హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మరో భూ వివాదం తెరమీదకు వచ్చింది. సీఆర్పీఎఫ్ బెటాలియన్ కోసం కేటాయించిన 10 ఎకరాలు మాదంటే మాదేనని కేయూ పోలీస్ స్టేషన్, వర్సిటీ వర్గాల మధ్య వివాదం మొదలైంది. కేయూ పీఎస్ ఏర్పాటు టైంలో వర్సిటీకి చెందిన రెండు ఎకరాలను స్టేషన్ కోసం అప్పగించారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కేంద్రం 1989లో హనుమకొండలో 58వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసింది.
బెటాలియన్ బిల్డింగ్, సిబ్బంది క్వార్టర్స్ కోసం కేయూ పోలీస్ స్టేషన్‌కు అనుకున్న ఉన్న, యూనివర్సిటీకి చెందిన 10 ఎకరాలను కేటాయించారు. ఇప్పటివరకు బెటాలియన్ అక్కడే కొనసాగింది. జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతో బెటాలియన్‌ను మణిపూర్‌కు తరలిస్తుండడంతో ఆ స్థలం ఖాళీ అయింది. దీంతో ఆ 10 ఎకరాలు తమకే చెందుతాయంటూ కేయూ పోలీసులు అంటుండగా, వర్సిటీకే చెందుతాయంటూ కేయూ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇన్‌చార్జి వీసి వాకాటి కరుణతో పాటు ప్రభుత్వం చొరవ తీసుకొని వివాదానికి తెర దించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.