ఈ సాఫ్ట్​వేర్లు నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి

ఈ సాఫ్ట్​వేర్లు నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి
  • డిజైన్, అనలిటిక్స్,  జావాకు మస్తు డిమాండ్​
  • వెల్లడించిన  లింక్డ్‌‌‌‌ఇన్ సర్వే 

న్యూఢిల్లీ: ఎంట్రీ లెవెల్​లో ఆకర్షణీయమైన జీతం కోరుకునే వాళ్లు డిజైన్, అనలిటిక్స్,  జావా స్క్రిప్ట్ వంటి టెక్నాలజీలు/సాఫ్ట్​వేర్లు నేర్చుకుంటే కెరీర్​ బాగుంటుందని తాజా సర్వేలో తేలింది. వీటిపై పట్టు ఉంటే జాబ్స్​ దొరకడం ఈజీ అవుతుందని ప్రొఫెషనల్ నెట్‌‌‌‌వర్కింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్ లింక్డ్‌‌‌‌ఇన్ ఫ్రెష్​ సర్వే వెల్లడించింది. దీని ప్రకారం.. జాబ్ మార్కెట్‌‌‌‌లోకి ప్రవేశించాలనుకుంటున్న ఫ్రెష్​ గ్రాడ్యుయేట్లు వీటిపై ఫోకస్​ చేయాలి. మునుపెన్నడూ లేని విధంగా 2023లో కంపెనీలు ఫ్లెక్సిబిలిటీని అంగీకరిస్తున్నాయి. 2022తో పోల్చితే ఆన్-సైట్ రోల్స్​ కేవలం 10 శాతం తగ్గాయి.  ఎంట్రీ -లెవల్ రోల్స్​కు హైబ్రిడ్ లెవెల్స్ 60శాతం పెరిగాయి. ఈ మార్పు ఫ్రెష్​ గ్రాడ్యుయేట్లకు ఎంతో మేలు చేస్తుంది.  ప్రస్తుతం భారతదేశంలో జాబ్స్​ ఇస్తున్న పరిశ్రమలలో ఆర్థిక సేవలు, సపోర్ట్​ సర్వీసెస్​, అకామడేషన్​ సంస్థలు ఉన్నాయి. ఈ రంగాలు బ్యాచిలర్ డిగ్రీలు ఉన్న ఫ్రెష్​ గ్రాడ్యుయేట్‌‌‌‌లకు మంచి అవకాశాలను అందిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ లేని వారికి కూడా, అడ్మినిస్ట్రేటివ్  సపోర్ట్, సర్వీసెస్​, అకామడేషన్​, ఆర్థిక సేవల పరిశ్రమలలో అవకాశాలు పెరుగుతున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్ల కోసం రిస్క్ కన్సల్టెంట్, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ మేనేజర్,  ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటర్ వంటి రోల్స్​ గణనీయంగా పెరుగుతున్నాయి. 

ఎంబీఏ గ్రాడ్యుయేట్ల కోసం టెక్నాలజీ అసోసియేట్, కేటలాగ్ స్పెషలిస్ట్,  బిజినెస్ ఇంటిగ్రేషన్ అనలిస్ట్ వంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్ల కోసం ప్రొడక్షన్​ మేనేజ్​మెంట్​,  మానవ వనరులు, సైనిక  రక్షణ సేవలు,  కన్సల్టింగ్ వంటి రంగాలు పుష్కలమైన అవకాశాలను అందిస్తున్నాయి. వీటిలో కొన్నింటికి డిగ్రీ కూడా అవసరం లేదు.  కొన్ని రకాల సవాళ్లు ఉన్నప్పటికీ,  స్కిల్స్​ కలిగిన వారికి ప్రస్తుత జాబ్ మార్కెట్‌‌‌‌లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని లింక్డ్‌‌‌‌ఇన్ కెరీర్ ఎక్స్‌‌‌‌పర్ట్ & ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరాజితా బెనర్జీ అన్నారు. ‘‘కెరీర్‌‌‌‌ను ప్రారంభించే వాళ్లు ఉద్యోగాల కోసం సరైన వ్యక్తులను ఎంచుకోవాలి. పరిశ్రమ నిపుణుల నుండి గైడెన్స్​ తీసుకోవాలి.   కంపెనీ వెబ్​సైట్లను తరచూ చూస్తుండాలి. ఇలాంటివి చేస్తే ఉద్యోగం దక్కించుకోవడం ఈజీ అవుతుంది. ఇండస్ట్రీలకు ఎలాంటి నిపుణులు కావాలో తెలుసుకోవాలి” అని అన్నారు.  

లక్షలాది మంది ఎక్స్​పర్టుల కెరీర్‌‌‌‌ మార్గాలను విశ్లేషించే లింక్డ్‌‌‌‌ఇన్ ఎకనామిక్ గ్రాఫ్ (ప్లాట్‌‌‌‌ఫారమ్) డేటా ఆధారంగా ఈ ఫలితాలు వచ్చాయి.  2021-- నుంచి2023 వరకు అందుబాటులో ఉన్న  డేటాను విశ్లేషించడం ద్వారా  ఈ సంవత్సరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విధులు/ఉద్యోగాలు, పరిశ్రమలు,  నైపుణ్యాలను గుర్తించారు. జనవరి 2022 నుండి మార్చి 2023 వరకు లింక్డ్‌‌‌‌ఇన్‌‌‌‌లో కనిపించిన మొత్తం జాబ్​ పోస్టింగ్‌‌‌‌ల ఆధారంగా టాప్​ స్కిల్స్​ను ఎంపిక చేశారు.