, సమీక్షలు చేసి సరైన నిర్ణయాలు తీసుకుంటారా అంటే అదీ లేదు.  తెలంగాణ ఏర్పడినాక అనేక బృందాలు, మంత్రులు, అధికారులతో సహా విదేశాలు వెళ్లి వచ్చి తమ విహార తృష్ణ తీర్చుకున్నారు. కానీ, ప్రజలకు మేలు చేసేవిధంగా తమ జ్ఞానం పెంచుకున్న దాఖలాలు లేవు. తగిన విధానాలు ప్రకటించిన సందర్భాలు చాలా తక్కువ.

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​