మరో 4 రోజుల్లో తెరపైకి ఎల్ఐసీ ఐపీఓ

మరో 4 రోజుల్లో తెరపైకి ఎల్ఐసీ ఐపీఓ

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ  ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) మరో నాలుగు రోజుల్లో తెరపైకి వస్తోంది. ఇది  ఎంత మేరకు లాభాలు తెస్తుందనే విషయమై ఇన్వెస్టర్లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెజారిటీ ఎనలిస్టులు ఎల్​ఐసీకి ‘సబ్​స్క్రయిబ్​’ రేటింగ్​ ఇచ్చారు. బీమా సెక్టార్​ మార్కెట్​​ లీడర్​అయిన ఎల్​ఐసీ ఈ ఇష్యూ ద్వారా దాదాపు రూ.21 వేల కోట్లను సంపాదించనుంది. మనదేశ స్టాక్​ మార్కెట్​ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద ఐపీఓ! ఇష్యూ ద్వారా  ప్రభుత్వం ఈ కార్పొరేషన్​లో 3.5 శాతం వాటాను అమ్ముతోంది.

ఎల్ఐసీ ఐపీఓ మే 4–9 తేదీల మధ్య సబ్‌‌స్క్రిప్షన్​కు అందుబాటులో ఉంటుంది. మే 2న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ ఓపెన్​ అవుతుంది. ఐపీఓ ద్వారా రూ.20,557 కోట్ల విలువైన షేర్లను అమ్ముతారు.  మొత్తం 22.10 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్డింగ్​ ఉంటుంది. వీటిలో క్యూఐబీ పోర్షన్​కు 50 శాతం నాన్-ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్​ఐఐ) 35 శాతం,  మిగిలిన 15 శాతం షేర్లను రిటైల్ 
ఇన్వెస్టర్లకు (ఆర్​ఐఐ) కేటాయిస్తారు. పాలసీదారులకు 10 శాతం షేర్లను రిజర్వ్‌‌ చేస్తారు. వారి ఎల్ఐసీ పాలసీల  పాన్​కార్డ్​తో అప్‌‌డేట్ అయి, డీమాట్​ ఖాతా ఉంటేనే షేర్లకు బిడ్డింగ్​ వేయొచ్చు. ఈక్విటీ షేర్‌‌ ప్రైస్​ బ్యాండ్​ను రూ.902– రూ.949 మధ్య నిర్ణయించారు.  
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

ఐపీఓలో డబ్బు పెట్టేముందు ఇన్వెస్టర్లు ఈ కింది విషయాలను బాగా గుర్తుంచుకోవాలని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌లోని రీసెర్చ్ అనలిస్ట్‌‌లు కాజల్ గాంధీ, విశాల్ నార్నోలియా,  సమీర్ సావంత్  చెబుతున్నారు.

