నిమ్మకాయలు మస్తు పిరం..రెండు వారాల్లో ధర రెట్టింపు

నిమ్మకాయలు మస్తు పిరం..రెండు వారాల్లో ధర రెట్టింపు

ఖమ్మం, వెలుగు: నిమ్మకాయలు మస్తు పిరమైనయి. యాపిల్స్ కంటే ఎక్కువ ధర పలుకుతున్నయి. యాపిల్స్ కిలో రూ.150 ఉంటే, నిమ్మకాయలు కిలో రూ.200 ఉన్నాయి. చిన్న సైజు కాయలనే ఒక్కోటి రూ.10కి అమ్ముతున్నారు. మార్చి మొదట్లో కిలో నిమ్మకాయలు రూ.50 ఉండగా, ఆ తర్వాత రూ.100 అయ్యాయి. గడిచిన రెండు వారాల్లోనే ధర రెట్టింపైంది. ప్రస్తుతం హోల్ సేల్ లో కిలో రూ.160 నుంచి రూ.170 ఉండగా, రిటైల్ లో రూ.200 పైనే పలుకుతోంది. నిమ్మకాయల వ్యాపారానికి ప్రధాన కేంద్రమైన నకిరేకల్ మార్కెట్ లో నెల క్రితం రూ.4 వేలు ఉన్న 50 కిలోల బస్తా రేటు.. ఇప్పుడు రూ.8వేలకు పైనే పలుకుతోంది. నిమ్మకాయల రేట్లు పెరగడంతో సోడా, లెమన్ టీ రేట్లు కూడా పెరిగాయి.  

10 వేల ఎకరాల్లో పంట నష్టం..  

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో నిమ్మ తోటలు ఉండగా, వీటిలో 80 శాతం వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. పోయినేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు భారీ వానలు కురవడం, తెగుళ్లు సోకడం, అధిక తేమతో పూత, కాయ రాకపోవడంతో ఈసారి దిగుబడి పడిపోయిందని రైతులు చెబుతున్నారు. తుఫాన్ల కారణంగా ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనూ పంట దెబ్బతిన్నదని.. మన రాష్ట్రంలో దాదాపు 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంటున్నారు. దీంతో డిమాండ్ విపరీతంగా పెరిగిందని పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.  

చిరువ్యాపారులపై ప్రభావం..  

రాష్ట్రంలో పంట దిగుబడి తగ్గడంతో పొరుగు రాష్ట్రాల నుంచి నిమ్మకాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ఏపీలోని కర్నూలు తదితర జిల్లాల నుంచి కాయ వస్తోందని.. దీంతో ట్రాన్స్ పోర్టు చార్జీలు పెరిగి, ఏమీ మిగలడం లేదని హోల్ సేల్ వ్యాపారులు అంటున్నారు. ఇక పెరిగిన రేటు ప్రభావం చిరు వ్యాపారులపై బాగా కనిపిస్తోంది. తోపుడు బండ్ల మీద నిమ్మకాయలు అమ్మేవారు, నిమ్మకాయ సోడాలు అమ్ముకునేటోళ్లు ఈ రేటుతో తమకు గిట్టుబాటు అయితలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.20కి అమ్మాల్సిన నిమ్మ సోడాను ఇప్పుడు రూ.25కు పెంచేశారు.  

సోషల్ మీడియాలో మీమ్స్... 

మన కంటే రాజస్తాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో రేటు ఎక్కువ ఉంది. అక్కడ కిలో రూ.400 పలుకుతోంది. దీంతో నిమ్మ రేట్లపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ తో నిమ్మకాయల రేటు పోటీ పడుతోందని, డీజిల్ సెంచరీని దాటితే నిమ్మకాయలు క్వాడ్రాఫుల్ సెంచరీ (400)ని దాటుతున్నాయని మీమ్స్ పెడుతున్నారు.

దిగుబడి పడిపోయింది.. 

పూత టైమ్​లో వానలు పడడం, తెగుళ్ల కారణంగా ఈసారి దిగుబడి బాగా పడిపోయింది. పోయినేడాది వరకు రేటు లేకపోవడంతో చాలా మంది రైతులు తోటలను తీసేయడం కూడా పంట తగ్గడానికి కారణం. పోయినసారి 50 కిలోల బస్తాకు రూ.2 వేలు ఉంటే, ఈసారి రూ.7 వేల వరకు ఉంది.  
- ప్రతాపనేని వెంకటేశ్వరరావు, రైతు, కామంచికల్, ఖమ్మం జిల్లా 

గిట్టుబాటు అయితలే.. 

ప్రస్తుతం ఏపీ నుంచి నిమ్మకాయలు వస్తున్నాయి. మాకే కిలో రూ.160 నుంచి రూ.170 వరకు పడుతోంది. హమాలీ, ఆటో ఖర్చులు కలుపుకొని రూ.200 అమ్మితే తప్ప గిట్టుబాటు కావడం లేదు.   
-మంగమ్మ, వ్యాపారి, ఖమ్మం

రూ.190 పెట్టి కొన్న.. 

మా ఇంట్లో రెగ్యులర్​ గా నిమ్మకాయలు వాడుతం. వేడి నీళ్లలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతం. రెండు వారాలకోసారి కిలో చొప్పున తెస్త. ఇంతకుముందు కిల రూ.40, 50 దాకనే ఉండే. పోయిన నెల రూ.100 అయింది. ఈ నెల డబుల్ అయింది. ఈసారి రూ.190 పెట్టి కొనుక్కొచ్చిన.  - కె.వినయ్, కొత్తగూడెం