
హైదరాబాద్, వెలుగు : ప్రీమియం కట్టకపోవడం వలన ల్యాప్స్ అయిన (ఆగిపోయిన) పాలసీలను తిరిగి కొనసాగించేందుకు కస్టమర్ల కోసం ఎల్‌ఐసీ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కట్టకుండా ఆపేసిన మొదటి ప్రీమియం డేట్ నుంచి ఐదేళ్లలోపు ఉన్న పాలసీలను రివైవ్ చేసుకోవడానికి కంపెనీ వీలుకలిపిస్తోంది. ఇందుకోసం ఈ నెల17 నుంచి, ఈ ఏడాది అక్టోబర్ 21 మధ్య స్పెషల్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలు అయితే లేటు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. యులిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ) పాలసీలు మినహాయించి మిగిలిన ఇన్సూరెన్స్ పాలసీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
యులిప్ ప్లాన్స్‌తో ఇన్సూరెన్స్‌తో పాటు ఇన్వెస్ట్‌మెంట్ బెనిఫిట్స్ కూడా కస్టమర్లకు అందుతాయి. పాలసీకి సంబంధించి రూ. లక్ష వరకు ప్రీమియం కట్టాల్సి ఉంటే అటువంటి కస్టమర్లకు లేటు ఫీజులో 25 శాతం లేదా గరిష్టంగా రూ. 2,500 ను ఎల్‌ఐసీ రాయితీగా ఇస్తోంది. అదే రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల మధ్య ప్రీమియం కట్టాల్సి ఉంటే లేటు ఫీజులో 25 శాతం లేదా గరిష్టంగా రూ. 3 వేల వరకు , రూ. 3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటే 30 శాతం లేదా గరిష్టంగా రూ. 3,500 ను లేటు ఫీజులో రాయితీగా పొందొచ్చు.