కశ్మీర్‌‌ను పాక్‌లో కలిపేందుకు తాలిబన్ల సాయం

కశ్మీర్‌‌ను పాక్‌లో కలిపేందుకు తాలిబన్ల సాయం
  • ఇమ్రాన్ ఖాన్‌ పార్టీ లీడర్ కామెంట్స్

ఇస్లామాబాద్: భారత్‌కు వ్యతిరేక అజెండాతో పాకిస్థాన్‌ తాలిబన్లకు సహకరిస్తోందన్నది మరోసారి రుజువైంది. అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చడంలో తాలిబన్లకు పాక్ మిలటరీ సాయం అందిందన్న వార్తలకు మరో సాక్ష్యంలా పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ పార్టీ మహిళా నేత ఒకరు కామెంట్స్ చేశారు. ఓ న్యూస్‌ చానెల్ లైవ్ డిబేట్‌లో మాట్లాడుతూ ఆ పార్టీ నేత నీలం ఇర్షాద్ షేక్.. కశ్మీర్‌‌ను పాకిస్థాన్‌లో కలిపేందుకు తాలిబన్ల సాయం చేస్తామన్నారని కామెంట్స్ చేశారు. ‘‘కశ్మీర్‌‌ విషయంలో పాకిస్థాన్‌కు సాయం చేసేందుకు సిద్దమని తాలిబన్లు మాకు చెప్పారు” అని ఇర్షాద్ అన్నారు.

అయితే కశ్మీర్‌‌ విషయంలో గతంలోనే తాలిబన్ ప్రతినిధులు స్పందించారు. కశ్మీర్ ఇష్యూ భారతదేశ అంతర్గత అంశమని ప్రకటించారు. అయితే టీవీ చానెల్‌లో ఇర్షాద్ షేక్ చేసిన కామెంట్స్‌పై వెంటనే యాంకర్ స్పందించి, ‘‘మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? ఈ డిబేట్ ప్రపంచమంతా టెలికాస్ట్ అవుతుంది. మీరు మాట్లాడేది భారత్‌లో కూడా చూస్తారు. మీకు ఎవరు చెప్పారు కశ్మీర్‌‌ను పాకిస్థాన్‌లో కలిసేందుకు తాలిబన్లు సాయం చేస్తారని వాట్సాప్ మెసేజ్‌ వచ్చిందా?” అని అడిగారు. అయితే ఇర్షాద్ మాత్రం అదేం పట్టించుకోకుండా.. తాలిబన్ల పట్ల భారత్ సరిగా వ్యవహరించలేదని, అందుకే వాళ్లు పాకిస్థాన్‌కు కచ్చితంగా సాయం చేస్తారని అన్నారు. పాక్ ఆర్మీకి ఆ పవర్ ఉందని, తాలిబన్లు కూడా సాయం చేస్తారని అన్నారు. కాగా, అఫ్గాన్‌పై ఆధిపత్యం సాధించేందుకు తాలిబన్లకు పాకిస్థాన్ ఆర్మీ సహకరించిందని గతంలో అఫ్గాన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు ఇర్షాద్ కామెంట్స్ బలం చేకూర్చేలా ఉన్నాయి.