ఎమ్మెల్యే సాబ్​.. జెర బిల్లులు.. ఇప్పించున్రి!... ఒక్కో సర్పంచ్​కు రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్

ఎమ్మెల్యే సాబ్​.. జెర బిల్లులు.. ఇప్పించున్రి!...  ఒక్కో సర్పంచ్​కు రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్

కరీంనగర్, వెలుగు :  గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్ లకు బిల్లులు రావడం లేదు. ఆర్నెళ్లుగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్​సీ) ఫండ్స్ రిలీజ్ కాకపోవడం, గ్రామ పంచాయతీ అకౌంట్లు ఫ్రీజింగ్ లో ఉండడంతో వారికి తిప్పలు తప్పడం లేదు. ఒక్కో సర్పంచ్ కు రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్ లో ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచులంతా సర్కార్ తీరుపై గుర్రుగా ఉన్నారు. తమకు రావాల్సిన బిల్లులు ఇప్పించాలంటూ ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్​ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొరపెట్టుకుంటున్నారు. ఎన్నికల వేళ సర్పంచ్ లు బిల్లులు అడుగుతుండడం బీఆర్ఎస్ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఫండ్స్​విడుదల తమ చేతుల్లో పని కాకపోయినా సర్కార్ జాప్యం వల్ల ఫీల్డ్ లో తాము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఏడాదిగా ఎస్ ఎఫ్ సీ ఫండ్స్ బంద్.. 

కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం ఫండ్స్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కలిపి గ్రామపంచాయతీలకు భుత్వం ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తుండేది. అయితే ఏడాది నుంచి సెంట్రల్ ఫండ్స్ నేరుగా నెలనెలా జీపీ అకౌంట్లలో క్రెడిట్ అవుతున్నాయి. అప్పటి నుంచి రాష్ట్ర సర్కార్  ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) నిధులు రావడం లేదు. ఎస్ఎఫ్​సీ ఫండ్స్ రాక ఏడాదికిపైగా అవుతోందని సెక్రటరీలు చెప్తున్నారు. దీంతో జీపీల్లోని అన్నీ పనులకు సెంట్రల్ ఫండ్సే దిక్కవుతున్నాయి. వాస్తవానికి కేంద్రం నిబంధనల ప్రకారం.. 15వ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ను స్కూళ్లు, అంగన్వాడీ బిల్డింగులు, క్లాస్ రూములు, రోడ్లు, డ్రైనేజీలు, హెల్త్ సబ్ సెంటర్లు, జీపీ బిల్డింగులు నిర్మాణం, తాగునీటి సౌకర్యం, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కల్పించేందుకు వాడాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్ సీ ఫండ్స్ ఇవ్వకపోవడంతో సర్పంచులు కేంద్రం ఇచ్చే నిధులను ట్రాక్టర్ ఈఎంఐలు కట్టేందుకు, డీజిల్ పోయించేందుకు, జీపీల కరెంటు బిల్లులు, మల్టీ పర్సస్ వర్కర్ల జీతాలు చెల్లించేందుకు వాడుతున్నారు. అవి కూడా సరిపోనప్పుడు చాలా చోట్ల సర్పంచ్ లే అప్పులు చేసి ఖర్చులు వెళ్లదీస్తున్నారు. 

20 లక్షలు  పెండింగ్​లో ఉన్నయి.. 

ప్రతి సర్పంచ్ కు దాదాపు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల బిల్లులు రావాల్సి ఉంది.  మా జీపీకి 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రాలేదు. రికార్డు పూర్తయినా సుమారు రూ.10 లక్షల బిల్లులు డ్రా చేయలేని దుస్థితి.15వ ఫైనాన్స్ గ్రాంట్ ప్రతినెలా కేంద్ర ప్రభుత్వం వేస్తే అవి సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ పేమెంట్లు, కరెంట్ బిల్లులు, డీజిల్, శానిటేషన్ కు ఖర్చు చేస్తున్నాం. సర్పంచులు అప్పులు చేసి పనులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాం. నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.20 లక్షల వరకు రావాలి.
- బింగి కరుణాకర్, సర్పంచ్, రంగాపూర్, హుజురాబాద్

బతుకమ్మ పండుగ  ఏర్పాట్లకు పైసల్లేవ్.. 

ఈ నెల14న బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రతి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడేందుకు గ్రౌండ్ సిద్ధం చేయడం, లైటింగ్, ఇతర సౌకర్యాల కల్పనకు గ్రామాన్ని బట్టి ఒక్కో పంచాయతీలో కనీసం రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు అవసరముంటుంది. కానీ ఇప్పటికే చాలా పంచాయతీల అకౌంట్లు నిల్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. పండుగకు అప్పు చేసైనా ఏర్పాట్లు చేయకతప్పదని, అప్పులో మరో అప్పు అని సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఫొటోలో మానకొండూర్​ఎంపీడీఓ ఆఫీసు ముందు కాగితాలు పరుచుకుని కూర్చున్నది స్థానిక సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్. ఈయన  తన గ్రామంలో రూ.1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టగా ఆఫీసర్లు రూ.65 లక్షల పనులకే ఎంబీ రికార్డు చేశారు. మిగతా పనులను రికార్డు చేయడం లేదు. గతంలో ఏఈగా చేసిన తిరుపతి 8 శాతం కమీషన్ ఇస్తేనే ఎంబీ రికార్డ్ చేస్తానని, ఇవ్వకపోతే చేయనని  చెప్పడంతో సర్పంచులంతా కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​కు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను ట్రాన్స్ ఫర్ చేశారని పృథ్వీరాజ్ వెల్లడించాడు. ఇప్పటికైనా తాను పూర్తి చేసిన పనులకు బిల్లులు వచ్చేలా చూడాలని ఆఫీసర్లను కోరుతున్నాడు.