రాకెట్లతో మంటలంటుకొని 4 వేల పుస్తకాల దగ్ధం

రాకెట్లతో మంటలంటుకొని 4 వేల పుస్తకాల దగ్ధం

దీపావళి క్రాకర్స్ వల్ల ఓ లైబ్రరీ కాలిపోయింది. ఈ ఘటనలో రూ. 3 లక్షల విలువైన పుస్తకాలు కాలిపోయాయి. ఈ ఘటన షాద్‎నగర్‎లో వెలుగుచూసింది. లైబ్రరీ సమీపంలో కాల్చిన రాకెట్లు కిటికీ నుంచి లైబ్రరీలోకి వెళ్లడంతో మంటలంటుకున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‎నగర్ పట్టణంలోని గ్రేడ్ 1 శాఖ గ్రంధాలయం స్థానంలో నూతన గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. లైబ్రరీని ఓల్డ్ గంజ్‎లో ఓ తాత్కాలిక భవనంలో ఏర్పాటుచేశారు. భవనంలో స్థలం సరిపోకపోవడంతో చాలా పుస్తకాలను ఓ గదిలో పెట్టారు. వాటికి కిటికీలు లేకపోవడంతో తారాజువ్వలు ఎగిసి కిటికీ నుంచి లోపల ఉన్న పుస్తకాల మీద పడ్డాయి. దాంతో మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. స్థానిక ప్రజలు గమనించి వెంటనే షాద్‎నగర్ ఫైర్ స్టేషన్‎కు సమాచారం అందజేశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గదిలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ అప్పటికే చాలా పుస్తకాలు కాలి బూడిద అయ్యాయి. మంటలు ఆర్పే సమయంలో నీటిని చల్లడంతో చాలా పుస్తకాలు నీటిలో నాని పాడయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనతో దాదాపు 4వేల పుస్తకాలు కాలిపోయాయని.. వాటి విలువ సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.