1. మనదేశంలో  జనాభా పెరుగుతూనే ఉంది. మరోవైపు ఎకానమీ బాగా  పుంజుకుంటోంది. లైఫ్​ ఇన్సూరెన్స్​ మార్కెట్లో ఇంకా అవకాశాలు ఉన్నాయి.  2021–-26 మధ్య జీవిత బీమా సంస్థల జీడబ్ల్యూపీ (గ్రాస్​ రిటెన్​ ప్రీమియం) ఏటా 14–-15  సీఏజీఆర్​తో పెరిగి  రూ.12.4 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
2. ఎన్నో బీమా ప్రొడక్టులు, భారీ పాలసీలతో ఎల్​ఐసీ మార్కెట్​ లీడర్​గా (61.60 శాతం) ఎదిగింది. బిజినెస్​ను మరింత పెంచడానికి సంస్థ ప్రయత్నిస్తోంది. ప్రొడక్ట్ మిక్స్​ను పెంచుతోంది. ఇందుకోసం నాన్​పార్టిసిపెంట్​ ప్రొడక్టుల సంఖ్యను విస్తరిస్తోంది.
3. 2021  డిసెంబర్ 31 నాటికి కొత్త ప్రీమియాలలో 96 శాతం వాటా సాధించింది.  ఓమ్నిచానెల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌‌వర్క్ ద్వారా భారతదేశం అంతటా బిజినెస్​ చేస్తోంది.
4. భారతదేశంలోని 91 శాతం జిల్లాలను కవర్ చేస్తూ 2,048 బ్రాంచ్​ ఆఫీసులు, 1,559 శాటిలైట్​ ఆఫీసులతో ప్రతి చోటా సేవలను అందిస్తోంది. 
5. ఎల్‌ఐసీ​ భారతదేశంలో అతిపెద్ద అసెట్ మేనేజర్. పనితీరు చాలా బాగుంది. ఫైనాన్షియల్​ పెర్ఫామెన్స్​కు ఢోకా లేదు. లాభదాయ సంస్థ కూడా!
ఎల్ఐసీ షేర్లు కొనాలి: ఆనంద్​ రాఠీ 
 ఆనంద్ రాఠీ షేర్స్ అండ్​ స్టాక్​ బ్రోకర్స్​​ ఈ  ఐపీఓకు ‘సబ్​స్క్రయిబ్​’ రేటింగ్​ ఇచ్చింది. ఈ విషయమై సంస్థ ఈక్విటీ రీసెర్చ్​ హెడ్​ నరేంద్ర సోలంకీ మాట్లాడుతూ 30 కోట్ల పాలసీలతో, 13 లక్షల ఏజెంట్లతో ఇది మార్కెట్​ లీడర్​గా ఎదిగిందని అన్నారు. ఇండియాలో బీమా బిజినెస్​కు అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మనదేశంలో చాలా మందికి ఇప్పటికీ జీవిత బీమా పాలసీలు లేవన్నారు. సంస్థ ఆదాయాలు, లాభాలు బాగున్నాయని పేర్కొన్నారు. ఎల్​ఐసీ లిస్టింగ్​ తరువాత షేర్​ హోల్డర్లకు ఆకర్షణీయమైన డివిడెండ్లు వస్తాయని అన్నారు.
ఎనలిస్టులు ఏమంటున్నారు ?
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌ ఎనలిస్టులు మాట్లాడుతూ, "బలమైన డిస్ట్రిబ్యూషన్​ నెట్‌‌వర్క్, రకరకాల బీమా ప్రొడక్టులతో భారతీయ జీవిత బీమా పరిశ్రమలో ఎల్ఐసీ మార్కెట్ లీడర్‌‌గా ఎదిగింది. సెప్టెంబర్ 30, 2021 నాటికి ఎల్ఐసీ  ఎంబెడెడ్ విలువ రూ.5.4 లక్షల కోట్లకుపైగా ఉంది.   అప్పర్​ ప్రైస్​ బ్యాండ్​ వద్ద సెప్టెంబర్ 30, 2021 నాటికి  కంపెనీ వాల్యుయేషన్​ ఎంబెడెడ్​ వాల్యూ కంటే 1.1 రెట్లు ఎక్కువ ఉంది”అని చెప్పారు.  ప్రతికూల వేరియేషన్​ వల్ల కంపెనీకి రిస్కులు ఉన్నాయని పేర్కొన్నారు. వడ్డీ రేట్లలో, మార్కెట్లలో హెచ్చుతగ్గులు కార్పొరేషన్​ లాభదాయకతను దెబ్బతీస్తాయని చెప్పారు. ఎంబెడెడ్​ వాల్యూ లెక్కల్లో టెక్నికల్​ లోపాలు కనిపిస్తున్నాయని అన్నారు.
60 ఏళ్ల చరిత్ర..
ఎల్ఐసీ ఆరు దశాబ్దాలకు పైగా భారతదేశంలో జీవిత బీమాను అందిస్తోంది. ప్రీమియం పరంగా 61.6 శాతం మార్కెట్ వాటా ఉంది.  కొత్త వ్యాపార ప్రీమియం పరంగా 61.4 శాతం వాటాతో   భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థగా ఎదిగింది.  వ్యక్తిగత పాలసీల సంఖ్య పరంగా 71.8 శాతం మార్కెట్ వాటాతో ఎల్ఐసీ ఆధిపత్యం చెలాయిస్తోంది.  డిసెంబర్ 31, 2021తో ముగిసిన తొమ్మిది నెలలకు జారీ చేసిన పాలసీలతో 88.8 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకుంది.  ఎల్ఐసీ డిసెంబర్ 31, 2021 నాటికి భారతదేశంలో అతిపెద్ద అసెట్ మేనేజర్‌‌గా ఎదిగింది. స్టాండ్​ ఎలోన్​ ప్రాతిపదికన రూ.40.1 లక్షల కోట్ల ఎసెట్స్​ ఈ సంస్థ చేతి కింద ఉన్నాయి. ఇది భారతదేశంలోని అన్ని ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌ల మొత్తం ఏయూఎం కంటే 3.2 రెట్లు ఎక్కువ.  ఎల్ఐసీ  ఏయూఎం మొత్తం భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ  ఏయూఎం కంటే 1.1 రెట్లు ఎక్కువ.