మీ మనీ సేఫ్: డిపాజిటర్లకు లక్ష్మివిలాస్ బ్యాంక్ భరోసా

మీ మనీ సేఫ్: డిపాజిటర్లకు లక్ష్మివిలాస్ బ్యాంక్ భరోసా

బ్యాంక్​ వద్ద తగినంత డబ్బు ఉంది

మెర్జర్ తర్వాత ఉద్యోగులూ సేఫ్

విలీనం కోసం డీబీఎస్ బ్యాంక్ రూ.2,500 కోట్లు

ముంబై: డిపాజిటర్లకు చెల్లింపులు జరపడానికి సరిపడినంత లిక్విడిటీ ఉందని లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) అడ్మినిస్ట్రేటర్‌ టీ ఎన్‌ మనోహరన్‌ బుధవారం చెప్పారు. డీబీఎస్‌ ఇండియాతో మెర్జర్‌ సకాలంలో పూర్తవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ డిపాజిట్లు రూ. 20 వేల కోట్లని, ఇక అడ్వాన్సెస్‌ (ఇచ్చిన అప్పులు) రూ. 17 వేల కోట్లని వెల్లడించారు. డిపాజిటర్ల భద్రతే తనకు ప్రధానమైన బాధ్యతని, వారి డిపాజిట్లకు ఎలాంటి ఢోకా లేదని మనోహరన్‌ తెలిపారు. డిపాజిటర్లకు చెల్లించడానికి తగినంత లిక్విడిటీ బ్యాంకుకు ఉందని కూడా స్పష్టం చేశారు.

మెర్జర్‌ తర్వాత కూడా ఎల్‌వీబీ ఉద్యోగులందరూ అవే జీతాలతో కొనసాగుతారని మనోహరన్‌ వెల్లడించారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లన్నింటిలోనూ సరిపడా డబ్బు ఉండేలా చర్యలు తీసుకుంటామని, డిపాజిటర్లెవరూ తమ డబ్బు వెనక్కి తీసుకునేందుకు బ్రాంచ్‌లకు పరుగులు పెట్టడం లేదని తెలిపారు. ఆర్థిక పరిస్థితి మరింత బలహీనమవడంతో మంగళవారం నాడు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌పై కేంద్ర ప్రభుత్వం నెల రోజులపాటు మారటోరియం విధించింది. దీంతో డిపాజిటర్లు రూ. 25 వేలకు మించి విత్‌డ్రా చేసుకోలేరు. మారటోరియం విధింపుతోపాటే, డీబీఎస్‌ బ్యాంక్‌తో విలీన ప్రపోజల్‌నూ ప్రకటించారు. దక్షిణాదిలోని ఎల్‌వీబీ ఫైనాన్షియల్‌గా దిగజారిపోవడంతో మారటోరియం విధించాలని ఆర్‌బీఐ రికమెండ్‌ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఎల్‌వీబీ బోర్డును రద్దు చేసి, పగ్గాలను తన చేతిలోకి తీసుకుంది ఆర్‌బీఐ. కెనరా బ్యాంక్‌ మాజీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ మనోహరన్‌ను లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌కు అడ్మినిస్ట్రేటర్‌గా ఆర్‌బీఐ నియమించింది. మారటోరియం అమలులో ఉండే 30 రోజులూ ఆయన అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగుతారని ఆర్‌బీఐ తెలిపింది. డీబీఎస్‌ మెర్జర్‌ ప్రపోజల్‌ను సూచనలు, సలహాల కోసం పబ్లిక్‌ ముందు కూడా పెట్టారు. మెర్జర్‌తో ఎల్‌వీబీ డిపాజిటర్లు, కస్టమర్లు, ఎంప్లాయీస్‌కు మేలు జరుగుతుందని, భవిష్యత్‌ మెరుగ్గా ఉంటుందని డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా వెల్లడించింది.

మెర్జర్‌ కోసం రూ. 2,500 కోట్లను డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియాకు సింగపూర్‌లోని మాతృసంస్థ డీబీఎస్‌ అంద చేస్తుంది. ఈ డబ్బును పూర్తిగా ఇప్పుడున్న  డీబీఎస్‌ వనరుల నుంచే సమీకరించనున్నారు. డీబీఎస్‌ ఇచ్చే క్యాపిటల్‌తో మరిన్ని అప్పులు ఇవ్వడం ఎల్‌వీబీకి వీలవుతుందని మనోహరన్‌ చెప్పారు. రెండు బ్యాంకుల మెర్జర్‌కు ఫైనల్‌ ప్రపోజల్‌ను ఆర్‌బీఐ ఈ నెల 20 న ప్రకటించనుంది. ఈ ఏడాదిలో ప్రతికూల పరిస్థితులలోకి వెళ్లిన రెండో ప్రైవేటు బ్యాంకు ఎల్‌వీబీ. ఇంతకు ముందు యెస్‌ బ్యాంక్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది.

