
- మార్కెట్ వ్యాల్యూ గజానికి రూ.10 వేలు
- తక్కువ పరిహారం చెల్లింపుపై ఆందోళన
- భారీగా నష్టపోతామంటున్న ల్యాండ్ లూజర్స్
- తప్పులు సవరించి, పరిహారం పెంచాలని డిమాండ్
- ఆర్బిట్రేషన్‌తో మెరుగైన పరిహారం వస్తుందంటున్న అధికారులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో భూముల రేట్లు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా గజానికి సుమారు రూ.10 వేలు పలుకుతోంది. ఎన్హెచ్63లో భాగంగా ముల్కల్ల–క్యాతన్‌పల్లి బైపాస్ రోడ్డు కోసం సేకరిస్తున్న భూములకు మాత్రం అతి తక్కువ పరిహారం చెల్లిస్తున్నారని ల్యాండ్ లూజర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏరియాను బట్టి గవర్నమెంట్వ్యాల్యూ గజానికి రూ.500 నుంచి రూ.వెయ్యిలోపే ఉండడంతో పరిహారం తక్కువగా వస్తోందని వాపోతున్నారు. మార్కెట్ రేటుకు అనుగుణంగా పరిహారం పెంచడంతోపాటు భూసేకరణ కోసం జారీ చేసిన నోటీసుల్లో చోటుచేసుకున్న తప్పులను సవరించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
బైపాస్‌తో భూముల రేట్లకు రెక్కలు
ఎన్హెచ్63లో భాగంగా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఫోర్‌లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం శివారులోని ముల్కల్ల నుంచి క్యాతన్‌పల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మించి ఎన్ హెచ్363తో లింక్ చేయనున్నారు. మొన్నటివరకు గజానికి నాలుగైదు వేలు పలికిన రేట్లు బైపాస్ రోడ్డు రావడంతో ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం గజానికి సుమారు రూ.10 వరకు పలుకుతోంది. క్యాతన్‌పల్లి, గద్దెరాగడి, అండాళమ్మ కాలనీ, రంగంపేట, వేంపల్లి, ముల్కల్ల ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. రెసిడెన్షియల్ ఏరియాలను ఆనుకొని బైపాస్‌రోడ్డు పోతుండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
రిజిస్ట్రేషన్ వ్యాల్యూ బట్టే పరిహారం
భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసేనాటికి ఆయా ప్రాంతాల్లో గవర్నమెంట్వ్యాల్యూ గజానికి రూ.500 నుంచి రూ.వెయ్యి లోపే ఉంది. మరికొన్ని ఏరియాల్లో అయితే రూ.300 మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఆధారంగా పరిహారం నిర్ణయించడంతో తమకు నష్టం జరుగుతోందని ల్యాండ్ లూజర్స్ వాపోతున్నారు.
ఉదాహరణకు క్యాతన్‌పల్లి శివారు సర్వే 10లో ఒకరిది 56 గజాల జాగ రోడ్డులో పోయింది. భూమికి సంబంధించిన నష్టపరిహారం రూ.52,662, వంద శాతం సొలాటియం ప్లస్,12 పర్సెంట్అడిషనల్ మార్కెట్ వ్యాల్యూ కలిపి మొత్తం రూ.1,19,903 చెల్లించారు. వాస్తవానికి అక్కడ మార్కెట్ రేటు గజానికి రూ.10 వేలు పలుకుతోంది. ఈ లెక్కన 56 గజాలకు రూ.5 లక్షల పైనే రావాల్సి ఉందని భూ యజమాని పేర్కొంటున్నాడు. ఆ ప్రాంతంలో భూములు పోతున్న వారందరిదీ ఇదే పరిస్థితి.
తప్పుల తడకగా సర్వే..
భూసేకరణ సర్వేలో అనేక అవకతవకలు జరిగాయని బాధితులు పేర్కొంటున్నారు. పట్టా ఒకరికి ఉంటే.. నోటీసులు మరొకరికి వచ్చాయని చెబుతున్నారు. అలాగే విస్తీర్ణంలో సైతం తప్పులు దొర్లాయని, ఒకరిది వంద గజాలు పోతుంటే.. 50 గజాలకే నోటీసు ఇచ్చారని వాపోతున్నారు. ముందుగా ఈ తప్పులు సవరించి అసలైన భూ యమజానులకే పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. వీటిని సరిచేసిన తర్వాతే గ్రామాల వారీగా భూసేకరణ అవార్డులను జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్బిట్రేషన్‌తో మెరుగైన పరిహారం
ఆయా ప్రాంతాల్లో గతంలో జరిగిన రిజిస్ట్రేషన్వ్యాల్యూ ప్రకారమే నష్టపరిహారం నిర్ణయిస్తాం. ల్యాండ్ లూజర్స్ ముందుగా వారికి మంజూరైన పరిహారం డబ్బులు తీసుకోవాలి. ఆ తర్వాత ఆర్బిట్రేషన్ కోసం కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా వారికి మెరుగైన పరిహారం వచ్చే చాన్సుంది. అలాగే కొంతమందికి ఓ సర్వే నంబర్లో పట్టా ఉంటే.. మరో సర్వే నంబర్లో పొజిషన్లో ఉన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారమే నోటీసులు జారీ చేస్తున్నాం. సర్వేలో ఎలాంటి తప్పులూ జరగలేదు. - శ్రీనివాసరావు, మంచిర్యాల ఆర్డీవో