రూలింగ్​పార్టీకి మైనస్​గా మారబోతున్నఅనుచరుల భూదందాలు

రూలింగ్​పార్టీకి మైనస్​గా మారబోతున్నఅనుచరుల భూదందాలు

హైదరాబాద్/ ఎల్బీ నగర్/కుత్భుల్లాపూర్/ కూకట్ పల్లి, వెలుగు: రియల్ ఎస్టేట్ కు కేరాఫ్​గా మారిన రంగారెడ్డి జిల్లాలో రూలింగ్​పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరుల భూదందాలు రూలింగ్​పార్టీకి మైనస్​గా మారబోతున్నాయి. ధరణిలో వేలాది ఎకరాల రికార్డులు మాయం కావడం, ఇల్లీగల్​రిజిస్ట్రేషన్ల కారణంగా భూములు కోల్పోయిన సామాన్య రైతులు న్యాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్లు హైదరాబాద్​చుట్టుపక్కల ఇండస్ట్రీస్​పేరుతో వేల ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించకపోవడం రైతుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. కొన్నిచోట్ల ఇల్లీగల్​మైనింగ్ కు వ్యతిరేకంగా నెలల తరబడి బాధితులు దీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. భూమి చుట్టూ నెలకొన్న ఇలాంటి ఇష్యూస్​గడిచిన నాలుగేండ్లలో ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చడంతో పాటు సిట్టింగుల ఇమేజ్​ను చాలావరకు దెబ్బదీశాయి. ఈ తరహా ప్రజావ్యతిరేకతకు తోడు సొంత పార్టీలోని అసమ్మతి బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలకు ప్రతికూలంగా మారింది. ఇదే అదనుగా ప్రతిపక్షాలు రాబోయే ఎన్నికల కోసం ప్రచారాస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. 

రాజేంద్రనగర్ ​అధికార పార్టీలో టికెట్ల పోటీ 

నియోజకవర్గంలో ప్రకాష్ గౌడ్ మూడు టర్మ్​లు ఎమ్మెల్యేగా గెలిచారు. సిట్టింగులకే టికెట్​ఇస్తామని సీఎం చెప్పడంతో ప్రకాష్ గౌడ్ తనకే కేటాయిస్తారనే ధీమాతో ఉన్నారు. మరోవైపు అధికార పార్టీ నుంచి పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి రేసులో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి జ్ఞానేశ్వర్, సీనియర్ నాయకుడు ముంగి జైపాల్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ లీడర్​బొక్క వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉండడం, బీఆర్ఎస్ లో వర్గపోరు ఎక్కువ కావడం కమలం పార్టీకి కలిసి వచ్చే అంశాలు. 

మహేశ్వరంలో బీఆర్ఎస్​కు కష్టకాలమే  

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్​ఎస్​లో చేరేప్పుడు వెంట వచ్చిన అనుచరులకే ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని చెప్పినా,  అంతగా డెవలప్​మెంట్​ కనిపించడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సొంత పార్టీలోనే ఉన్న సీనియర్​ లీడర్​ తీగల కృష్ణారెడ్డితో పడడం లేదు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్​పార్టీలు బలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికను బట్టి గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయి. బీజేపీ నుంచి అందెల శ్రీరాములు, కాంగ్రెస్ నుంచి బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీలో చేరిన తుక్కుగూడ మున్సిపల్​ చైర్మన్​ కాంటేకర్ మధుమోహన్ ఆ పార్టీ టికెట్​ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. 

కాంగ్రెస్​కు బలమైన అభ్యర్థి కరువు  

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ​నుంచి ఎమ్మెల్యే గాంధీకే టికెట్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి బీఆర్ఎస్​తో ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన గజ్జల యోగానంద్​మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్​ కొడుకు రవికుమార్​యాదవ్​ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు మొవ్వా సత్యనారాయణ, మరి కొందరు సీనియర్లు పోటీ పడుతున్నారు. వీరంతా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ ప్రాంతంలో పాగా వేయడానికి అవకాశాలున్నా...పార్టీలో  వర్గ పోరు నష్టం కలిగించే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్​కు గట్టి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థి దొరకడమే కష్టంగా మారింది. పార్టీలో సీనియర్ ​నాయకుడిగా ఉన్న జైపాల్ ​టికెట్​కోసం ట్రై చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ కూడా టికెట్ కోసం కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ఓ దఫా రేవంత్ తో చర్చించినట్టు సమాచారం . 

