ఐటీ ఉద్యోగులకు లేఆఫ్ కష్టాలు

ఐటీ ఉద్యోగులకు లేఆఫ్ కష్టాలు

ఎంఎన్సీల బాటలో స్మాల్, మీడియం స్కేల్ కంపెనీలు
వర్క్ ఫ్రం హోం చేయిస్తూనే జాబ్ కి చెక్
బలవంతంగా రిజైన్లు
కొన్ని ఆఫీసులకు తాళం.. అడ్రస్లు చేంజ్
శాలరీస్ రాక ఉద్యోగుల అవస్థలు

సౌమ్య.. సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. మంచిశాలరీ,తక్కువ టైంలో ప్రొఫెషనల్ గ్రోత్ ఉందని సంతోషంలో ఉండగా, కరోనా షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా మొదలైన లే ఆఫ్, కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడితో ఉన్న ఫళంగా రిజైన్ చేయాల్సి వచ్చింది.

రంజిత్.. మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో నాలుగేండ్లుగా వర్క్ చేస్తున్నాడు. కెరీర్ గ్రోత్ స్లో గా ఉన్నా… వర్క్ ప్రెజర్ లేదని అందులోనే కంటిన్యూ అవుతున్నాడు. ఐటీ కారిడార్లో కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి కంపెనీ ఆర్డర్స్ తో వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. రెండు నెలల నుంచి శాలరీ కూడా ఇవ్వడం లేదు. ఎప్పుడొస్తుందో తెలియని జీతం కోసం మరో 10 మంది అతడిలానే ఎదురు చూస్తున్నారు.

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో ఐటీ సెక్టార్లో గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఐటీ ఆపరేషన్ ఆగిపోవడం, కంపెనీలకు నిర్వహణ భారం పెరిగిపోవడం ఎంప్లాయీస్ కు శాపంగా మారుతోంది. ముఖ్యంగా యూఎస్ నుంచి వచ్చే ప్రాజెక్టులన్నీ నిలిచిపోవడంతో దేశంలోని ఐటీ కంపెనీలు లే ఆఫ్ దిశగా అడుగు లేస్తున్నాయి. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీల్లో దేశవ్యాప్తంగా 45వేల మందిని తొలగించగా, అందులో సిటీ టెక్కీలు 40 శాతానికి మించి ఉంటారని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. 4 నెలల నుంచి ఎంప్లాయీస్ తో వర్క్ ఫ్రం హోమ్ చేయిస్తున్న 90 శాతం కంపెనీలు ఇదే అదనుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పెద్ద సంస్థలు ఫోర్స్డ్ రిజైన్ల పేరిట తీసేస్తుండడంతో ఎంప్లాయీస్ ఆందోళన చేస్తున్నారు. స్మాల్, మీడియం స్కేల్ కంపెనీల మేనేజ్మెంట్లు ఏకంగా ఆఫీసులకు తాళం వేసి దొరక్కుండా పోతున్నాయి.

శాలరీస్ పెండింగ్..
ఏటా సాధారణంగా ఉండే లే ఆఫ్స్ కంటే ఈసారి 15 శాతం ఎక్కువగా ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి. అందులో ఎంఎన్సీ కంపెనీలు కూడా ఉండటంతో స్మాల్, మీడియం రేంజ్ కంపెనీలూ అదేబాటలో నడుస్తున్నాయి. కొన్ని నేరుగా ఉద్యోగులతో రిజైన్ చేయిస్తుంటే, మరికొన్ని శాలరీలు ఇవ్వకుండా పని చేయించుకుంటున్నాయి. శాలరీలు అడిగితే.. ‘‘ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చినప్పుడు తీసుకోవాలి. లేదంటే, జాబ్ మానేయండి” అని చెప్తున్నాయని మాదాపూర్ లో పనిచేసే ఐటీ ఉద్యోగి అరుణ్ వాపోయాడు.

