చాకిరి చేసే కులాలు, ఓట్లేసే యంత్రాల్లా చూస్తున్నారు

చాకిరి చేసే కులాలు, ఓట్లేసే యంత్రాల్లా చూస్తున్నారు
  • ఇయ్యాల మారోజు వీరన్న వర్థంతి

పూలే, అంబేడ్కర్, సాహుమహారాజ్, పెరియార్ ల వారసుడుగా నిలబడి కలబడిన కామ్రేడ్ మారోజు వీరన్న తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి పీడిత ప్రజలకు అండగా నిలిచాడు. ఆచరణాత్మక ఉద్యమాలు చేసిన అతని మాటలు తూటాలుగా, సిద్ధాంతం విప్లవాత్మక మార్పు దిశగా, ఆచరణ పీడిత ప్రజల విముక్తికి దోహదం చేసేదిగా ఉండేది. చూడ్డానికి కళ్లుండాలని, లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలని, ఆచరించే దమ్ముండాలని, అన్నింటికీ మించి ప్రజల పట్ల ప్రేముండాలని బోధించి ఆచరించిన వాడు వీరన్న. ఆనాటి వీరన్న మాటలను, తన ఆచరణాత్మక ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే నేటి దోపిడీ పాలనలో ఉద్యమకారులుగా, ప్రగతిశీల శక్తులుగా, మేధావులుగా, విద్యావంతులుగా, బుద్ధిజీవులుగా, బాధ్యత గల ప్రజలుగా ఎలాంటి ఉద్యమాలు చేయాలో తెలుస్తుంది. 

ఉద్యమాల్లో ముందు ఉండి..
దేశంలోని పాలక పార్టీలు అణగారిన ప్రజలను చాకిరి చేసే కులాలుగా, ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వీరన్న సిద్ధాంతం, ఉద్యమాలు మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం చేపట్టడానికి ఎంతో మేలు చేస్తాయి. వీరన్న ఒక విద్యార్థి నాయకుడిగా, గాయకుడిగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించి ప్రగతిశీల విద్యార్థి విభాగాన్ని నిలబెట్టాడు.

క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాలకు ట్యూషన్ ఫీజు గురించి ఉద్యమించి పాలకుల పీఠాలను కదిలించాడు. దేశంలో సగానికిపైగా జనాభా గల బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని మండల్ కమిషన్ నివేదికను అమలుపరుస్తామని ఆనాటి వీపీ సింగ్ ప్రభుత్వం ప్రకంటించగానే అందుకు వ్యతిరేకంగా ఆధిపత్య కులాలు పార్టీలకు అతీతంగా తప్పుడు ఉద్యమాలు చేశాయి. మండల్ అనుకూల ఉద్యమంలో అందరికంటే వీరన్న ముందు నిలిచారు. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులపై జల సాధన ఉద్యమాన్ని ముందుకు తెచ్చాడు.
తెలంగాణ మహాసభ..
తెలంగాణ ఎంతో మంది త్యాగధనులకు జన్మనిచ్చింది. వారిలో మారోజు వీరన్నది ఒక ప్రత్యేక స్థానం. తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం, కరివిరాల కొత్తగూడెంలో మారోజు రామలింగం, సూరమ్మల కులాంతర వివాహ పంట తానై 1960 జనవరి1న జన్మించారు. వీరన్న సర్దార్ సర్వాయి పాపన్న, వీర బ్రహ్మంల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగించి సీమాంధ్ర అగ్రకుల పెత్తనంలో నలిగిపోతున్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమ కెరటాన్ని ఎగురవేశాడు.

