
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (ఎల్ఓసీ).. కేవలం అమెరికా దేశానికే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞాన పరిశోధన సమాజానికి ఒక ప్రధాన వనరుగా, నిధిగా నిలుస్తోంది. ఇది సుమారు 178 మిలియన్లకు పైగా పత్రాలు, పుస్తకాలు, సినిమాలు, శబ్ద రికార్డింగ్‌లు, ఫొటోలు, పత్రికలు, పటాలను కలిగి ఉన్న గ్రంథాలయం. ఇది అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ.లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయంగా 470కు పైగా భాషల్లో ప్రసిద్ధి చెందిన ఈ గ్రంథాలయం 2025 అక్టోబరు మూసివేతకు గురైంది.
2025 అక్టోబరు నెల ప్రారంభంలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (ఎల్ఓసీ) తాత్కాలికంగా మూసివేయటం అనేది అమెరికా ప్రభుత్వం ఎదుర్కొన్న బడ్జెట్ సంక్షోభాన్ని తెలియజేస్తోంది. ఈ సంక్షోభం తీవ్రమైన నిధుల కోతలు, పరిపాలనాపరమైన రాజకీయ జోక్యం అనే ప్రధాన సమస్యల మిళిత రూపాన్ని ప్రతిబింబించింది. అయితే, ఈ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (ఎల్ఓసీ) మూసివేత ప్రస్తుత భౌతిక లేదా కార్యాచరణ వైఫల్యానికి సంకేతం కాదు. కేవలం నిధుల లేమి వల్ల సంభవించిన తాత్కాలిక విఘాతం మాత్రమే. ఇది ఎల్ఓసీ చరిత్రలో ఒక చీకటి రోజుగా పరిగణించడమైనది, ఇది గ్రంథాలయం భవిష్యత్తు స్థిరత్వంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
బడ్జెట్ ప్రతిష్టంభన ఫలితం.. తాత్కాలిక మూసివేత
నూతన ఆర్థిక సంవత్సరం (2026) నిధులు 2025 సెప్టెంబర్ 30తో ముగియగా, వాటిని సకాలంలో ఆమోదించడంలో అమెరికా కాంగ్రెస్ విఫలమైంది. దాంతో, అక్టోబర్ 1, 2025 నుంచి ఫెడరల్ ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయడమైంది. ప్రజా సేవల నిలుపుదల, సాధారణ పాఠకులు, పరిశోధకులు ఉపయోగించే అన్ని సేవలు నిలిచిపోయాయి. కేవలం కాంగ్రెస్ సభ్యులు, వారి సిబ్బంది మాత్రమే అత్యవసర పత్రాలు, సమాచారాన్ని కోరడానికి పరిమిత అవకాశాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఎల్ఓసీ ప్రాథమిక పాత్ర చట్టసభకు మద్దతు ఇవ్వడం. ప్రభుత్వ మూసివేత సమయంలో గ్రంథాలయ ఆన్లైన్ సేవల్లో కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. చట్టసభ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన కీలకమైన వెబ్సైట్ ‘కాంగ్రెస్.జీఓవి’, కాపీరైట్ నమోదుల కోసం ఉన్న ‘కాపీరైట్. జీఓవి’ మాత్రం నిరంతరంగా కొనసాగించడమైనది. ఈ పరిమితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను, సృజనాత్మక వర్గాన్ని ఇబ్బంది పెట్టాయి.
