
- నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ములుగు/ ఏటూరునాగారం/ తాడ్వాయి/ మంగపేట, వెలుగు: గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలని, నిరుద్యోగ, యువతీ యువకులు ఎంతగానో దోహద పడతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, మంగపేట మండలాల్లో మంత్రి పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రంలో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీతో కలిసి ప్రారంభించారు.
నూతనంగా మార్చిన ములుగు డీసీసీబీ, ఏటూరునాగారంలో నూతనంగా నిర్మించిన డీసీసీబీ భవనాన్ని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రతో కలిసి ప్రారంభించారు. ఏటూరునాగారం గిరిజన భవన్లో, కన్నాయిగూడెం మండల కేంద్రంలో, తాడ్వాయి మండల ఆర్టీసీ కాంప్లెక్స్ భవనంలో, మంగపేట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మంగపేటలో రూ.12.84 లక్షల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం సహకార వ్యవసాయ సంఘంలో నిర్మించిన గోడౌన్, రాజుపేట సహకారం సంఘంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలతో పనులు చేపడుతున్నామని చెప్పారు. గట్టమ్మ ఆలయం వద్ద జంక్షన్ ఏర్పాటు చేసి పర్యాటకులకు తెలిసే విధంగా పొందుపరుస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెప్పారు.
తహసీల్దార్‌పై సీరియస్..
ఏటూరునాగారంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులు రాకపోవడంతో ఎందుకు పూర్తి స్థాయిలో లబ్ధిదారులను పిలవలేదని, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలికదా అంటూ మంత్రి సీతక్క తహసీల్దార్ జగదీశ్వర్‌పై అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.