త్వరలో డివిడెండ్ ఇవ్వనున్న ఎల్‌ఐసీ!

త్వరలో డివిడెండ్ ఇవ్వనున్న ఎల్‌ఐసీ!

ఇందుకోసం రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం

న్యూఢిల్లీ: షేరు హోల్డర్లకు డివిడెండ్స్‌‌‌‌ లేదా బోనస్‌‌లను ఇవ్వాలని  లైఫ్ ఇన్సూరెన్స్‌‌ కార్పొరేషన్ (ఎల్‌‌ఐసీ)  చూస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఏకంగా 22 బిలియన్ డాలర్ల (రూ.1.8 లక్షల కోట్ల) ను ఇందుకోసం కంపెనీ ఖర్చు చేయనుందని  అన్నారు. లిస్టింగ్ అయిన తర్వాత నుంచి కంపెనీ షేర్లు పడుతూనే ఉన్నాయి. దీంతో  ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ నింపడానికి, కంపెనీ సంపదను పెంచడానికి  బోనస్‌‌లను లేదా డివిడెండ్‌‌లను ఇవ్వాలని ఎల్‌‌ఐసీ చూస్తోందని వివరించారు.  కాగా, ఈ ఏడాది మే నెలలో ఎల్‌‌ఐసీ షేర్లు మార్కెట్‌‌లో లిస్టింగ్ అయ్యాయి. అప్పటి నుంచి చూస్తే కంపెనీ షేరు విలువ 35 శాతం తగ్గింది. ఇన్వెస్టర్లు ఏకంగా రూ.2.23 లక్షల కోట్లను నష్టపోయారు.  ఎల్‌‌ఐసీ తన నాన్ పార్టిసిపేటింగ్ ఫండ్‌‌ నుంచి రూ.1.8 లక్షల కోట్లను (21.83 బిలియన్ డాలర్లను) షేరు హోల్డర్స్ ఫండ్‌‌కు ట్రాన్స్‌‌ఫర్ చేయాలని చూస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ నాన్ పార్టిసిపేటింగ్ ఫండ్‌‌లో రూ.11.57 లక్షల కోట్లు ఉన్నాయి. 

కాగా, ఎల్‌‌ఐసీ రెండు రకాల పాలసీలను అమ్ముతోంది. పార్టిసిపేటింగ్ పాలసీలయితే  వచ్చిన ప్రాఫిట్స్‌‌ను కస్టమర్లతో పంచుకోవాల్సి ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ పాలసీలు అయితే  పాలసీ హోల్డర్లకు ఫిక్స్‌‌డ్‌‌ రిటర్న్‌‌ను ఆఫర్ చేయాలి. ఈ పాలసీల కింద వచ్చిన ప్రీమియంను నాన్ పార్టిసిపేటింగ్ ఫండ్‌‌లో కంపెనీ ఉంచుతోంది. నాన్ పార్టిసిపేటింగ్ ఫండ్ నుంచి షేరు హోల్డర్ ఫండ్‌‌కు కొంత అమౌంట్‌‌ను  ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేయడం ద్వారా భవిష్యత్‌‌లో కంపెనీ డివిడెండ్స్‌‌ ఇస్తుందనే నమ్మకం ఇన్వెస్టర్లలో పెరుగుతుందని ప్రభుత్వ అధికారి అన్నారు. ఎల్‌‌ఐసీ బోర్డు ఆమోదిస్తే ఇలా ఫండ్స్‌‌ను ట్రాన్స్‌‌ఫర్ చేయడానికి వీలుంటుందని వివరించారు. దీనిపై ఎల్‌‌ఐసీ, ఫైనాన్స్ మినిస్ట్రీ స్పందించలేదు. ఎల్‌‌ఐసీ షేరు రూ.949 వద్ద  ఐపీఓకి రాగా, శుక్రవారం రూ.592.65 వద్ద ముగిసింది.