
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులోనూ ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చిన తరువాతనే విచారణ జరుపుతామని చెప్పింది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పు రాకుండా తాము ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించింది. జూన్ 26న ఈడీ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సోలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ జూన్ 26కు వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ జైల్లోనే ఉండనున్నారు.
లిక్కర్ స్కాంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిపై ఈడీ అభ్యంతరం చెప్తూ హైకోర్టును ఆశ్రయించగా.. రౌస్ అవెన్యూ కోర్టు ఆర్డర్స్ పై హైకోర్టు స్టే విధించింది. దీంతో సుప్రీం కోర్టు తలుపుతట్టారు కేజ్రీవాల్. ఇవాళ పిటిషన్ ను విచారించిన సుప్రీం హైకోర్టు తీర్పువచ్చే వరకు వేచి చూడాలని చెప్పింది.
లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇటీవల లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మద్యంతర బెయిల్ పై బయటకు వచ్చాడు. తర్వాత జూన్ 2న కోర్టులో లొంగిపోయాడు.