3 నెలలుగా పెండింగ్​లో లక్షన్నర రిజిస్ట్రేషన్లు

3 నెలలుగా పెండింగ్​లో లక్షన్నర రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్, వెలుగు: నాన్‌ అగ్రికల్చర్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్లపై డైలమా కొనసాగుతోంది. ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చే ముందు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌ వేసింది. మూడు నెలలుగా ప్లాట్లు, ఇతర ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెళ్లిళ్లు, పిల్లల చదువుల ఫీజుల కోసం అప్పుల పుట్టక, ఉన్న ఆస్తిని అమ్ముదామంటే కొనేవాళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ధరణి పోర్టల్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతుండటంతో అది ఎప్పటికీ తేలుతుందో తెలియడం లేదు. అయితే రిజిస్ట్రేషన్లకు, తమ విచారణకు ఎలాంటి సంబంధం లేదని హైకోర్టు మంగళవారం క్లారిటీ ఇచ్చింది. నాన్‌ అగ్రికల్చర్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఈ నెల 10 నుంచి పాత పద్ధతిలో కొనసాగించవచ్చని చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులపై సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇన్నాళ్లు కోర్టు ఆదేశాల పేరుతో రిజిస్ట్రేషన్లను పెండింగ్‌ పెట్టిన సర్కారు.. దానిపై స్పష్టత వచ్చిన తర్వాత కూడా రివ్యూ చేయలేదు. బుధవారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించే అవకాశమున్నట్టు మాత్రం తెలిసింది. మొత్తంగా ఈ వ్యవహారం రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలపైనా తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బుధవారం ఆందోళనకు దిగుతున్నారు.

మూడు నెలలుగా పెండింగ్‌ లోనే..

ధరణిలో నమోదైన వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండగా.. నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు మాత్రం ఆగిపోయాయి. ఫలితంగా రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో 1.50 లక్షల డాక్యుమెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో అత్యవసరానికి ఆస్తులు, ప్లాట్లు, ఇండ్లు అమ్ముకుందామనుకుంటున్న వారికి తిప్పలు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడంతో సర్కారుకు రూ.2 వేల కోట్ల ఆమ్దానీ ఆగిపోయింది. గత నెల 2న ధరణి పోర్టల్‌ ద్వారా అగ్రికల్చర్‌ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. అదే నెల 18 నుంచే నాన్‌ అగ్రికల్చర్‌ రిజిస్ట్రేన్లు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సాంకేతిక కారణాలతో 23వ తేదీకి వాయిదా వేశారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో మొత్తానికే రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌ పడింది.

అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్‌

ఆస్తి అమ్మేవాళ్లు, కొనేవాళ్ల మధ్య సేల్‌ అగ్రిమెంట్‌ ఉంటుంది. కొనుగోలు చేసేవారు అమ్మే వారికి మాట్లాడుకున్న ధరలో కొంత మొత్తాన్ని బయానాగా ఇచ్చి అగ్రిమెంట్‌ రాయించుకుంటారు. ఇలాంటి అగ్రిమెంట్ల వ్యాలిడిటీ 45 రోజులు మాత్రమే ఉంటుంది. ఇలా ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన 50 వేల అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు నిలిపోవడంతో క్యాన్సిల్‌ అయ్యాయి. ఇప్పుడు అమ్మేవాళ్లు మొండికేస్తే కొనుగోలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

నేడు రియల్టర్ల ధర్నా

ఎల్ఆర్ఎస్ పేరిట ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేడయంతో రియల్టర్లు ఆందోళనలు చేస్తున్నారు. మూడు నెలలుగా  పలు రకాలుగా నిరసన తెలుపుతున్నారు. ఇకనైనా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ లోని ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రియల్టర్లు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు, డాక్యుమెంట్ రైటర్లు, ప్లాట్ ఓనర్లు హాజరవుతారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ తెలిపారు.