
లక్నో: గత ఆగస్టు 16న మాజీ ప్రధాని వాజ్ పేయి కన్నుమూయడంతో బీజేపీ దేశవ్యాప్తంగా నివాళులర్పించింది. ఆయన సేవల్ని తలుచుకుంటూ అనేకచోట్ల కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగానే ఆగస్టు 23న లక్నోలోని గోమతీ తీరంలో ఆయన అస్థికల నిమజ్జనాన్ని యోగి సర్కారు చేపట్టింది. ఆ ప్రోగ్రామ్‌కు అయిన రూ.2.5 కోట్ల ఖర్చును మాత్రం ఇప్పటిదాకా చెల్లించకపోవడంతో లక్నో డెవలప్‌మెంట్‌అథారిటీ (ఎల్‌డీఏ) తల పట్టుకుంది. ఆ కార్యక్రమానికి తాము పెట్టుకున్న ఖర్చును చెల్లించాలంటూ ప్రభుత్వంలోని అనేక డిపార్టుమెంట్‌లకు ఎల్‌డీఏ లేఖలు రాసినా ఫలితం లేదు. ఇప్పుడా లేఖలు మీడియాకు ఎక్కాయి. తమకు రావాల్సిన పైసలు ఇవ్వాల్సిందిగా ఎల్‌డీఏ సెక్రటరీ ఎంపీ సింగ్ ఈ ఏడాది జనవరిలో ఒక లేఖ రాశారు. స్పందన లేకపోవడంతో మార్చి 15న మరో లేఖ రాసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయం మీడియాలో రావడంతో కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ‘‘వాళ్లు ప్రతి సభలో వాజ్‌పేయి గురించి గొప్పగా చెబుతారు. కానీ ఆయన అంత్యక్రియలకు అయిన డబ్బులు కూడా చెల్లించలేదు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ లల్లూ అన్నారు.