రన్నింగ్ ట్రైన్‌ నుంచి పడి యువతి మృతి

రన్నింగ్ ట్రైన్‌ నుంచి పడి యువతి మృతి

రన్నింగ్ ట్రైన్‌లోనుంచి పడి 22 ఏళ్ల యువతి మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. డొంబివాలిలోని భోపార్ నివాసి అయిన చార్మి ప్రసాద్ ఉదయం 9:30 గంటల సమయంలో సిఎస్ఎంటికి వెళ్లే రైలు నుండి కింద పడింది. అది గమనించిన ప్రయాణికులు తీవ్రగాయాలపాలైన ఆమెను శాస్త్రి నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా చార్మి మృతిచెందింది. చార్మి ఘట్కోపర్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంది.

డొంబివాలి, కోపర్ స్టేషన్ల మధ్య యువతి రైలు నుంచి కింద పడినట్లు రైల్వే ఇన్‌స్పెక్టర్ సతీష్ పవార్ తెలిపారు. రైలులో బాగా రద్దీగా ఉండటం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పవార్ తెలిపారు.

బాగా రద్దీగా ఉండే ముంబై సబర్బన్ రైల్వే వల్ల రోజూ కనీసం 8-10 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది ట్రాక్‌లు దాటుతున్నప్పుడు, రద్దీగా ఉండే రైళ్ల నుంచి పడిపోతూ చనిపోతున్నారు. జనవరి 2010 నుంచి సెప్టెంబరు 2019 మధ్య సబర్బన్ రైలు ప్రమాదాల వల్ల దాదాపు 27,000 మంది చనిపోయినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది.