హైదరాబాద్‌‌లో ఇండ్లు, జాగలు మస్తు కొంటున్నరు!

హైదరాబాద్‌‌లో ఇండ్లు, జాగలు మస్తు కొంటున్నరు!
  • ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే రూ.23,580 కోట్ల బిజినెస్ 
  • నిరుడు ఇదే టైంతో పోలిస్తే 143 శాతం పెరుగుదల
  • 3.5 కోట్ల చదరపుటడుగుల మేర ఇండ్లు, జాగల క్రయవిక్రయాలు
  • ఆన్‌‌లైన్ బ్రోకరేజీ ప్రాప్​టైగర్స్ రిపోర్ట్‌‌లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. జనాలు ఇండ్లు, ప్లాట్లను ఇంతకు ముందుతో పోలిస్తే మస్తు కొంటున్నారు. భూములపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2023 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఫస్ట్‌‌ క్వార్టర్‌‌‌‌లో 143 శాతం అధికంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ జరగడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే రూ.23,580 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ బిజినెస్‌‌ జరిగినట్టు తాజా రిపోర్ట్ వెల్లడించింది. ‘రియల్ ఎస్టేట్ ఇన్‌‌ సైట్ రెసిడెన్షియల్– జనవరి టు మార్చి 2024’పేరిట ప్రాప్ టైగర్స్ అనే ఆన్‌‌లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ తాజాగా ఓ రిపోర్టును విడుదల చేసింది. 

దీని ప్రకారం 2023 తొలి క్వార్టర్‌‌‌‌లో జరిగిన రియల్ ఎస్టేట్ బిజినెస్‌‌తో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 143 శాతం అధికంగా సేల్స్​ జరిగాయి. నిరుడు ఇదే టైమ్‌‌కి కేవలం రూ.9,711 కోట్ల విలువైన బిజినెస్ జరిగిందని రిపోర్ట్ పేర్కొంది. అమ్ముడైన ఏరియా విషయంలో హైదరాబాద్ సిటీనే టాప్‌‌లో ఉండడం విశేషం. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 3.5 కోట్ల చదరపుటడుగుల మేర ప్లాట్లు, ఇండ్ల విక్రయాలు జరిగాయి. ఇది నిరుడు జరిగిన కోటిన్నర చదరపు అడుగులతో పోలిస్తే 128 శాతం ఎక్కువ. ఈ ఏడాది మొత్తం 14,290 యూనిట్లు (ఇండ్లు, జాగలు) అమ్ముడైనట్టు రిపోర్ట్‌‌లో వెల్లడైంది. గతేడాది ఇదే సమయానికి 10,200 యూనిట్లు అమ్ముడయ్యాయని పేర్కొంది. 

యూనిట్లలో ముంబై.. ఏరియాలో హైదరాబాద్..​

యూనిట్లలో అమ్మకాల పరంగా పోలిస్తే ముంబై టాప్‌‌లో ఉంది. ఈ ఏడాది ముంబైలో 41,590 యూనిట్లు అమ్ముడయ్యాయని రిపోర్ట్ పేర్కొంది. అదే సమయంలో హైదరాబాద్‌‌లో 14,290 యూనిట్లు అమ్ముడవగా.. దేశంలో రెండో స్థానంలో ఉంది. అయితే, ఏరియా పరంగా మాత్రం హైదరాబాద్‌‌లోనే ఎక్కువ సేల్స్ జరిగాయని రిపోర్ట్ తేల్చింది. 3.5 కోట్ల చదరపుటడుగుల మేర మన దగ్గర అమ్మకాలు జరిగితే.. ముంబైలో మాత్రం 3.3 కోట్ల చదరపుటడుగుల మేర క్రయవిక్రయాలు జరిగాయి. ముంబైలో ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా తక్కువ స్పేస్‌‌లో ఎక్కువ యూనిట్లను నిర్మిస్తుంటారు. అందుకే అక్కడ యూనిట్ల పరంగా ఎక్కువ అమ్మకాలు జరిగినట్టు రిపోర్ట్ పేర్కొంది.