రెచ్చిపోతున్న భూ మాఫియా

రెచ్చిపోతున్న భూ మాఫియా

‘‘హసన్​పర్తి మండలం భీమారం శివారు సర్వే నంబర్ 520 బై నంబర్లలో దాదాపు 10 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉంది. ఇందులో కొంత భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు స్కెచ్​వేశారు. పట్టాదారులు వారిని అడ్డుకోగా కబ్జాదారులు కొంతమంది మహిళలను తీసుకొచ్చి వారిపై దౌర్జన్యానికి దిగారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా మొదట పట్టించుకుని తర్వాత లైట్ తీసుకున్నారు. ఇదే మండలంలోని జయగిరి శివారులో 18 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ కూడా ఇదే తరహాలో కబ్జాకు పాల్పడినట్లు బయటపడింది.’’

‘‘వరంగల్ సిటీలోని రంగశాయిపేట రాంగోపాలపురం వద్ద 257/సీ, 257/డీ సర్వే నంబర్లలో దాదాపు ఎకరం ల్యాండ్ ఉంది. దీని విలువ సుమారు రూ.10 కోట్లు ఉండడంతో కొందరు అక్రమార్కులు కన్నేశారు. అక్కడున్న గుడిసెలను రాత్రికిరాత్రే తొలగించి దౌర్జన్యానికి దిగారు. పోలీసులకు కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.’’ 

హనుమకొండ, వెలుగు: గ్రేటర్​వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ల్యాండ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనుభవం.. టీఆర్ఎస్​పార్టీ లీడర్లతో ఉన్న సంబంధాలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కొంతమంది అమాయకుల భూములపై కన్నేసి నయానో.. భయానో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పుకోని వారిని బెదిరిస్తున్నారు. ల్యాండ్ విషయాన్ని సెటిల్ చేసేందుకు ప్రత్యేకంగా గ్యాంగులను ఏర్పాటు చేసుకుని మాట వినని వాళ్లపైకి పంపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా దందా ఎక్కువైంది. రోజురోజుకు పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు పెరుగుతున్నారు. గతంలో ఇలాంటి ఫిర్యాదుల కోసం పోలీసులు ‘స్పెషల్ సెల్’ ఏర్పాటు చేసినప్పటికీ కంటిన్యూ చేయకపోవడంతో ఫీల్డ్​లెవల్​లో సమస్యలు పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డిమాండ్ పెరగడంతో..
స్టేట్​లో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న సిటీ వరంగల్. ఇక్కడున్న పరిస్థితులు, సౌకర్యాల దృష్ట్యా వివిధ రకాల ఇండస్ట్రీస్, ఇనిస్టిట్యూట్స్ వరంగల్​కు ప్రయారిటీ ఇస్తున్నాయి. సిటీకి ఆనుకొనే రింగ్ రోడ్డు ఉండటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదివరకు ఎకరం ధర రూ.లక్షల్లో ఉంటే ఇప్పుడు రూ.కోట్లకు చేరింది. సిటీ శివార్లలో ఓపెన్ ప్లేసులు ఎక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. వ్యవసాయ, బీడు భూములు కూడా వెంచర్లుగా మారుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది కబ్జాదారులు ఓనర్లకు తెలియకుండా భూమిని అమ్మేస్తున్నారు. కొందరైతే కుటుంబ గొడవలు, గెట్టు పంచాయితీలు, ఇతర వివాదాల్లో ఉన్న భూములను టార్గెట్ చేసుకుని దందా సాగిస్తున్నారు. 

దర్జాగా దందా
శివారులో భూ దందా చేస్తున్న వారికి అధికార పార్టీ లీడర్ల అండ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పర్సంటేజీలు ఇస్తే అన్నీ తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ దేవన్నపేట వద్ద ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశాడు. వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల టీఆర్ఎస్​లీడర్లకు సన్నిహితుడిగా పేరున్న ఆయన రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్స్ పై కన్నేసి వెంచర్లు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే కొంతమంది అమాయకుల ల్యాండ్స్​కు ఎసరు పెట్టాడనే ఆరోపణలున్నాయి. జయగిరి శివారులోని ఓ ల్యాండ్ తనదేనని చెప్పి అమ్మేయగా.. అసలు ఓనర్లకు, ఆయనకు మధ్య వివాదం నడుస్తోంది. వరంగల్ రంగశాయిపేటలో ఓ మాజీ కార్పొరేటర్.. నియోజకవర్గంలోని పెద్ద లీడర్ అండదండలతో ఇదే తరహా దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వంగపహాడ్, నాగారం పరిధిలో వెంచర్లు చేసిన ఓ బడా రియల్టర్ కూడా ఇదే మార్గంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.

కిరాయి మనుషులతో దౌర్జన్యం
కొంతమంది కబ్జాదారులు డబ్బులు ఇచ్చి.. తాము చెప్పినట్టు వినేలా గ్యాంగులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో పొలాల వద్దకు వారిని పంపించి ఓనర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో భూమాఫియా ఆగడాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇచ్చేందుకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు. కబ్జా రాయుళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఇతర లీడర్లు చెప్పారు. కానీ ఇప్పుడు స్పెషల్ సెల్ ముచ్చటే  వినిపించడం లేదు. 

కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలేరు
రాంగోపాలపురంలో 330 గజాల స్థలాన్ని కొనుక్కుని కాంపౌండ్ వాల్ కట్టాను. కొంతమంది దుండగులు వచ్చి రాత్రికి రాత్రే దానిని కూల్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగారు. స్థానిక పోలీసులతోపాటు గ్రేటర్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేశాను. నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. 
– రంగరాజు ప్రకాశ్, భూబాధితుడు, రంగశాయిపేట