భారీగా బడ్జెట్ కోతలు
2023 ఆర్థిక సంవత్సరంలో లైబ్రరీ వార్షిక కార్యకలాపాల బడ్జెట్ సుమారు 875 మిలియన్ల డాలర్లుగా ఉన్నప్పటికీ భవిష్యత్ బడ్జెట్లపై అనిశ్చితి నెలకొంది. జూన్ 2025లో హౌస్ అప్రోప్రియేషన్స్ సబ్ కమిటీ 2026 కోసం ఎల్ఓసీ బడ్జెట్లో 84.5 మిలియన్ డాలర్ల కోతను ప్రతిపాదించింది. మొత్తం 767.6 మిలియన్ డాలర్ల బడ్జెట్మాత్రమే కేటాయించాలనే సూచనతో ఇది 2025 నిధుల కంటే గణనీయంగా చాలా తక్కువ. ముఖ్యంగా శాలరీస్ ఫండ్లో ఏకంగా 90.5 మిలియన్ డాలర్ల తగ్గింపు సూచించింది. 3,238 మంది సిబ్బంది ఉన్న ఎల్ఓసీలో ఈ కోతలు ఉద్యోగ భద్రత, సేవల నాణ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్), దృష్టిలోపం ఉన్న పాఠకుల కోసం నేషనల్ లైబ్రరీ సర్వీస్ (ఎన్ఎల్ఎస్) 24.5 మిలియన్ బ్రెయిల్, ఆడియో, పెద్ద అక్షరాల పుస్తకాలను పంపే ఎన్ఎల్ఎస్ కార్యక్రమం నిధుల స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. పరిపాలనాపరమైన అనిశ్చితి నెలకొంది. నిధుల సంక్షోభంతోపాటు, పరిపాలనా స్వతంత్రతపై రాజకీయ జోక్యం లైబ్రరీలో మరింత అనిశ్చితిని సృష్టించింది. మే 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైబ్రేరియన్ డా. కార్లా హెడెన్‌ను తొలగించి, న్యాయ విభాగ అధికారిని తాత్కాలిక లైబ్రేరియన్‌గా నియమించడం జరిగింది. లైబ్రేరియన్ ఆఫ్ కాంగ్రెస్ నియామకం జరగకపోవడం వలన, సంస్థాగత స్వతంత్రతపై పర్యవేక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ
చట్టసభకు ప్రధాన పరిశోధనా కేంద్రంఎల్ఓసీలోని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్). ఇది చట్టసభ సభ్యులకు బిల్లులను రూపొందించడానికి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంక్లిష్ట సమస్యలను అర్థం చేసుకోవడానికి, నిష్పాక్షికమైన, అధికారిక విశ్లేషణ, సమాచారాన్ని అందిస్తుంది. ఈ రకమైన ప్రత్యక్ష శాసన మద్దతు ప్రపంచంలోని ఇతర జాతీయ గ్రంథాలయాలలో చాలా అరుదు.
అయినప్పటికీ, ఇది దీర్ఘకాలికంగా నిధుల స్థిరత్వం, సంస్థాగత స్వతంత్రత వంటి అంశాలు గ్రంథాలయ భవిష్యత్తుకు కీలకమైన సవాళ్లుగా నిలుస్తున్నాయని స్పష్టం చేసింది. కాంగ్రెస్ దీర్ఘకాలిక బడ్జెట్ ఒప్పందాన్ని సాధించడంలో విఫలమైతే పరిశోధన, విద్య, సమాచార వనరుల పరిరక్షణకు సవాలుగా ఉంటుంది. స్థిరమైన మద్దతు లభిస్తేనే లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ప్రపంచ జ్ఞాన వారసత్వంలో తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగలదు.
170 మిలియన్లకు పైగా వస్తువులను 25.7 మిలియన్ వర్గీకృత పుస్తకాలు, 78.5 మిలియన్ మాన్యుస్క్రిప్టులు, 15.7 మిలియన్ ఫొటోలు, 8.2 మిలియన్ సంగీత పత్రాలు వంటివి 470కు పైగా భాషలలో కలిగి ఉన్న ఈ లైబ్రరీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు ముఖ్యమైన వనరుగా నిలుస్తుంది. 2025 అక్టోబరులో మూసివేత ఎల్ఓసీ చరిత్రలో ఒక తాత్కాలిక విఘాతం మాత్రమే.
డా. రవి కుమార్ చేగొని, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం