డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో కారు దొరికితే ఉక్రెయిన్‌కే

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో కారు దొరికితే ఉక్రెయిన్‌కే

రిగా(లాత్వియా) : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన కార్లను లాత్వియా అధికారులు ఉక్రెయిన్‌కు పంపిస్తున్నారు. రష్యాతో జరిగే యుద్ధంలో ఉక్రెయిన్‌కు తమ ప్రయత్నం సాయంగా ఉంటుందని అంటున్నారు. ఈ కార్లను నడిపిన మాజీ యజమానుల రక్తంలో ఆల్కహాల్‌ స్థాయిలు 0.15% పైనే ఉందట. ఇప్పటికే ఇలా పట్టుబడిన 8 కార్లు ఉక్రెయిన్‌కు పంపామని లాత్వియా దేశ రెవెన్యూ విభాగం పేర్కొంది. కొనుగోలు చేసిన, విరాళంగా అందిన కార్లను దెబ్బతిన్న, యుద్ధం జరిగే ప్రాంతాల్లో అత్యవసర సేవలకు వినియోగిస్తామని ఉక్రెయిన్‌కు చెందిన అగెండమ్‌ గ్రూప్‌ తెలిపింది.

2022 ఫిబ్రవరి నుంచి ఇలాంటి 1,200 కార్లను అందజేసినట్లు వెల్లడించింది. లాట్వియా రోడ్లపై మద్యం తాగి కార్లలో తిరిగే వారు ‘పేలని కమికాజ్‌ డ్రోన్లు’వంటి వారని చమత్కరించింది. ‘సాధారణంగా స్వాధీనం చేసుకున్న కార్లను అమ్మేయడమో, విడగొట్టి అమ్మేయడమో చేస్తుంటాం. అయితే, ఉక్రెయిన్‌ ప్రజలకు సాయం చేయాలనే వీటిని అక్కడికి పంపిస్తున్నాం’అని లాత్వియా అంటోంది.