వామ్మో.. చిరుత పులొచ్చింది.. శ్రీశైలం పరిసరాల్లో టెన్షన్ టెన్షన్

వామ్మో.. చిరుత పులొచ్చింది.. శ్రీశైలం పరిసరాల్లో టెన్షన్ టెన్షన్

శ్రీశైలంలో మరోసారి చిరుత పులి సంచారం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళ ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం ( డిసెంబర్​ 30)  రాత్రి రత్నానందస్వామి ఆశ్రమం వద్ద ఉన్న హోమగుండం దగ్గర గోడపై చిరుత పులి కూర్చుని ఉండటం అక్కడ ఉన్న భక్తులు, స్థానికులు చూశారు. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ చిరుత పులిని చూసిన స్థానికులు, భక్తులు తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు. రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఓ ఆవును చిరుత పులి చంపేయడంతో స్థానికులు వణికిపోతున్నారు.

చిరుతపులి సంచారంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయంలో మునిగిపోయారు. ఇక రత్నానంద ఆశ్రమం వద్ద గోడపై కూర్చుని ఉన్న చిరుత పులి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో చాలా మంది శ్రీశైలం దేవస్థానానికి తరలివస్తున్నారు. దీంతో వారిలో మరో కొత్త భయం నెలకొంది. అయితే శ్రీశైలంలో రోజురోజుకూ చిరుత పులుల సంచారం పెరుగుతూనే ఉండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తరచూ చిరుతలు కనిపిస్తుండటంతో శ్రీశైలం దేవస్థానానికి వస్తున్న భక్తులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయితే తాము ఎన్నిసార్లు కంప్లెయింట్‌లు ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత సంచారానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. చిరుత పాదముద్రలను సేకరించి.. ఆవుని చంపి తిన్నది చిరుత పులి అని నిర్ధారించుకున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. చిరుత అడుగుల ఆధారంగా అది ఎటువైపుకు వెళ్లిందనే దానిపై అటవీ శాఖ అధికారులు గాలింపు చేపడుతున్నారు. మరోవైపు చిరుతను బంధించాలంటూ అధికారులను స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. చిరుత సంచారంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.

3 నెలల క్రితం ఔటర్ రింగ్ రోడ్డులోని రుద్రాపార్కు సమీపంలో గోడపై కూర్చుని చిరుతపులి కనిపించింది. మళ్లీ ఇప్పుడు కనిపించడం తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు, భక్తుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిరుత సంచారం గురించి ఫారెస్ట్​ అధికారులకు సమాచారం ఇచ్చినా... పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.