చేనేత పరిశ్రమను కాపాడుకుందాం!

చేనేత పరిశ్రమను కాపాడుకుందాం!

చేనేత పరిశ్రమ అనేది సాంస్కృతిక వారసత్వానికి, శతాబ్దాల నాటి సంప్రదాయ నేత పద్ధతులకు ప్రతీక. చేనేత వస్త్రాలు కేవలం బట్టలు మాత్రమే కాకుండా ప్రతి ప్రాంతం చరిత్ర, సంస్కృతి, కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. ఈ పరిశ్రమ భారత దేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాలలో  వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధిని కల్పించే పరిశ్రమ. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 కోట్ల మందికి పైగా  ఈ రంగంపై  ఆధారపడి జీవిస్తున్నారు. 

రాష్ట్రంలో అనేక రకాలైన  చేనేత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వాటికి ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉంది.   పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల చేనేత  ఉత్పత్తులకు  ప్రధాన నగరాలుగా చెప్పవచ్చు. పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి. ఇక్కత్ అంటే మగ్గం మీద  నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడం, ఇక్కడి చీరలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఇతర చీరలకంటే భిన్నమైనది అందుకే భారతదేశంలో పోచంపల్లి చీరకు మొట్టమొదట పేటెంట్ రైట్ లభించింది. 

తెలంగాణ చేనేతకు ప్రశంసలు

సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల పరంధాములు, నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను వివిధ రంగులతో తయారు చేశారు.  రెండు రోజుల క్రితం నల్ల విజయ్ కుమార్ జాతీయ చేనేత దినోత్సవం 2025ను పురస్కరించుకొని రెండు గ్రాముల బంగారం, జరీ పోగులను ఉపయోగించి 2 మీటర్ల పొడవు 38 ఇంచుల వెడల్పుతో అగ్గిపెట్టెలో పట్టే శాలువాను తయారుచేసి ఆపరేషన్ సిందూర్ నామకరణంతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి  బహుమతిగా పంపించి భారతీయ చేనేత కళ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పాడు.  

పోచంపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు 24 ఆకులతో అశోకచక్రంతో సహా జాతీయ పతాకమంతా ఎలాంటి కుట్టు లేకుండా మగ్గంపై తయారుచేసి చేనేత రంగం గొప్పతనాన్ని తెలియజేశాడు.తెలంగాణ చేనేత వస్త్రాలు  అందంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఇటీవల హైదరాబాదులో జరిగిన ‘మిస్ వరల్డ్2025’  పోటీలకు డిజైనర్​గా పనిచేసిన ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల డిజైనర్ అర్చన కొచ్చర్ తెలంగాణ చేనేత వస్త్ర  గొప్పతనాన్ని ప్రశంసించారు.  

ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి 14 వరకు ఇటలీలో జరగబోయే  అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన ‘మిలాన్ ఫెస్టివల్’లో పాల్గొనేందుకు తెలంగాణ చేనేత కళాకారుడు  జి. విజయ్ రాజేంద్రవర్మను కేంద్రప్రభుత్వ టెక్స్​టైల్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది . ఈ అవకాశం తెలంగాణకు దక్కడం ఇదే తొలిసారి. 

చేనేత దినోత్సవంగా..

1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాలులో మొట్టమొదట స్వదేశీ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, స్వదేశీ వస్త్రాలని వాడాలని స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు పిలుపునిచ్చారు. అప్పటి స్వాతంత్ర్య ఉద్యమంలో స్వదేశీ వస్త్రాల అవసరాన్ని ఆగస్టు ఏడవ తేదీ ప్రాముఖ్యతను గుర్తించాలని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో అనేక ప్రచారాలు, ఉద్యమాలు జరిగాయి. 

చివరకు2015 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ  భారతీయ చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటు ఆగస్టు  7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా  పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. 
ఈ సందర్భంగా చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన చేనేత కార్మికులకు ‘సంతు కబీర్’ పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుంది.  

తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యం లో  జాతీయ చేనేత దినోత్సవం జరపబడుతుంది.10 రోజులపాటు జాతీయ చేనేత ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున 'శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ' పురస్కారాలు అందజేయడం  జరుగుతుంది. 

