ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట, వెలుగు : రాత్రింబవళ్లు ప్రజల రక్షణ కోసం శ్రమించే  పోలీసులు ఆరోగ్యంపై మందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని  మంత్రి హరీశ్​ రావు అన్నారు. గురువారం సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో  పోలీస్ ఆరోగ్య రక్ష (హెల్త్ ప్రొఫైల్) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలిటికల్, పోలీస్, ప్రెస్ ఈ మూడు రంగాల్లోనివారు నిత్యం ఎంతో శ్రమించేవారని అన్నారు. పండుగలు వస్తే అందరికీ సెలవులు ఉంటాయి కానీ.. వీరికి ఎప్పుడూ డ్యూటీనే ఉంటుందని, ఇలాంటప్పుడు వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమాన్ని  రెండేళ్ల పాటు మూడు దశల్లో చేస్తామని, త్వరలో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సైతం ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. పోలీస్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి 15 లక్షల బడ్జెట్ కేటాయించామని, దీన్ని  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహించే టెస్టుల ద్వారా ఒక్కొక్కరి ప్రొఫైల్ మూడు భాగాలుగా తయారు చేయనున్నట్లు వివరించారు.హెల్త్ ప్రొఫైల్ కు  అనుగుణంగా మెడిసిన్ ఇవ్వబోతున్నారని తెలిపారు. అనంతరం సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళల రక్షణ కోసం స్నేహిత మహిళ సహాయక  కేంద్రాన్ని, ఆధునీకరించిన  సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ను సీపీ ఎన్. శ్వేత ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల పాల్గొన్నారు. 

‘మనఊరు మనబడి’  పనుల్లో వేగం పెంచాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు : మనఊరు  మనబడి కింద చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లలోని పనుల్లో వేగం పెంచి త్వరగా కంప్లీట్​ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అడిషనల్​కలెక్టర్ రాజర్షి షా తో కలిసి మన ఊరు మనబడి పనుల పురోగతి, మోడల్ స్కూళ్లలో పనుల పురోగతి, తదితర అంశాలపై  విద్య, ఇంజనీర్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే పూర్తయిన సివిల్ వర్క్స్ తో పాటు పెయింటింగ్, సంప్, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ఫ్లోరింగ్ , ఫినిషింగ్, తదితర  పనులు చేయించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎంఈఓలకు  సూచించారు. పనులు చేపడుతున్న మోడల్ స్కూళ్లను ఈ నెల 13 లోగా అన్ని హంగులతో పూర్తి చేయాలని చెప్పారు.  పనులలో జాప్యంపై పలు నియోజకవర్గాల ఈఈలు, డీఈల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చేవారం వరకు చూస్తానని, అప్పటికి పురోగతి లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తయిన పనులకు వెంట వెంటనే ఎఫ్టీఓ (ఫండ్​  ట్రాన్స్​ఫర్ ఆర్డర్స్) లను అప్​లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్,  ఇంజనీరింగ్ శాఖల ఈఈలు, డీఈలు, ఎంఈఓలు, విద్యా శాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్​ స్టూడెంట్​కు రూ.లక్ష సాయం

పటాన్​చెరు,వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్​గ్రామంలోని నాగార్జున కాలనీకి చెందిన భవ్య శ్రీ అనే విద్యార్థిని పాట్నా ఎయిమ్స్ లో ఎంబీబీఎస్​ చదువుతోంది. ఆమె చిన్ననాటి నుంచి అన్నింట్లో మెరిట్​ సాధిస్తుండటంతో ఎంబీబీఎస్​ చదువుకునేందుకు బీఆర్ఎస్​ రాష్ట్ర నాయకుడు, చిట్కుల్ సర్పంచ్​నీలం మధు రూ.లక్ష అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో ప్రతిభ కనబర్చే విద్యార్థులు ఏ కారణంతోనైనా  వెనుకపడొద్దనే ఉద్దేశంతో అలాంటివారికి సహాయం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ముత్యాలు, మల్లారెడ్డి, శ్రీనివాస్ చారి, రాములు నాయక్, బాబు రావు, అంబలా గాన్, బి.జయకుమార్, మధుసూదన్ రావు  తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మునిపల్లి, (కోహీర్​), వెలుగు : అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర  ప్రభుత్వం కృషి చేస్తోందని జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్​ రావు అన్నారు. గురువారం కోహీర్ రైతు వేదికలో మండల పరిధిలోని  121మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారమే పలు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్, తహసీల్దార్​ విజయ్​ కుమార్, బీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు నర్సింలు యాదవ్, వైస్ ఎంపీపీ షాకిర్ అలీ, పీఏసీఎస్ చైర్మన్ స్రవంతిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.  అనంతరం కోహీర్​ మండల  బీఆర్​ఎస్​ నాయకుడు,  పిచెర్యాగడి మాజీ ఎంపీటీసీ జట్టప్ప గుండె పోటుతో బుధవారం మృతి చెందడంతో గురువారం ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  

పేదల సంక్షేమమే సర్కార్ లక్ష్యం

కంగ్టి, వెలుగు: బీఆర్ఎస్ సర్కార్ పేదల సంక్షేమం కోసం పని చేస్తోందని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండలం కేంద్రంలో ఆయన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. 

పోస్టర్ల ఆవిష్కరణ..

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ పట్టణంలోని క్యాంపు ఆఫీసులో గురువారం టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, యూనియన్ బాధ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ ప్లీనరీ మహాసభలు ఈనెల 8, 9, 10వ తేదీలలో పటాన్ చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతాయని తెలిపారు. సభలకు అల్లం నారాయణ అధ్యక్షత వహిస్తారని, సీఎం కేసీఆర్, మంత్రులు హాజరవుతారని చెప్పారు.

బస్సుల కోసం స్టూడెంట్స్ రాస్తారోకో

నర్సాపూర్, వెలుగు : సరిపడ బస్సులు నడపాలని కోరుతూ స్టూడెంట్స్ హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై నర్సాపూర్ బస్ డిపో ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ డిపో ఏర్పాటైన కూడా నల్లవల్లి, వెల్దుర్తి గ్రామాలకు బస్సులు రాకపోవడంతో స్టూడెంట్స్  ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని అన్నారు. బస్సు సౌకర్యం కల్పించే వరకూ ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదర్, ఎస్సై గంగరాజు, డిపో ఇన్​చార్జి మేనేజర్ నరేందర్ స్టూడెంట్స్ తో మాట్లాడి సోమవారం వరకు బస్సు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అక్షయ్ గౌడ్, రాహుల్ గౌడ్, సుజిత్ రెడ్డి, సాయిరాం, వరుణ్, కార్తీక్ పాల్గొన్నారు.