
తమిళనాట నీటి కటకటపై హాలీవుడ్ హీరో లినార్డో డికాప్రియో
తమిళనాడులో గతంలో ఎన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడింది. డ్యామ్‌లు, చెరువులు ఎండిపోయి చుక్క నీరు దొరక్క ప్రజలు తల్లడిల్లుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. రైళ్ల ద్వారా చెన్నైకు తాగునీటిని తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి రూ.65 కోట్లు కేటాయించారు. కొందరు ట్యాంకర్ల ద్వారా చెన్నై నగర ప్రజలకు సాయం చేస్తున్నారు. చెన్నై నీటి కటకటపై ప్రముఖ హాలీవుడ్ హీరో, పర్యావరణ వేత్త లియోనార్డో డికాప్రియో కూడా స్పందించారు. ఎక్కడో అడుగున నీళ్లున్న బావి నుంచి నీరు తోడుకునేందుకు ప్రజలు పడుతున్న అవస్థలను కళ్లకు కట్టే ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. చెన్నై నీటి కష్టాలపై బీబీసీ రాసిన కథనాన్ని కూడా రీ షేర్ చేశారు.
ఎండిన డ్యామ్‌లు, మూతబడుతున్న హోటళ్లు
‘ఈ నీటి సమస్య నుంచి చెన్నైని వర్షాలే కాపాడాలి. నగరంలోని నాలుగు ప్రధాన డ్యామ్‌లు పూర్తిగా ఎండిపోవడంతో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీటి కోసం గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నీళ్లు లేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడుతున్నాయి. మెట్రోలో ఏసీల వినియోగం ఆపేశారు. నీటి కోసం ప్రభుత్వాధికారులు చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రజలు మాత్రం వర్షాలు కురవాలని దేవుణ్ని వేడుకుంటున్నారు’ అని డికాప్రియో తన పోస్టులో పేర్కొన్నారు. ఇండియాలోని పరిస్థితులపై డికాప్రియో స్పందించడం ఇదేం మొదటిసారి కాదు. ఢిల్లీలోని ఘాజీపూర్ డంపింగ్ యార్డ్ గురించి కూడా రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అక్కడి యార్డులోని చెత్త 65 మీటర్ల ఎత్తుకు పేరుకుపోయిందన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ పోస్టును షేర్ చేశారు.