1997లో సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ మహాసభను స్థాపించారు. పీడిత జన సామాజిక విప్లవకారుడు, మలిదశ తెలంగాణ పోరాట ఆద్యుడు, కుల వర్గ జమిలి పోరాటాల నిర్మాత, ఎర్ర పోరాటానికి నీలి మెరుపులు అద్దిన వీరన్న అస్తిత్వ పోరాటాలకు దిక్సూచిగా నిలిచాడు. శ్రామిక వర్గ దృక్పథం లేని కుల పోరాటాలు, కుల నిర్మూలన లక్ష్యం లేని వర్గ పోరాటాలు విముక్తి సాధించలేవని 25 ఏండ్ల క్రితమే వీరన్న సూత్రీకరించాడు. 
ఉద్యమకారుల భాగస్వామ్యం..
ఏక కాలంలో రెండు లక్ష్యాలను సాధించాలన్నది వీరన్న వ్యూహం. తెలంగాణలో వలసాధిపత్య అగ్రకుల దోపిడీ పాలన పోవాలని అదే సమయంలో తెలంగాణలో అగ్రకుల భూస్వామ్య పాలన పోయి బహుజన రాజ్యం స్థాపించాలని1996లో తెలంగాణ మహాసభ స్థాపించడమే కాకుండా అనుకున్న లక్ష్యం సాధించడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగాడు.

తెలంగాణ మహాసభ ప్రారంభం, అందులో మహా మహా మేధావులను పాల్గొనేటట్లు చేయడంలో వీరన్న కృషి గొప్పది. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వి.ప్రకాష్, డాక్టర్ చెరుకు సుధకార్, ఉ.సాంబశివరావు లాంటి వాళ్లను1996 లోనే ఉద్యమంలో భాగస్వాములను చేశాడు వీరన్న. ఐడెంటిటీ అండ్ అలియన్స్ అనే సిద్ధాంతంతో ఏ కులానికి ఆ కులాన్ని ఐడెంటిఫై చేసుకొని అంతిమంగా అణగారిన కులాలన్నీ ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగిన వీరన్నను లక్ష్యం చేరకముందే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టుకొని కాల్చి చంపింది.
బహుజన రాజ్యం దిశగా..
నేడు దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు వీరన్న ఆదర్శం కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వీరన్న మార్గంలో పయనించడమంటే సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు నేటి ప్రధాన అంశంగా, అంతిమంగా తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన లక్ష్యంగా ఉద్యమ శక్తులు ముందుకు సాగాలి. కామ్రేడ్ మారోజు వీరన్నకు అదే నిజమైన నివాళి.
నిరంకుశ పాలన..
వీరన్న పోరాటం, ఉద్యమంతో రాష్ట్రం విడిపోవడమే కాకుండా అధికారం చేజారిపోతుందని గమనించిన అగ్రకుల ఆంధ్ర వలస పాలకులు మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత  ముందుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో బహుజన రాజ్య స్థాపన వెనక్కి వెళ్లి నేటి దొర పాలనకు అవకాశమొచ్చింది. నిరంకుశానికి మారుపేరుగా పాలన కొనసాగిస్తున్న దొర బహుజన నేతలే టార్గెట్ గా ముందుకు సాగుతున్నాడు.

ఆనాటి ఆలే నరేంద్ర నుంచి నేటి ఈటల రాజేందర్ వరకు ఆయన నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన ఎందరినో అణచి వేస్తూ దోపిడీ పాలన కొనసాగుస్తున్నాడు. వీరన్న బాటలో నడిచి సూర్యాపేటలో తెలంగాణ మహాసభకు అధ్యక్షత వహించిన డాక్టర్ చెరుకు సుధాకర్ ను, టీఆర్ఎస్​కు చిల్లి గవ్వ లేనప్పుడు అన్ని విధాల సహకరించిన గాదె ఇన్నయ్యను, తెలంగాణ భవన్ కు ఆశ్రయమిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లను ఎందరినో మోసం చేసిన కేసీఆర్ నేడు సీమాంధ్ర కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి ప్రాజెక్టుల పేరుతో నిధులన్నింటిని సీమాంధ్ర పెట్టుబడిదారులకు దోచి పెడుతున్నాడు.  -సాయిని నరేందర్,సోషల్ ఎనలిస్ట్.