హుజూరాబాద్ బీఆర్ఎస్‌‌లో అసమ్మతి .. ఎన్నికల టైంలో పార్టీని వీడుతున్న ప్రజాప్రతినిధులు, లీడర్లు

హుజూరాబాద్ బీఆర్ఎస్‌‌లో అసమ్మతి  .. ఎన్నికల టైంలో పార్టీని వీడుతున్న ప్రజాప్రతినిధులు, లీడర్లు
  • మొన్న జమ్మికుంట జడ్పీటీసీ, నిన్న  ఎంపీపీ పార్టీకి రిజైన్ 
  • అదే దారిలో మరికొందరు లీడర్లు 

కరీంనగర్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల ముందు హుజూరాబాద్ బీఆర్ఎస్‌‌లో అసమ్మతి రాగం వినిపిస్తోంది. బై ఎలక్షన్ టైంలోనూ పార్టీలోనే ఉన్న లీడర్లు, ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా  బయటకు వెళ్తున్నారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నిరసన గళం వినిపిస్తోంది. కేయూ జేఏసీ మాజీ కన్వీనర్, జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్  శనివారం పార్టీని వీడగా, మరుసటి రోజే ఆదివారం జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత బీఆర్ఎస్‌‌కు రాజీనామా చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పట్టించుకోవడం లేదని అసమ్మతి నాయకులు ఆరోపిస్తున్నారు. 

త్వరలో మరిన్ని చేరికలు

హుజూరాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ కోసం పని చేస్తుండగా.. త్వరలోనే వారిద్దరూ కాంగ్రెస్​పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. వీరితోపాటు జమ్మికుంట మున్సిపాలిటీలోని ఏడుగురు కౌన్సిలర్లు, జమ్మికుంట మండలానికి చెందిన పలువురు సర్పంచులు, కమలాపూర్ మండలానికి చెందిన కీలక నాయకులు హస్తం గూటికి  చేరేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అసమ్మతి నేతల చూపు.. కాంగ్రెస్ వైపు 

బీఆర్ఎస్‌‌లో ఇమడలేక పార్టీని వీడుతున్న నాయకుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌‌లో చేరుతున్నారు. ఇటీవల మాజీ జడ్పీటీసీ అరుకాల వీరేశలింగం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగా, తాజాగా ఆదివారం జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 

ALSO READ : అవినీతిపరులు జైల్లో ఉండాలంటే.. కాంగ్రెస్ రావాలి : వివేక్ వెంకటస్వామి

హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కంకణాల సరోజన, మాజీ సర్పంచ్ కంకణాల జనార్దన్ రెడ్డి, ఇప్పలనర్సింగాపూర్ కు చెందిన గూడూరు జనార్దన్ రెడ్డి, గూడూరు ఉషానందిని, వనజ కాంగ్రెస్‌‌లో చేరారు. ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బండి మల్లయ్య, సొసైటీ డైరెక్టర్లు కేటిక తిరుపతిరెడ్డి, బద్దిపడిగ రవీందర్ రెడ్డి, మాజీ వార్డుమెంబర్ అంతం మల్లారెడ్డి సైతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌‌లో చేరారు.