ఒరాకిల్‌‌లో ఏం జరుగుతుంది.. ఆగని ఉద్యోగాల కోత.. ఆఫర్ లెటర్స్ కూడా క్యాన్సిల్!

ఒరాకిల్‌‌లో ఏం జరుగుతుంది.. ఆగని ఉద్యోగాల కోత.. ఆఫర్ లెటర్స్ కూడా క్యాన్సిల్!

టెక్ దిగ్గజం ఒరాకిల్‌‌లో ఉద్యోగాల కోతల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో 3,000 మందికి ఉధ్వాసన పలికిన ఈ టెక్ దిగ్గజం, మరోసారి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించటంతో ప్రకంపనలు మెుదలయ్యాయి. ఈ ప్రకటనతో టెక్కీలు ఏ రోజు తమ ఉద్యోగం ఊడుతుందో అన్న భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

అందుతున్న నివేదికల ప్రకారం.. ఈ సారి హెల్త్‌ విభాగంలో కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ విభాగంలో కొత్తగా నియమించుకునేందుకు ఉద్యోగులకు జారీ చేసిన జాబ్‌ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలగించబడిన ఉద్యోగులకు 4 వారాల జీతంతో పాటు.. పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా ఒక వారం జీతం, వెకేషన్ డేస్ చెల్లింపులు ఉంటాయని ఒరాకిల్ యాజమాన్యం వెల్లడించింది. 

గతేడాది డిసెంబరులో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ సంస్థ సెర్నర్‌ను 28.3 బిలియన్ డాలర్లు వెచ్చించి ఒరాకిల్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం జరిగిన వెంటనే సెర్నర్.. అమెరికాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వెటరన్స్‌ అఫైర్స్‌ ఆఫీస్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌లో పేషెంట్ల సమాచార నిర్వహణ కాంట్రాక్ట్ దక్కించుకుంది. కానీ, సెర్నెర్‌ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు తలెత్తడంతో ఈ ఒప్పందం అర్థాంతరంగా ఆగిపోయింది. ఇదే లేఆఫ్‌లకు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.