
-
షేరుకి రూ.3,200 ఇవ్వనున్న కంపెనీ
-
ప్రస్తుత ధర కంటే 10 శాతం ఎక్కువ
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ కంపెనీ లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) చేపడుతున్న రూ. పది వేల కోట్ల విలువైన మెగా బైబ్యాక్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు అందుబాటులో ఉంటుంది. షేరుకి రూ. 3,200 చెల్లించడానికి ఎల్ అండ్ టీ ముందుకొచ్చింది. కంపెనీ షేర్లు శుక్రవారం రూ.2,907 దగ్గర క్లోజయ్యాయి. షేరుని 10 శాతం ఎక్కువకు ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ కొనుగోలు చేయనుంది. గతంలో బైబ్యాక్‌లో షేరుకి రూ.3,000 చెల్లిస్తామని ప్రకటించిన కంపెనీ తాజాగా రూ.200 పెంచింది. కంపెనీ బైబ్యాక్ ఆఫర్‌కు ఈ నెల 12 రికార్డ్ డేట్. అంటే ఈ తేది నాటికి షేరు హోల్డర్లుగా ఉన్న ఇన్వెస్టర్లు కంపెనీ ఆఫర్‌లో పాల్గొనడానికి అర్హులు. మొత్తం 3,12,50,000 షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ చూస్తోంది.
ఇది కంపెనీలో 2.2 శాతం వాటాకు సమానం. చిన్న షేరు హోల్డర్ల నుంచి షేర్లను కొనుగోలు చేసే రేషియో 9:38 ఉంది. అంటే షేరు హోల్డర్ అమ్మాలనుకునే ప్రతీ 38 షేర్లలో సుమారు 9 షేర్లను ఎల్ అండ్ టీ కొనుగోలు చేస్తుంది. అదే పెద్ద షేరు హోల్డర్ల కోసం ఈ రేషియో 11:574 గా ఉంది. బైబ్యాక్ ఆఫర్ కింద ఇన్వెస్టర్లు అమ్మాలనుకునే షేర్లలో 35–40 శాతం షేర్లను కంపెనీ కొనుగోలు చేస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా,ఈ ఏడాది జులై 25 న బైబ్యాక్ ఆఫర్‌ను ఎల్ అండ్ టీ ప్రకటించింది.