- తక్కువ రేటు భూములకు 100 శాతం
- తహసీల్దార్లు, సబ్ రిజిస్టర్లు ప్రపోజల్
- జనగామలో హయ్యస్ట్ రూ. కోటికి పైగా..
- రఘునాథపల్లిలో రూ 71.25 లక్షలు
జనగామ, వెలుగు: భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరణ పూర్తి కావొచ్చింది. భూములు ఉన్న ప్రదేశాన్ని బట్టి మార్కెట్ విలువలో మార్పులను సూచిస్తూ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ భూముల విలువ సవరణ అమల్లోకి రానుంది.
2021, 2022లో విలువ సవరణ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021, 2022లో భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువను సవరించింది. నాలుగేండ్లలో భూముల విలువ భారీఎత్తున పెరిగాయి. భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్, బహిరంగ మార్కెట్ విలువ మధ్య తేడా భారీస్థాయిలో ఉన్నా, ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయలేదు. 2024లో సవరించడానికి ప్రయత్నించింది. భూములు విలువ వివరాలు మొత్తం పరిశీలించినా చివరకు పెంచకుండానే ఊరుకుంది. ఇటీవలే మళ్లీ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజులుగా తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు వివరాలను ప్రభుత్వానికి పంపించారు.
తక్కువ రేటుంటే.. వంద శాతం
జనగామ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భూముల రేట్లు బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఎకరాకు రూ.2 లక్షలు, అంతకంటే తక్కువగా కూడా ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌ను పరిశీలించిన ఆఫీసర్లు రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ తక్కువగా ఉన్న భూముల విలువను వంద శాతం పెంచాలని పేర్కొన్నారు. ఈ లెక్కన రూ.2 లక్షలుగా ఉన్న ఎకరం భూమి విలువను రూ.4 లక్షలు చేసే అవకాశముంది. బహిరంగ మార్కెట్ అనుగుణంగా విలువ కలిగిన భూముల విలువ పెంపు విషయంలో ఆచితూచీ వ్యవహరించనున్నారు. రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువగా ఉన్న భూముల విలువను కనీసం 30 శాతం పెంచాలని ప్రపోజల్ చేశారు. ఎకరానికి రూ.50 లక్షల విలువున్న భూములకు రూ.15 లక్షలకు పైగా విలువ పెంచి రూ.65 లక్షలకు సవరించే అవకాశం ఉంది.
ప్రైమ్ ల్యాండ్‌కు 50 శాతం..
నేషనల్ హైవే, స్టేట్ హైవే, జిల్లా హెడ్ క్వార్టర్స్ రోడ్ల పక్కనే ఉన్నవాటిని ప్రైమ్ ల్యాండ్స్‌గా గుర్తించారు. ప్రస్తుతం వీటికి ఉన్న విలువను కనీసం 50 శాతం పెంచేవిధంగా ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ విలువ బాగానే ఉన్నప్పటికీ వాణిజ్యపరమైన భూములకు ఎకరాకు కనీసం రూ.10 లక్షల విలువను పెంచుతూ సవరించాలని ప్రతిపాదనలు చేశారు. ఇండ్ల స్థలాలు బిల్డింగ్స్, అపార్ట్మెంట్ల విలువ సవరణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువలను పోల్చి 25, 50, 100 శాతం పెంచే విధంగా ప్రతిపాదనలు చేశారు.
జనగామలో రూ.కోటికి పైగా..
జిల్లా కేంద్రమైన జనగామలోని కొన్ని ఏరియాల్లో ఎకరాకు రూ.కోటికి పైగా రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ ఉంది. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ చాలా ఎక్కువగా ఉంది. విలువైన ఈ భూములకు 50 శాతం అంతకంటే ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. జనగామ తర్వాత ఈ జిల్లాలో రఘునాథపల్లి, స్టేషన్ ఘన్పూర్, బచ్చన్నపేట, లింగాల గణపురం, పాలకుర్తి వంటి మండలాలు నేషనల్, స్టేట్ రోడ్లకు సమీపంలో ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉన్నందున తాజా సవరణలో గణనీయంగా పెరుగనుంది.
ఇండ్ల స్థలాల మార్కెట్ విలువ మరీ తక్కువ..
ఇండ్ల స్థలాల విషయంలో మాత్రం బహిరంగ మార్కెట్‌కు రిజిస్ట్రేషన్ విలువకు మధ్య చాలా వత్యాసం ఉంది. గజం విలువ అతితక్కువగా రూ.2,100, ఎక్కువగా రూ.12,500 మాత్రమే ఉంది. కమర్షియల్ ఏరియాల్లో బహిరంగ మార్కెట్ విలువ కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగా పలుకుతోంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో గజం రూ.3,100 నుంచి రూ.5,800 వరకూ ఉంది. రఘునాథపల్లిలో రూ.1,700 నుంచి రూ.7,800 రిజిస్ట్రేషన్ విలువగా ఉంది. పాలకుర్తిలో రూ.1,700 నుంచి రూ.2,400గా ఉంది. బచ్చన్నపేటలో రూ.1,300 నుంచి రూ.1700గా ఉంది. మొత్తంగా జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో రూ.700 నుంచి రూ.12,500 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ విలువ ఉంది. దీంతో కనీసం వంద శాతం పెరిగే అవకాశం ఉంది.