బీఆర్​ఎస్​లో వర్గపోరుతో బీజేపీకి లాభం 

ఎల్​బీనగర్​ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి గెలిచిన చరిత్ర లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల పొత్తుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి బరిలో నిలిచిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పై గెలిచారు. స్థానికంగా ఉన్న రిజిస్ట్రేషన్, అధిక పన్నుల సమస్య, అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆయనకు మూసీ పరివాహక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి దక్కింది. గతంలో ఈ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడిన సామ రంగారెడ్డి బీజేపీలో చేరి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ గత గ్రేటర్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 11 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. దీంతో బీజేపీకి ఈ స్థానంపై పట్టు పెరిగింది. బీజేపీ నుంచి సామ రంగారెడ్డి తనకే  టికెట్ వస్తుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి తనకు టికెట్​ పక్కా అంటున్నారు. మరోవైపు పార్టీ సీనియర్​ లీడర్​ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కూడా తాను కచ్చితంగా పోటీ చేసి తీరతానని చెబుతున్నారు. బీఆర్​ఎస్ ​టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు.  

ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​కు కసిరెడ్డి గండం

ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​కు టీడీపీ నుంచి వెంట వచ్చిన వారు తప్ప.. వేరే కేడర్ ​లేదు. ఎమ్మెల్యేకు..ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య టికెట్ పంచాయితీ  ఉంది. బీజేపీ నుంచి ఆచారి పోటీలో ఉండనున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ ​బ్లాక్ ​పార్టీ తరపున సింహం గుర్తుతో తలకొండపల్లి జడ్పీటీసీగా గెలిచిన వెంకటేష్ గుప్తా మళ్లీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలకు అతీతంగా ఎన్ఆర్ఐ రాఘవేందర్ రెడ్డి ప్రజల్లో తిరుగుతున్నారు. సొంతంగా ఇండ్లు నిర్మించి ఇవ్వడం, సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఈయన కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఏఐసీసీ సెక్రెటరీగా వంశీచంద్ రెడ్డి ఢిల్లీకే పరిమితం కావడంతో టికెట్​వస్తుందా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 

కొడుకుకు టికెట్ కోసం మంచిరెడ్డి ప్రయత్నం

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్  నుంచి గెలిచిన  మంచిరెడ్డి కిషన్​ రెడ్డి ఈసారి తన కొడుకు ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మల్​రెడ్డి రంగారెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. యాచారం, మంచాల మండలాల్లో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా జనాలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలకు పోతున్నారన్న ఆరోపణలున్నాయి. పరిశ్రమల పేరుతో వందల ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నా సరైన నష్టపరిహారం చెల్లించకపోవడం, ధరణిలో  భూ రికార్డులు మాయం వంటి అంశాలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారాయి. బండరావిరాల, చిన్న రావిరాల ప్రాంతంలో మైనింగ్ సమస్య పరిష్కారానికి స్థానిక రైతులు ఏడు నెలలుగా దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న పేరొచ్చింది. యాచారం మండలంలో ఫార్మాసిటీ భూసేకరణకు సంబంధించి రైతులకు తెలియకుండానే ధరణిలో పేర్లు గల్లంతవ్వడంతో ఆందోళన చేపట్టారు. ఈ విషయమై ప్రగతి భవన్ ముట్టడికి కూడా యత్నించారు. ఇది కూడా ఆయనకు ప్రతికూలాంశమే.  

ఎమ్మెల్యే అంజయ్య వర్సెస్​ ప్రతాప్​రెడ్డి 

షాద్​నగర్​ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ధరణిలో భూములు మాయమయ్యాయని రైతులు చేసిన ఆందోళనలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​కు సమస్యను తెచ్చిపెట్టొచ్చు. బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యే అంజయ్య తోపాటు ప్రతాప్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్​లో చేరారు. ఈయనకు మంత్రి కేటీఆర్ తో మంచి సంబంధాలు ఉండడంతో టికెట్ తనకే వస్తుందన్న ఆశతో ఉన్నారు. కాంగ్రెస్​ నుంచి వీర్లపల్లి శంకర్ పోటీ చేసే ఛాన్స్​ ఉంది. ఇప్పటికే ఈయన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్​ నుంచి శ్రీనివాస్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి శ్రీవర్ధన్​రెడ్డితో పాటు మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి కొడుకు నితిన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అంద బాబయ్యలు రేసులో ఉన్నారు. 

చేవెళ్లలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మంత్రి, ఎమ్మెల్సీ

చేవెళ్లలోని ప్రతిపక్ష పార్టీల్లో బలమైన లీడర్లు లేకపోవడం బీఆర్ఎస్​కు కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో కాలె యాదయ్య గెలుపొందారు. 2018లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రత్నం తర్వాత బీఆర్​ఎస్​లో చేరారు. ఇప్పుడు ఈ ఇద్దరు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా మంత్రి సబితా రెడ్డి , ఎమ్మెల్సీ మహేందర్​రెడ్డి కాలే యాదయ్యను వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే తన ఇంట్లో వారికే పదవులు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్​ నుంచి భాస్కర్, సున్నం వసంతం, షాబాద్ దర్శన్ పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి కంచర్ల ప్రకాశ్​, సింగాపురం రమేశ్​తో పాటు మరికొందరు పోటీ పడుతున్నారు.