బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం : తరుణ్ చుగ్

బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం : తరుణ్ చుగ్
  • రానున్న 6 నెలలు కీలకం.. ముందస్తుకు సిద్ధమవ్వండి 
  • బీజేపీ కోర్ కమిటీ, స్టేట్ ఆఫీస్ బేరర్ల మీటింగ్స్ లో నేతలకు తరుణ్ చుగ్ దిశానిర్దేశం 
  • మన ఫోన్లను రాష్ట్ర సర్కార్ ట్యాప్ చేస్తున్నది.. జాగ్రత్తగా ఉండాలె: సంజయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు ఆ పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేశారు. రానున్న 6 నెలలే కీలకమని, పార్టీ బలం మరింత పెంచేందుకు కష్టపడాలని సూచించారు. ‘‘మన టార్గెట్.. మిషన్ 90. పార్టీ కోసం మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఆ ఫలాలు మీకే దక్కుతాయి. ఇప్పుడు ఇక్కడున్నోళ్లు రాబోయే రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతారనే విషయం మరిచిపోవద్దు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు క్యాడర్ ను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి” అని చెప్పారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర కోర్ కమిటీ, రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్ లు వేర్వేరుగా జరిగాయి. ఈ సమావేశాలకు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ అధ్యక్షత వహించగా తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా70 సీట్లలో కచ్చితంగా గెలుస్తామని తరుణ్ చుగ్ చెప్పారు. 

‘‘మనం ఇంకా కనీసం క్యాండిడేట్లను కూడా ఎంపిక చేయలేదు. నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థిపై క్లారిటీ లేకపోయినా 70 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వేల్లో తేలింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ ఎంత బలంగా ఉందో తెలిసిపోతోంది. ఇక అభ్యర్థులను ప్రకటిస్తే, రాబోయే ఎన్నికల్లో 90 సీట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ముందస్తు ఎన్నికల గంట ఏ క్షణమైనా మోగవచ్చు. మీరంతా పూర్తి స్థాయిలో పార్టీ కోసం సమయం కేటాయించాలి. పార్టీ గెలుపు కోసం కష్టపడాలి” అని సూచించారు. 

పార్టీలో చేరికలు స్పీడప్ చేయాలి..  

మునుగోడు ఉప ఎన్నిక తమకు మంచి పాఠం నేర్పిందని తరుణ్ చుగ్ అన్నారు. ‘‘మునుగోడులో గెలుపు దాకా వచ్చి ఓడిపోయాం. అక్కడ మనం ఓడి గెలిస్తే, బీఆర్ఎస్ గెలిచి ఓడింది. గెలుపు కోసం బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అడ్డదారులు తొక్కింది. డబ్బు, మద్యం పంపిణీ చేసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి? పోల్ మేనేజ్ మెంట్ ఎలా చేయాలి? అనే దానిపై ఫోకస్ పెట్టాలి. అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవాలి” అని చెప్పారు. పార్టీలో అందరూ కలిసి పని చేయాలని.. పాత, కొత్త అనే తేడాలు ఉండొద్దని సూచించారు. ఎవరి పదవులు ఎవరు గుంజుకోరని, పనితీరును బట్టే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. పార్టీలో చేరికలను స్పీడప్ చేయాలన్నారు. బీజేపీ నేతలందరి ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని సంజయ్ ఆరోపించారు. ‘‘మన ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది. మన పార్టీ నిర్ణయాలు మన నాయకుల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తున్నాయి. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇకపై ప్రతి ఒక్కరూ ఐ ఫోనే వాడాలి” అని సూచించారు. కాగా, మీటింగ్ కు రాని కొందరు జిల్లా అధ్యక్షులకు హెచ్చరికలు జారీ చేయాలని మీటింగ్ లో నిర్ణయించారు.

7న నడ్డా వర్చువల్ మీటింగ్.. 

జనవరి 7న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనం జరగనుంది. ఇందులో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వర్చువల్ గా పాల్గొని మాట్లాడతారు. మొత్తం 34,600 బూత్ కమిటీలు ఉండగా.. ఒక్కో దాంట్లో 21 మంది ఉన్నారు. అంటే ఒకేరోజు 7 లక్షల 26 వేల 600  మందికి నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు. జనవరి 15 తర్వాత నుంచి రోజూ సగటున 3 నియోజకవర్గాల్లో సంజయ్ పర్యటన ఉంటుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు అన్ని జిల్లాల ఆఫీసు బేరర్ల మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

నియోజకవర్గానికో కోర్ కమిటీ.. 

అసెంబ్లీ నియోజకవర్గానికో కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఒక పాలక్, విస్తారక్ (ఫుల్ టైమర్), కన్వీనర్, ప్రభారీ ఇందులో ఉంటారు. వీరందరితో ఈ నెలాఖరులో సమావేశం నిర్వహిస్తారు. దీనికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, సోషల్  మీడియా, జీ-20, జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం, పార్లమెంటరీ ప్రవాసీ యోజన తదితర అంశాలపై కోర్ కమిటీలో చర్చించారు. పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని సంజయ్ ని అభినందించారు. రుణమాఫీ, ధరణి పోర్టల్ లోపాలు సహా రైతు సమస్యలపై ఈ నెల 27 న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశాల్లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ వ్యవహారాల సహ ఇన్ చార్జ్ అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, నల్లు ఇంద్రసేనా రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్ సహా స్టేట్ ఆఫీసు బేరర్లు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.