ప్రమాదంలో సంగారెడ్డి పెద్ద చెరువు.!

ప్రమాదంలో సంగారెడ్డి పెద్ద చెరువు.!

సంగారెడ్డి/జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని లక్డారం పెద్ద చెరువు క్వారీల కారణంగా కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరిస్తున్న ప్రభుత్వం అదే చెరువుల పక్కన క్వారీలకు పర్మిషన్లు ఇచ్చి పరోక్షంగా వాటి మనుగడకు ముప్పు  తెస్తోంది. పటాన్ చెరు మండలం లక్డారం పెద్ద చెరువు పక్కన సర్వే నంబరు 747లో 10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కంకర క్వారీకి పర్మిషన్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కేవలం పంచాయతీ తీర్మానంతో పర్మిషన్ ఇవ్వడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్వారీ అనుమతులను రద్దుచేసి చెరువును కాపాడాలని కోరుతూ గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు. మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నారు. 

ఇదీ పరిస్థితి..

పెద్ద చెరువుకు 100 మీటర్ల దూరంలో కేఎస్ఆర్ మైనింగ్ క్వారీకి పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు కింద 3వేల ఎకరాలు సాగులో ఉన్నాయి. సుమారు 600 మంది రైతులు ఈ చెరువునే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. ఈ గ్రామ పరిధిలో ఉన్న క్రషర్ల వల్ల ఇండ్లు బీటలు వారుతున్నాయని, ఇప్పుడు మళ్లీ మరో కంకర క్వారీని చెరువు పక్కన ఏర్పాటు చేస్తే కట్టకు ప్రమాదం ఏర్పడి లక్డారం గ్రామం నీట మునుగుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. క్వారీ వల్ల కట్ట దెబ్బతిని వ్యవసాయానికి అడ్డంకులు ఏర్పడతాయని రైతులు భయపడుతున్నారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే దీక్షలకు దిగినట్లు చెబుతున్నారు. క్వారీ అనుమతులు రద్దు చేసే వరకూ పోరాడుతా మని స్పష్టం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పెద చెరువు పక్కన క్వారీ పనులు నిలిపేయాలని  కోరుతున్నారు. 

మా గోడు వినేదెవరు..?

మా ఊరి చుట్టుముట్టూ ఉన్న కంకర క్వారీలతో ఇబ్బందులు పడుతున్నం. ఇప్పుడు మళ్లీ కొత్త క్వారీ ఏర్పాటు చేస్తున్నరు.  అది  చెరువు పక్కనే ఉంది. కట్ట పగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. అందుకే దీక్షలు చేస్తున్నం. క్వారీ పర్మిషన్ రద్దు చేసేదాకా పోరాడుతం. 
- చంద్రశేఖర్ గౌడ్ , స్థానికుడు

నిబంధనల ప్రకారమే పర్మిషన్.. 

లక్డారం గ్రామంలో నిబంధనలకు అనుగుణంగానే కంకర క్వారీకి పర్మిషన్  ఉంది. క్వారీ వల్ల చెరువుకు ఇబ్బందేమీ లేదు. కొందరు కావాలని క్వారీని వ్యతిరేకిస్తున్నారు. 
- మధు కుమార్, మైనింగ్ ఏడీ