గోదావరి తీరంలో ..బీఆర్​ఎస్​కు వరద పోటు

గోదావరి తీరంలో ..బీఆర్​ఎస్​కు వరద పోటు
  • ముదురుతున్న ముంపు బాధితుల భూ పోరాటాలు
  • మున్నేరు రక్షణ గోడలకు రూ.69‌‌కోట్లు.. భద్రాద్రి కరకట్టలకు నిధులేవీ?

భద్రాచలం,వెలుగు : గోదావరి తీరంలోని పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో  వరద పోటు బీఆర్​ఎస్​ పార్టీకి  తలనొప్పిగా మారింది.   ముంపు బాధితులు నిర్వహిస్తున్న భూ పోరాటాలపై సర్కారు ఉక్కుపాదం మోపడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆందోళనలు ముదురుతున్నాయి.  గతేడాది వరదల సమయంలో సీఎం కేసీఆర్​ రూ.1000కోట్లతో వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి నేటికీ పట్టించుకోలేదు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు ఖమ్మం జిల్లా కేంద్రంలో మున్నేరు వరదల నివారణకు రూ.690కోట్లతో రక్షణ గోడల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఏటా వరదలతో సర్వం కోల్పోయే గోదావరి వరద బాధితుల గోడును మాత్రం  సర్కార్​ గాలికొదిలేసిందనే అభిప్రాయం  వ్యక్తం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాల విషయంలో గిరిజనుల వ్యతిరేక ఓటుతో జిల్లాలో అధికార బీఆర్​ఎస్​కు ఒక్క సీటు కూడా రాలేదు.   ఈసారి గోదావరి వరద బాధితులకు  శాశ్వత పరిష్కారం చూపుతామని  సర్కారు ఇచ్చిన మాట తప్పడంతో ఎన్నికల్లో దీని ప్రభావం పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో స్పష్టంగా కనబడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

అడవుల్లో దీక్షలు....పోరుజాతర

గతేడాది 71 అడుగుల గోదావరి వరదతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు అతలాకుతలం అయ్యాయి. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడులో 7వేల కుటుంబాలు, అశ్వాపురంలో 1458, పినపాకలో 1341, మణుగూరులో 392, భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలంలో 2913, దుమ్ముగూడెంలో 1920, చర్లలో 2889 కుటుంబాలు గోదావరి వరదలకు ముంపునకు గురయ్యాయి. ఇదే సమయంలో పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం సారపాక, పాతసారపాక సుందరయ్యనగర్​, బసవప్పకాలనీ, భద్రాచలంల నుంచి వరద బాధితులు మణుగూరు క్రాస్​ రోడ్డులో అడవుల్లో దీక్షలు చేపట్టారు.

సందెళ్ల రామారం సర్వే నెంబరు 437, కృష్ణసాగర్​లోని సర్వే నెంబరు 10, నాగినేనిప్రోలులోని ప్రభుత్వ భూముల్లో డేరాలు, పాకలు, గుడిసెలు వేసుకుని 116 రోజులకు పైగా దీక్షలు చేశారు. ఈ దీక్షలను అటవీ,పోలీసుశాఖలు భగ్నం చేశాయి.  తాజాగా చర్ల మండలంలోని సర్వే నెంబరు117లో ఐదు పంచాయతీలు, 11 గ్రామాల వరద బాధితులు భూపోరాటం చేశారు. వరద బాధితుల పోరు జాతరలో భాగంగా ఆందోళన చేశారు. ఈ రెండు దీక్షలు, పోరాటాలు సీపీఐ ఎంఎల్​ న్యూడెమోక్రసీ నేతృత్వంలో జరిగాయి. మరోవైపు బీఎస్పీ కూడా బూర్గంపాడు మండల కేంద్రంలో 53 రోజుల పాటు దీక్షలు నిర్వహించారు.

పోలవరం బ్యాక్​ వాటర్ వల్ల నిర్వాసితులు అవుతున్నందున ఆర్​ఆర్​ ప్యాకేజీ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఇన్ని చేసినా సర్కారు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఈసారి ఎన్నికల్లో అధికార బీఆర్​ఎస్​కు ఓటుతో బుద్దిచెబుతాం అంటూ వారు హెచ్చరిస్తున్నారు. ఇది ఇప్పుడు అధికార పార్టీకి తలపోటుగా మారింది.

మాస్టర్​ ప్లాన్లు ఉత్తవేనా!

గోదావరి తీర ప్రాంతంలోని గ్రామాలను పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున కరకట్టలు నిర్మిస్తామని, మాస్టర్​ ప్లాన్​ తయారు చేస్తున్నట్లుగా ఏడాది కాలంగా నిర్వాసితులను మభ్యపెడుతున్నారు. ముందుగా రూ.1650కోట్లు అన్నారు. ప్లాన్​ కూడా సిద్దమైందని, టెండర్లే తరువాయి అని నమ్మబలికారు. కానీ అంగుళం కూడా ముందుకు పడలేదు. సీఎం ఇస్తానన్న రూ.1000కోట్లు, ఎత్తైన ప్రాంతంలో డబుల్ బెడ్​ రూం ఇళ్లు కార్యరూపం దాల్చలేదు. 17913 కుటుంబాలు గోదావరి తీరంలో నిత్యం భయంతో బతకాల్సి వస్తోంది. ఈసారి వరదల సమయంలో తిరిగి సర్కారు కరకట్టలు కట్టిస్తామని ప్రకటించింది.

రూ.3200కోట్లతో యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేస్తున్నట్లు, అధ్యయనం కోసం ఇతర రాష్ట్రాలకు ఇంజనీర్లను పంపుతున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే భద్రాద్రిని యాదాద్రి తరహాలో డెవలప్​ చేస్తామని ఆర్కిటెక్​ ఆనందసాయితో సర్కారు మాస్టర్​ ప్లాన్​ తయారు చేయించింది. అది మూలకు పోయింది. తిరిగి కరకట్టల మాస్టర్​ ప్లాన్​ అంటూ ఎన్నికల వేళ నిర్వాసితులకు ఎర వేస్తోంది. సర్కారు మాటలు నమ్మేది లేదని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు. దీనితో ఈసారి సర్కారుకు ఎన్నికల్లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరద పోటు తప్పేలా లేదు.