
- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, వెలుగు: ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా మనుషులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారని, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్(కార్డియాక్ పల్మనరీ రిసెక్రియేషన్) విధానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు డాక్టర్ రఘు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలో కేవలం 1-2 శాతం ప్రజలకు మాత్రమే సీపీఆర్‌పై అవగాహన ఉందన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పోలీస్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, టీచర్లు, మీడియా ప్రతినిధులు, ఇతర శాఖల సిబ్బందికి సైతం శిక్షణ ఇవ్వాలని డీఎంహెచ్‌వో శ్రీనివాసులును ఆదేశించారు. ఆగష్టు 15న జిల్లాలో నిర్వహించబోయే స్వాతంత్ర్య వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు కీమ్యా నాయక్, యాదయ్య, అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి, ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ రామచంద్రరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల కొరత లేకుండా చూడాలి
జిల్లాలో ఎరువుల కొరత లేకుండా అప్రమతంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాతకోటలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. దుకాణంలో ఎరువుల నిల్వలకు సంబంధించి బోర్డును పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు అవసరమైనంతవరకే యూరియా అమ్మాలని అదనంగా ఇవ్వొద్దని సూచించారు. రైతులకు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచాలని బ్లాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ కురుమయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.