కూలీలు, కార్మికుల కోసం ఈ‑శ్రమ్‌

కూలీలు, కార్మికుల కోసం ఈ‑శ్రమ్‌
  • ఇందులో చేరితే రూ 2 లక్షల విలువైన లాభాలు

బిజినెస్ డెస్క్, వెలుగు: కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌ వర్కర్లు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, పనిమనుషులు, కార్మికుల, కూలీల వంటి అసంఘటితరంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ పోర్టల్‌‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలోని 38 కోట్ల మంది కార్మికుల వివరాలను సేకరించి డేటాబేస్ తయారు చేశామని ప్రకటించారు. ఫలితంగా వీళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను,  వివిధ ప్రయోజనాలను పొందగలుగుతారని చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రాలు, ట్రేడ్‌‌ యూనియన్లను ఒక్కతాటిపైకి తెచ్చి ఈ కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త  పోర్టల్‌‌లో కార్మికుల వివరాల రిజిస్ట్రేషన్‌‌ కార్మిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు.. కార్మిక సంఘాలు సాయంతో ఉమ్మడి సేవా కేంద్రాల (సీఎస్సీలు) ద్వారా నిర్వహిస్తాయి. ప్రతి కార్మికుడికి ప్రత్యేకమైన 12 అంకెల నంబర్ గల ఈ–శ్రమ్ కార్డు ఇస్తారు. రిజిస్ట్రేషన్ ను ఉచితంగానే చేస్తారు. కార్డుకు దేశమంతటా గుర్తింపు ఉంటుంది. అన్ని సెగ్మెంట్లలోని కార్మికులు తమ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైన వాటి సహాయంతో కొత్త పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ–శ్రమ్ పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్  ప్రారంభమైందని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరిన్ని వివరాలు పొందడానికి టోల్ ఫ్రీ నంబర్ "14434"కు ఫోన్ చేయవచ్చు.
 రిజిస్ట్రేషన్ వల్ల లాభాలుః
 రిజిస్టర్ అయిన అనార్గనైజ్డ్ కార్మికులందరికీ ఒక సంవత్సరం పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) ద్వారా ప్రమాద బీమా కవరేజ్ అందుతుంది. ప్రమాదవశాత్తు మరణించినా,  శాశ్వత వైకల్యం వస్తే రూ .2 లక్షలు చెల్లిస్తారు. కొంత వైకల్యం ఉన్నట్లయితే రూ.లక్ష ఇస్తారు. కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా యూనియన్,  రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రతా ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు లేదా మహమ్మారులు వచ్చినప్పుడు అర్హులైన కార్మికులకు సహాయం అందించడానికి పోర్టల్లోని వివరాలను ట్రేడ్ యూనియన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకుంటాయి. 
ఈ‑శ్రమ్ పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ ఇలా:
1    ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్‌‌లోని సెర్చ్ బార్‌‌లో ఈ–శ్రమ్ పోర్టల్ పేజీ - https://www.eshram.gov.in/ ని ఓపెన్ చేయండి.
 2: హోమ్‌‌పేజీలో "ఈ–శ్రమ్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి" అనే లింక్ పై క్లిక్ చేయండి.
  3    దీనిపై క్లిక్ చేసిన తర్వాత https://register.eshram.gov.in/#/user/self పేరుతో కొత్త పేజీ కనిపిస్తుంది. 
  4    సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌‌లో యూజర్ తన ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌‌ను రిజిస్టర్ చేయాలి. (ఇది ఆప్షనల్).
  5    ఇప్పుడు క్యాప్చాను టైప్ చేయాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లేదా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) సభ్యుడు అయితే, సంబంధిత ఆప్షన్‌‌పై క్లిక్ చేయాలి. తరువాత ‘సెండ్ ఓటీపీ’ ఆప్షన్‌‌పై క్లిక్ చేయండి.
  6     చివరగా యూజర్ తన బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్‌‌ను పూర్తి చేయాలి.ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ లేకపోయినా ఉచిత రిజిస్ట్రేషన్ పొందవచ్చు.  కార్మికులకు తమకు దగ్గర్లోని సీఎస్సీలకు వెళ్లి బయోమెట్రిక్  రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.