తహసీల్దార్ ఆఫీస్లో రికార్డుల ట్యాంపరింగ్!

 తహసీల్దార్ ఆఫీస్లో రికార్డుల ట్యాంపరింగ్!

గరిడేపల్లి, వెలుగు : గరిడేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల ట్యాంపరింగ్​జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మండంలోని గారకుంట తండా గ్రామానికి చెందిన రమావత్ నాగమణికి 59వ సర్వే నంబర్ లో మొత్తం 3 ఎకరాల 24 గుంటల భూమి ఉంది. అందులో ఎకరం భూమిని గతంలో అమ్మగా, 2 ఎకరాల 24 గంటలు ఉంది. ఇటీవల నాగమణి సోదరుడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, 59వ సర్వే నంబర్ లో ఉన్న భూమిని పరిశీలించాడు. అయితే 59వ సర్వే నంబర్ లో తన అక్క పేరు కాకుండా వేరే వ్యక్తి పేరుపై భూమి ఉన్నట్లు గమనించాడు. వెంటనే తన అక్కకు ఫోన్​చేసి విషయం చెప్పాడు. నాగమణి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తన పేరు మీద ఉన్న భూమి భూక్యా శంకర్ అనే వ్యక్తి పేరు మీద ఎలా మారిందని అధికారులను ప్రశ్నించారు.

 అధికారులు రికార్డును పరిశీలించి చూడగా, వైట్నర్ తో ఆమె పేరు తొలగించి వేరే వారి పేరు పెట్టినట్టు కనబడింది. వెంటనే తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ కు ఆమె ఫిర్యాదు చేసింది. అటు నుంచి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఈనెల 13న తహసీల్దార్ కవిత.. పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. 

ట్యాంపరింగ్ ఘటనపై స్పందించిన కలెక్టర్.. 

గరిడేపల్లి రెవెన్యూ కార్యాలయంలో పహణీలో పట్టాదారు పేరు మార్చిన ఘటనపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ఒక ప్రకటనలో స్పందించారు.  రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులో పేరు మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని తెలిపారు.