పెద్ద ఎంప్లాయీస్ ఫస్ట్
వర్క్ ఫర్ఫార్మెన్స్ ఆధారంగా రేటింగ్ ఇచ్చి, ఉద్యోగులను తొలగించే విధానాన్ని కంపెనీలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మొదట పైస్థాయిలో ఉండే ఎంప్లాయీస్ ను టార్గెట్ చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో జీతభత్యాలు ఇచ్చుకోలేక వారిని వదిలించుకుంటున్నాయి. ఆ తర్వాత కింది స్థాయి సిబ్బందిపై పడతారని, కాస్ట్ కటింగ్ అని చెప్పకుండా రేటింగ్ లేదంటూ రంగంలోకి దిగిన మేనేజర్లు ఒత్తిడి చేసి రిజైన్ చేయిస్తున్నారని ప్రముఖ కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ తెలిపారు.

కంపెనీలు ఎత్తేస్తున్నరు
లాక్ డౌన్ తో ఐటీ కారిడార్లోని కంపెనీలన్నీ టెంపరరీగా షట్ డౌన్ అవగా, ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రంహోం లో ఉన్నారు. ఇప్పుడిదే చిన్న, మధ్య తరహా కంపెనీలకు కలిసొస్తోంది. కొందరు కంపెనీలు ఎత్తేసి.. నేరుగా ఉద్యోగులతో పని చేయించుకుంటున్నారు. ఇలాంటి పనులతో గత 4 నెలల్లో 250 మందికి పైగా ఉద్యోగులు ఇబ్బంది పడ్డారని ఫోరం ఫర్ ఐటీ అసోసియేషన్ సభ్యులు చెప్పుకొచ్చారు. శాలరీ రాలేదని అడిగేందుకు ఉద్యోగి ఆఫీస్ కు వెళ్లినా ఎవరూ ఉండడం లేదు. దాంతో ఎవరిని అడగాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. కొందరు మాత్రం లేబర్ ఆఫీసులను ఆశ్రయిస్తున్నారు.

చిన్న కంపెనీల ఇష్టారాజ్యం
దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో అప్రకటిత లే ఆఫ్స్ తో జాబ్స్ పోతున్నయి. ఇటీవల ఓ కంపెనీలో ఏకంగా 18 వేల మందిని తొలగించారు. అందులో హైదరాబాద్ వాళ్లూ ఉన్నరు. కొందరు లేబర్ డిపార్ట్మెంట్ ను కూడా ఆశ్రయించారు. చిన్న కంపెనీలు కూడా ఇదే తరహా మొదలుపెట్టాయి. నియంత్రణ లేకపోవడంతో వాటిల్లో పనిచేసే టెక్కీలకు ఇబ్బందిగా మారింది. కొన్ని కంపెనీలు పెండింగ్ లో పెట్టిన 3 నెలల శాలరీస్ ను కార్మికశాఖ ప్రమేయంతో ఇచ్చాయి.
‑ వినోద్ కుమార్, ఫోరం ఫరం ఐటీ ఎంప్లాయీస్(ఎఫ్ఐటీ),తెలంగాణ కన్వీనర్

రేటింగ్ ఉన్నా రిజైన్ చేయిస్తున్నరు
సిటీలోని ప్రముఖ కంపెనీలో ఏడేండ్లుగా వర్క్ చేస్తున్నా. ఏటా పర్ఫార్మెన్స్ రేటింగ్ ఆధారంగా తీసివేతలు ఉంటాయి. ఈసారి రేటింగ్ తో సంబంధం లేకుండా రిజైన్ చేయాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే, టెర్మినెట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కావాలని పనితీరు బాగా లేదంటూ రేటింగ్ తగ్గించి మరీ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
– గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీ ఎంప్లాయ్

For More News..

తెలంగాణలో 20 రోజుల్లో 30 వేల కేసులు

చికెన్లో మత్తు కలిపి.. తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్