కొత్తగూడెం, పాలేరు ఇస్తేనే దోస్తీ.. లేదంటే సొంతంగా పోటీచేస్తామంటున్న లెఫ్ట్​ పార్టీలు

కొత్తగూడెం, పాలేరు ఇస్తేనే దోస్తీ.. లేదంటే సొంతంగా పోటీచేస్తామంటున్న లెఫ్ట్​ పార్టీలు
  • కొత్తగూడెం, పాలేరు ఇస్తేనే దోస్తీ
  • లేదంటే సొంతంగా పోటీచేస్తామంటున్న లెఫ్ట్​ పార్టీలు.
  • రెండూ తమకే     కేటాయించాలని పట్టు
  • లేదంటే బీఆర్ఎస్ తో కటీఫ్!​
  • కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానన్న కూనంనేని
  • అదే సీటుపై వనామా, గడల ఆశలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కమ్యూనిస్టులతో పొత్తు కావాలంటే కొత్తగూడెం, పాలేరు సీట్లు వదులుకోవాల్సిందేనని లెఫ్ట్​పార్టీలు పట్టుబడుతున్నాయి. సీపీఐతో పొత్తు కొత్తగూడెం సీటుపైనే ఆధారపడి ఉందని ఆ పార్టీ స్టేట్​సెక్రెటరీ కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో పొత్తులపై ఇప్పుడే ఏం చెప్పలేమని, పరిస్థితుల ఆధారంగా అలయెన్స్​ ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో కూనంనేని చేసిన హాట్​కామెంట్స్​ సంచలనంగా మారాయి. సీపీఐ కొత్తగూడెంలో తప్పకుండా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా ఏ పొత్తులైనా కొత్తగూడెం సీటుపైనే ఆధాపడి ఉంటాయని తేల్చి చెప్పారు. 

పొత్తులపై గిమ్మిక్కులు...

మునుగొడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్​తో సీపీఐ, సీపీఎం జతకట్టాయి. ఆ ఎన్నికల్లో తమ కారణంగానే బీఆర్ఎస్ ​గెలిచిందని కమ్యూనిస్టులు బల్లగుద్ది చెప్పారు. ఆ తర్వాత బీఆర్ఎస్​తో సీపీఐ, సీపీఎం మరింత దగ్గరయ్యాయి. టీఆర్ఎస్ ​కాస్త బీఆర్ఎస్ గా మారాక ఖమ్మంలో జరిగిన ఆవిర్భావ సభకు సీపీఎం, సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతలను కేసీఆర్ ​ఆహ్వానించారు. ఆ రెండు పార్టీలతో పొత్తులుంటాయని సీఎం చెప్పకనే చెప్పారు. తాము బీఆర్ఎస్ తో కలిసి ఉంటా మని కమ్యూనిస్టు నేతలూ వెల్లడించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటించిన టైమ్​లోనూ సీపీఐ, సీపీఎం నేతలకు ప్రాధాన్యమిచ్చారు. బీఆర్ఎస్​కు దగ్గరైన క్రమంలో లెఫ్ట్ నేతలు బీజేపీపై వ్యతిరేకంగా యాత్రలు చేపట్టారు. బీఆర్ఎస్​తో పొత్తు పై చర్చలు సాగుతున్న క్రమంలోనే సిట్టింగ్​లకు సీట్లు ఖాయమంటూ ఇటీవలే సీఎం కేసీఆర్ ​చేసిన ప్రకటన కమ్యూనిస్టులకు మింగుడు పడడంలేదు. 

పాలేరులో పోటీ చేసేది మేమే...

ఖమ్మం జిల్లాలోని పాలేరు సీటును వదులుకునేది లేదని, తాము ఇక్కడ పోటీ చేసేది ఖాయమని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో తనకు బీఆర్ఎస్ నుంచి పాలేరు సీటు ఖాయమని ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి ప్రచారం ప్రారంభించారు. మరోవైపు పాలేరు నుంచి తాను ఈసారి తప్పకుండా పోటీ చేస్తానని బీఆర్ఎస్ ​సీనియర్ ​నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీమాగా చెబుతున్నారు. పాలేరు సంగతి ఇలా ఉంటే భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం నియోజకవర్గంపై కూడా రాజకీయం వేడెక్కింది. సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తులపై ఒక అవగాహన కుదిరిందని ఆ పార్టీ నేతలు అన్నారు. కొత్తగూడెం సీటుపైనే అలయెన్స్ ఉంటుందనడంతో బీఆర్ఎస్​ఆశావహుల్లో గుబులు పుట్టించాయి. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇటీవలి కాలంలో తరుచూ పేర్కొంటున్నారు. 

కొత్తగూడెంపై గడల, కూనంనేని ప్లాన్స్...

కొత్తగూడెం సీటు తనదేనని , తనకు సీఎం కేసీఆర్​తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ఆశీస్సులున్నాయని స్టేట్​ హెల్త్​ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు పేర్కొంటున్నారు. డాక్టర్​ జీఎస్సార్ ​ట్రస్ట్ ​పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనహిత ఆఫీస్​ల పేర రాజకీయ కార్యక్రమాలను స్పీడప్ ​చేస్తున్నారు. రాష్ట్రంలోని కొత్తగూడెం, హుస్నాబాద్, దేవరకొండ, మునుగోడు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూనంనేని చెబుతున్నారు. కాంగ్రెస్​తో పొత్తు ఉంటుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన చెప్పడం ఊహాగానాలకు తావిస్తోంది. బీఆర్ఎస్​తో సీట్ల సర్దుబాటు జరగకపోతే కాంగ్రెస్ తో జత కడతామని ఆయన చెప్పకనే చెప్పారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

పావులు కదుపుతున్న సీపీఐ.. 

కొత్తగూడెం సీటుపై కన్నేసిన సీపీఐ ఆ దిశగా పావులు కదుపుతోంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వచ్చే నెల 4న కొత్తగూడెంలో దాదాపు 50 వేల నుంచి లక్ష మందితో ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని జన సమీకరణకు మండలాలు, కొత్తగూడెం మున్సిపాలిటీలోని వార్డుల వారీగా ఆ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా సత్తా చాటాలని సీపీఐ ప్లాన్​చేస్తోంది.