
న్యూఢిల్లీ: లావోస్ లో సైబర్ నేరస్తుల ఉచ్చులో చిక్కుకున్న 13 మంది భారతీయులను రక్షించినట్టు ఇండియన్ ఎంబసీ తెలిపింది. వారిని సురక్షితంగా ఇండియాకు పంపించామని పేర్కొంది. ఇప్పటి వరకు 518 మంది ఇండియన్లను కాపాడమని వెల్లడించింది. ఈ ఆపరేషన్‌కు సహకరించిన లావో అధికారులకు కృతజ్ఞతలు చెప్పింది. ఈ మేరకు ఆదివారం లావోస్‌లోని ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటన జారీ చేసింది.
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఇండియన్లను మోసం చేస్తున్నారని మే 7న ఇండియన్ ఎంబసీ ఓ అడ్వైజరీ నోట్ జారీ చేసింది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, డిజిటల్ సేల్స్, కస్టమర్ సపోర్ట్ సర్వీస్ వంటి ఉద్యోగాల ఆశ చూపిస్తున్నారని ఆ నోట్లో వివరించింది. ఈ సంస్థల తరఫున ఏజెంట్స్ ఇండియా, దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ వంటి దేశాల్లో రిక్రూట్ చేసుకుంటున్నారని హెచ్చరించింది. బాధితులను చట్ట విరుద్ధంగా లావోస్‌లోకి తీసుకెళ్తున్నారని తెలిపింది. లావోస్ లో చట్ట విరుద్ధ కార్యకలపాలు చేయించుకుంటున్నారని స్పష్టం చేసింది.