చిన్న వాటికి కాకుండా పెద్ద పెద్ద కంపెనీలకు అప్పులు ఇవ్వడం మొదలు పెట్టడం వల్లే లక్ష్మీ విలాస్‌ బ్యాంకుకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఫలితంగా ఎన్‌పీఏలు గుట్టలుగా పెరిగిపోయాయి. దీంతో సెప్టెంబర్‌ 2019లో ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌ (పీసీఏ) కిందకు ఎల్‌వీబీని ఆర్‌బీఐ తెచ్చింది. సెప్టెంబర్‌ 2020తో ముగిసిన రెండో క్వార్టర్లో ఎల్‌వీబీకి రూ. 396.99 కోట్ల నష్టం వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ2లో బ్యాంకు నష్టం రూ. 357.17 కోట్లు. నికర ఎన్‌పీఏలు సెప్టెంబర్‌ 2020 క్యూ2 నాటికి 7 శాతం. 1926లో ప్రారంభమైన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 566 బ్రాంచ్‌లు, 918 ఏటీఎంలు ఉన్నాయి.

మొత్తం 19 రాష్ట్రాలు, ఒక యూనియన్‌ టెరిటరీలోనూ ఎల్‌వీబీకి కార్యకలాపాలున్నాయి. మారటోరియం విధింపుతో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేర్‌ బుధవారం ట్రేడింగ్‌లో 20 శాతం పతనమైంది. బీఎస్‌ఈలో ఎల్‌వీబీ షేర్‌ 20 శాతం తగ్గి రూ. 12.40 కి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈలో 19.94 శాతం తగ్గి రూ. 12.45 కి చేరింది.

ఫారిన్‌ బ్యాంక్‌తో మెర్జర్‌ వద్దు.. బ్యాంకింగ్‌ యూనియన్లు

సింగపూర్‌కి చెందిన డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియన్‌ సబ్సిడరీతో లక్ష్మీ విలాస్‌ బ్యాంకును విలీనం చేయొద్దని బ్యాంక్‌ ఉద్యోగుల యూనియన్లు కోరుతున్నాయి. ఈ నిర్ణయం దేశ ప్రయోజనాలను కాపాడేది కాదని పేర్కొంటున్నాయి. ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకుతో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దేశంలోకి ఫారిన్‌ బ్యాంకులకు ఎంట్రీ కల్పించేందుకే తాజా విలీన నిర్ణయం తీసుకున్నారని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ) ప్రెసిడెంట్‌ సునీల్‌ కుమార్‌ ఆరోపిస్తున్నారు.

మన దేశంలో బ్యాంకింగ్‌ రంగానికి బంగారు భవిష్యత్‌ ఉందని, అందుకే విదేశీ బ్యాంకులు ఇక్కడ విస్తరించేందుకు మెర్జర్స్‌ కోసం చూస్తున్నాయని చెప్పారు. హద్దులు లేకుండా విదేశీ బ్యాంకులను దేశంలో అనుమతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆ బ్యాంకులు వనరులను దోచుకుంటాయని సునీల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మెర్జర్‌ ప్రపోజల్‌ను మరోసారి పరిశీలించాలని ఆర్‌బీఐని కోరారు. దేశంలోని  పాత తరపు ప్రైవేటు బ్యాంకులు స్వతంత్రానికి ముందు నుంచీ ప్రభుత్వ రంగ బ్యాంకుల లాగే సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.

ఫారిన్‌ బ్యాంకుకు సబ్సిడరీగా మార్చే కంటే, ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో ఎల్‌వీబీని విలీనం చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కమర్షియల్‌ బ్యాంకింగ్‌ కాకుండా సోషల్‌ బ్యాంకింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నాయనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజా కోవిడ్‌–19 కాలాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకులతో ప్రభుత్వ రంగ బ్యాంకులను పోల్చడం సరయినది కాదని సునీల్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్