
- ‘5జీ’వచ్చేసింది
- దేశంలో సేవలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
- 130 కోట్ల ప్రజలకు టెలికం ఇండస్ట్రీ ఇచ్చిన గిఫ్ట్..
- ఇంటర్నెట్ స్పీడ్‌తో టెక్నాలజీ రంగంలో జోష్
- హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వంటి రంగాల్లో పెనుమార్పులు
- స్వదేశీ ‘5జీ’తో దేశం చరిత్ర సృష్టించిందని కామెంట్
న్యూఢిల్లీ: దేశ టెలికం రంగంలో 5జీ (ఫిఫ్త్ జనరేషన్) టెక్నాలజీ సేవలతో కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శనివారం 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2022ని ప్రారంభించిన ప్రధాని.. అదే వేదికపై5జీ సేవలను కూడా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 5జీ సేవలు హద్దులులేని అవకాశాలను తెస్తాయన్నారు. ‘‘ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశానికి ఇది స్పెషల్ డే. ఇయ్యాల దేశం నుంచి, టెలికం ఇండస్ట్రీ నుంచి 130 కోట్ల మంది ఇండియన్ లు 5జీ రూపంలో అద్భుతమైన గిఫ్ట్ ను అందుకుంటున్నారు. దేశంలో 5జీ టెక్నాలజీ కొత్త శకానికి నాంది పలికింది” అని మోడీ అన్నారు. 5జీ టెక్నాలజీ ఇంటర్నెట్ సేవల స్పీడ్ పెంచడమే కాదు.. మన జీవితాలను గణనీయంగా మారుస్తుందన్నారు.
ఇది ‘స్వదేశీ’ 5జీ
ఇప్పటిదాకా మన దేశంలో వాడిన 1జీ, 2జీ, 3జీ, 4జీ టెలికం సర్వీసుల టెక్నాలజీ కోసం విదేశాలపై ఆధారపడ్డామని, కానీ 5జీ టెక్నాలజీని మాత్రం స్వదేశీయంగానే రూపొందించుకున్నామని ప్రధాని చెప్పారు. 5జీలో కీలకమైన స్వదేశీ టెక్నాలజీతో ఇండియా చరిత్ర సృష్టించిందన్నారు. ప్రపంచ టెలికం టెక్నాలజీలో మన దేశం తొలిసారిగా గ్లోబల్ స్టాండర్డ్ ను నెలకొల్పిందన్నారు.
‘డిజిటల్ ఇండియా’తో ఎన్నో మార్పులు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా మిషన్‌తో ఎనిమిదేండ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయని మోడీ అన్నారు. 2014లో దేశంలో రెండే మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఉండగా.. ఇప్పుడవి 200కు పెరిగాయన్నారు. అప్పట్లో ఒక జీబీ డేటాకు రూ. 300 అయ్యేదని, ఇప్పుడు రూ. 10కే జీబీ డేటా వస్తోందన్నారు. అప్పట్లో నెలకు 14 జీబీ డేటా వాడితే రూ. 4,200 ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు రూ. 150 మాత్రమే ఖర్చవుతోందన్నారు. 2014లో దేశంలో 6 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 80 కోట్లకు పెరిగిందన్నారు. ఎనిమిదేండ్ల కింద 100 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఆప్టికల్ ఫైబర్ తో కనెక్ట్ అయి ఉండగా.. ఇప్పుడు 1.7 లక్షల గ్రామాలకు ఈ కనెక్టివిటీ ఉందన్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు కూడా జోరుగా సాగుతున్నాయని తెలిపారు. 2జీ యుగానికి, 5జీ యుగానికి తేడా ఇలా ఉంటుందంటూ పరోక్షంగా యూపీఏ ప్రభుత్వంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించారు.
5జీతో కంపెనీల డెమోలు
ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో మూడు ప్రధాన టెలికం కంపెనీలు 5జీతో కలిగే ప్రయోజనాలపై డెమో ఇచ్చాయి. ముంబైలోని ఓ స్కూల్ లో ఉన్న టీచర్.. మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలోని స్టూడెంట్లతో కనెక్ట్ అయి లెసన్స్ చెప్పడాన్ని జియో కంపెనీ డెమో ఇచ్చింది. ఈ మూడు స్కూళ్ల విద్యార్థులతో మోడీ కూడా వర్చువల్ గా ఇంటరాక్ట్ అయ్యారు. ఢిల్లీ మెట్రో నిర్మిస్తున్న ఓ టన్నెల్ వద్ద వర్క్‌ను పర్యవేక్షించడాన్ని వోడాఫోన్ ఐడియా డెమో ద్వారా చూపింది. ఆ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న ఓ వర్కర్‌తో మోడీ ఈ డెమోలో మాట్లాడారు. అలాగే వర్చువల్ రియాలిటీ, ఆగ్ మెంటెడ్ రియాలిటీ సాయంతో యూపీలోని ఓ స్టూడెంట్ సోలార్ సిస్టం గురించి తెలుసుకోవడంపై ఎయిర్ టెల్ డెమో ఇచ్చింది.
రెండేండ్లలో దేశమంతా
5జీ సేవలు మరో రెండేండ్లలో దేశమంతా అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా తాము దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు అందిస్తామని జియో ప్రకటించింది. 2024 మార్చి నాటికి దేశమంతా 5జీ సర్వీస్ లను విస్తరిస్తామని భారతి ఎయిర్ టెల్ వెల్లడించింది. అయితే, 5జీ సర్వీస్ లను శనివారం భారతి ఎయిర్ టెల్ మాత్రమే 8 సిటీల్లో ప్రారంభించింది. జియో ఈ నెలలోనే 4 మెట్రో సిటీల్లో 5జీ సేవలను అందుబాటులోకి తేనుంది. వోడాఫోన్ ఐడియా కంపెనీ కూడా త్వరలోనే 5జీ సర్వీసులు స్టార్ట్ చేస్తామని పేర్కొంది. తొలిదశలో మొత్తం 13 సిటీల(ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్ నగర్, లక్నో, పుణె)లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఢిల్లీ నుంచి స్వీడన్ లోని కారును నడిపిన మోడీ
ప్రధాని మోడీ శనివారం ఢిల్లీ నుంచే యూరప్ లోని కారును టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ లింక్ తో ఏర్పాటు చేసిన రిమోట్ కంట్రోల్ డ్రైవింగ్ సిస్టంతో ఆయన రిమోట్ కంట్రోల్ ద్వారా కారును నడిపారు. స్వీడన్ లోని ఓ ఇండోర్ కోర్స్ లో కారును ఉంచారు. దాని నావిగేషన్ కంట్రోల్ సెటప్ ఢిల్లీలోని ఐఎంసీ వద్ద ఎరిక్సన్ స్టాల్ లో ఏర్పాటు చేశారు. కంట్రోల్ సీట్ పై కూర్చున్న మోడీ హ్యాండిల్ పట్టుకుని యాక్సిలేటర్, బ్రేక్ లను ఉపయోగిస్తూ కారును డ్రైవ్ చేశారు.