కేంద్ర పథకాలు

చేనేత రంగం అభివృద్ధికి భారత ప్రభుత్వం.. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ, సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం ద్వారా చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం, నూలు సరఫరా పథకం ప్రవేశ పెట్టారు.  చేనేత కార్మికుల సంక్షేమం కొరకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, మహాత్మా గాంధీ బునకర్ భీమా యోజన  ద్వారా బీమా సహాయాన్ని అందిస్తుంది.  ఈ పథకాలపై నేత కార్మికులు అవగాహన చేసుకొని లబ్ది పొందాలి.

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత

తెలంగాణ రాష్ట్రంలో కూడా చేనేత పరిశ్రమలను,  కార్మికులను ఆదుకోవడానికి నేతన్న బీమా పథకం, చేనేత మిత్ర , పావలా వడ్డీ, నేతన్నకు చేయూత మొదలగు పథకాల ద్వారా ముడి పదార్థాల సరఫరా, మగ్గాలు ఉపకరణాల కొనుగోలు, డిజైన్ ఆవిష్కరణ, నైపుణ్యాల అభివృద్ధి మొదలగు వాటికోసం ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రజా ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లకు అవసరమైన వస్త్రాలను, స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేసే దసరా చీరల తయారీ బాధ్యతలను చేనేత కార్మికులకు ఇవ్వడం శుభసూచకం. అయినా చేనేత వెతలు మాత్రం తీరడంలేదు.

వీడని ఆత్మహత్యలు

చేనేత పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఇప్పటికీ చేనేత  రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. తిరోగమనంలో పయనిస్తోంది. అటకెక్కుతున్న  మగ్గాలే దీనికి నిదర్శనం. ఇటీవల కాలంలో సిరిసిల్ల పట్టణంలో  చేనేత పనులు సరైన స్థాయిలో ఉపాధిని కల్పించలేకపోవడం వలన, చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో వలస రమేష్ (48) అనే నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అదే పట్టణంలో బి.వై.నగర్ కు చెందిన  రాకేష్ చాలా రోజులుగా పనులు లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక కుటుంబ భారం అధికమై ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా అనేక ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముడి సరుకుల ధరలు పెరగడం మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు  అందుబాటులో లేకపోవడం, బట్టల మిల్లులు, ఫ్యాక్టరీలు, మరమగ్గాల (పవర్ లూమ్) పరిశ్రమ నుండి పోటీని ఎదుర్కోవడం, సంవత్సర కాలం పాటు పని లభించకపోవడం, నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఆధునికీకరణకు నిధుల కొరత మొదలగు సమస్యలను ఎదుర్కొంటోంది.  

చేనేతను వాడుదాం..కాపాడుదాం

ఆధునిక కాలంలో అనేక ఆటుపోట్లకు గురవుతున్న  చేనేత పరిశ్రమ మనుగడకు కేంద్ర, రాష్ట్రాలు పలు చర్యలు చేపట్టాలి. పేక నూలుతో కండెల్ చుట్టడానికి  అవసరమైన రాట్నాల స్థానంలో మోటారు రాట్నాలను అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా నేత కార్మికులకు పని సులభం అవుతుంది.  

కాటన్, సిల్క్,  ఊలు  దారాలను పెద్ద ఎత్తున చేనేత పరిశ్రమకు అందేలా చేయాలి.  అంతర్జాతీయంగా చేనేత వస్త్రాలకు డిమాండ్​ను కల్పించాలి. అంతేకాకుండా మార్కెట్లో కొనుగోలు చేసే దుప్పట్లు, చీరలు, తలపాగాలు మొదలగు  వస్త్రాలలో చేనేత తయారీ వస్త్రాలను ధరించగలిగితే మన సాంస్కృతిక సాంప్రదాయ వారసత్వాన్ని కాపాడగలిగిన వారమవుతాం. దానితోపాటు చేనేత రంగం మీద  ఆధారపడ్డ లక్షలాదిమంది కుటుంబాలకు ఆర్థికంగా  చేయూతనందించిన వారమవుతాం.     


 
–డాక్టర్​ దాసరి సత్యనారాయణ, అసిస్టెంట్​ ప్రొఫెసర్​, కాకతీయ యూనివర్శిటి –