పట్టాలు ఇచ్చినా.. హద్దులు చూపలే

పట్టాలు ఇచ్చినా.. హద్దులు చూపలే
  • స్థలాల కోసం దశాబ్దాలుగా పేదల ఎదురుచూపులు
  • సమస్య పరిష్కరించాలంటూ ఆఫీసర్ల చుట్టూ ప్రదక్షిణలు
  • ఆ స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నా పట్టించుకునేవారు కరువు
  • మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ, కొండపూర్ లోని పరిస్థితి ఇదీ..

మెదక్​ (మనోహరాబాద్​), వెలుగు : ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ అధికారులు పొజిషన్​ చూపకపోవడంతో ఏండ్ల కొద్దీ పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. తమకు పొజిషన్​ చూపించాలంటూ లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. మెదక్​ జిల్లా మనోహరాబాద్ ​మండలంలోని గౌతోజిగూడ గ్రామంలో 2004 లో అప్పటి ప్రభుత్వం 457 సర్వే నంబర్ ఒక ఎకరం 23 గుంటల భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. ఒక్కొక్కరికీ 66 గజాల చొప్పున మొత్తం 76 మందికి పట్టాలు పంపిణీ చేసింది. కానీ ఇప్పటివరకు అధికారులు లబ్ధిదారులకు హద్దులు చూపించలేదు. దీంతో పట్టాలు ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హద్దులు లేకపోవడంతో పక్కన భూమి ఉన్న వాళ్లతో గొడవలు జరుగుతుండటంతోపాటు, రియల్​ఎస్టేట్​ వ్యాపారులు భూమిని కబ్జా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులు కూడా స్పందిచడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కొండాపూర్​లోనూ అదే పరిస్థితి.. 

మండలంలోని కొండాపూర్ గ్రామంలోనూ 1996లో 113 సర్వే నంబర్ లో 3.5 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. ఒక్కొక్కరికీ 100 గజాల చొప్పున దాదాపు 130 మందికి పట్టాలు అందజేసింది. కానీ ఏండ్లు గడిచినా అధికారులు మాత్రం వాటికి పొజిషన్​ చూపించలేదు. దాంతో పట్టాలు పొందిన వారిలో దాదాపు వంద మంది వరకు తమంతట తామే స్థలాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు తమకు కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నా, ఆ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోలేదు. దాంతో మిగతా 30 మందికి ఇప్పటికీ స్థలాలు దక్కలేదు. చేతిలో పట్టాలు ఉన్నా పొజిషన్​ చూపించకపోవడంతో వారు ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఇటీవల రెండు గ్రామాల లబ్ధిదారులు తమకు పొజిషన్​ చూపాలంటూ జడ్పీ చైర్​ పర్సన్​హేమలత, అడిషనల్​కలెక్టర్ రమేశ్, ఆర్డీవో, తహసీల్దార్​కు వినతి పత్రాలు సమర్పించారు.  

పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తాం

కొండాపూర్ లో రైతులకు పట్టాలు ఇచ్చి 20 ఏండ్లకు పైగా అవుతోంది. గౌతోజిగూడ గ్రామంలో పట్టాలు ఇచ్చి 
18 ఏండ్లు అవుతోంది. పాత రికార్డులు పరిశీలించి, విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
‌‌‌‌–భిక్షపతి, తహసీల్దార్, మనోహరాబాద్

మా భూమిలో ఎవరో ఉంటున్రు.. 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇండ్ల జాగాల పట్టాలు ఇచ్చిన్రు. కానీ ఇప్పటిదాకా హద్దులు చూపెట్టలె. మాకు ఇచ్చిన భూమిలో ఎవరో ఉంటున్నరు. నాకు ఇల్లు లేదు. నా భర్త చనిపోయిండు. ఇద్దరు కొడుకులతో కలిసి రేకుల ఇంట్ల ఉంటున్నం. మా జాగ మాకు సూపిస్తే ఇళ్లు కట్టుకుంటం. –మన్నెనర్సమ్మ, కొండాపూర్

మా జాగ మాకు సూపియ్యాలే..

మాకు సొంత ఇండ్లు, జాగలు లేవని సర్కార్ ఇండ్ల జాగాలు ఇచ్చింది. మా దగ్గర పట్టాలు కూడా ఉన్నయి. కానీ మస్తు ఏండ్లయితున్నా జాగ సూపిస్తలేరు. ఆఫీసర్లకు, లీడర్లకు చాలా సార్లు చెప్పినం. కానీ లాభం లేదు. ఇప్పటికైనా మా జాగలు మాకు సూపియ్యాలే.
–పూల సతమ్మ, గౌతోజిగూడెం