సింకుతో ట్విట్టర్ ఆఫీస్‌లోకి మస్క్ ఎంట్రీ.. ఎందుకంటే !

సింకుతో ట్విట్టర్ ఆఫీస్‌లోకి మస్క్ ఎంట్రీ.. ఎందుకంటే !

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రేపు ముగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని ఎలాన్ సందర్శించారు. ఈ క్రమంలోనే ఓ సింకు పాత్రను తీసుకువస్తూ లోపలికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఎలాన్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. దాంతో పాటు తాను ట్విట్టర్ హెడ్ క్వార్టర్ లోకి ప్రవేశిస్తున్నానని.. ఈ సింక్ ను లోపలికి వెళ్లనివ్వండి అనే క్యాప్షన్ ను జత చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఆయన ట్విట్టర్ ఒప్పందం పూర్తవుతుందనే ప్రచారం సాగుతోంది.

టెస్లా అధినేతగా ఉన్న మస్క్ ట్విట్టర్ ను 44 బిలియన్‌ డాలర్ల (రూ.3.6 లక్షల కోట్ల)తో కొనుగోలు చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. దీంట్లో 13 బిలియన్‌ డాలర్లు బ్యాంకుల నుంచి సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే దానికి సంబంధించి కావల్సిన నిధుల సమీకరణ ప్రక్రియను మస్క్ వేగవంతం చేశారు. ఇప్పటికే బ్యాంకర్లతో చర్చలు జరిపిన మస్క్.. ఈ నేపథ్యంలోనే ట్విటర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ట్విటర్‌ కొనుగోలు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఇటీవలే ఆదేశించింది. అందుకు అక్టోబర్‌ 28ని తుది గడువుగా విధించింది. లేదంటే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు విధించిన గడువు ముగిసేలోగా కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసే యోచనలో మస్క్‌ ఉన్నట్లు తెలుస్తోంది.