
- ప్రజావాణిలో ఓ వృద్ధురాలు వేడుకోలు
మహబూబ్ నగర్ (నారాయణపేట), వెలుగు : కలెక్టరమ్మ కొడుకు, కోడలు ఇంట్లోంచి గెంటేశారు..ఆదుకోండి అంటూ సోమవారం ప్రజావాణిలో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను ఓ వృద్ధురాలు వేడుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట పట్టణానికి చెందిన రుక్మిణి (54) ఇద్దరు కూతుళ్ల సాయంతో కలెక్టరేట్ మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతోంది. మద్దూరు మండల కేంద్రంలోని ఆస్పత్రిని తనిఖీ చేసి కలెక్టరేట్ కు వస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ వృద్ధురాలును చూసి దగ్గరకు వెళ్లి సమస్య ఏమిటని అడిగింది.
భర్త మృతి చెందగా కొడుకుకు ఉద్యోగం వచ్చిందని, కొడుకు, కోడలు సాకకుండా తన పెద్ద కూతురు వద్ద వదిలేశారని తెలిపింది. స్పందించిన కలెక్టర్ వృద్ధురాలి కోసం వీల్ చైర్ తెప్పించి పట్టణంలోని సఖీ కేంద్రంలో చేర్పించింది. కొడుకుపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రాంచందర్ నాయక్‌ను ఆదేశించింది.
ఆస్తి లాక్కొని రోడ్డున పడేశారు ! -కలెక్టర్, ఎస్పీలకు వృద్ధురాలి మొర
గద్వాల : తమ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని, బ్యాంకులో డబ్బులు, ఒంటి మీది బంగారం లాక్కొని కొడుకు, కోడలు రోడ్డున పడేశారని వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు హుస్సేన్ బి జోగులాంబ గద్వాల్ కలెక్టర్ సంతోష్ ఎదుట కన్నీటి పర్యంతమైంది. స్పందించిన కలెక్టర్ ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బస్సు మోహన్ రావు, ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.
రైతు బీమా ఇప్పించండి సారూ..
అయిజ : మండలంలోని తూముకుంట గ్రామానికి చెందిన కుర్వ శారద తన భర్త కుర్వ డోలు పరశురాముడు కు సంబంధించిన రైతు బీమా సొమ్ము ఇప్పించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ను ప్రజావాణిలో కోరింది. బాధితురాలి వివరాల ప్రకారం.. శారద భర్త పరుశురాముడు జూన్ 7న అనారోగ్యంతో మృతి చెందాడు. రైతు బీమా ఇప్పించాలని ఏఈవోను కోరింది. బీమా రాదని చెప్పడంతో ఇటీవల జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కలవగా, మీ భర్త ఇన్ ఎలిజిబుల్ గా నమోదయ్యాడని చెప్పారు. దీంతో తనకు న్యాయం చేయాలని సోమవారం కలెక్టరేట్ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదులపై దృష్టి పెట్టాలి
నాగర్ కర్నూల్ టౌన్ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు, అమరేందర్, దేవ సహాయం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.