ఒకే కుటుంబంలో 9 మందికి జీవితఖైదు..

ఒకే కుటుంబంలో 9 మందికి జీవితఖైదు..

సంగారెడ్డి, వెలుగు: మహిళను కొట్టి చంపిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం సం చలన తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. జహీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన వడ్ల నర్సమ్మ (42) భర్త చనిపోవడంతో అదే గ్రామంలో ఉంటోంది. 2016 ఏప్రిల్ 25న  ఖాసీంపూర్ గ్రామానికి చెందిన వడ్ల వీరన్న తన కూతురు పెండ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. వీరన్న కూతురు మైనర్ కావడంతో ఆ విషయాన్ని నర్సమ్మ స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి పెండ్లిని ఆపించింది. దీంతో ద్వేషం పెంచుకున్న వీరన్న, ఆయన కుటుంబసభ్యులు అదే రోజు నర్సమ్మను రాళ్లు, కర్రలతో చితకబాదారు. 

ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ కేసులో వడ్ల వీరన్న (45), వడ్ల ప్రభు (45), వడ్ల ప్రశాంత్ (19), వడ్ల వెంకట్ (19), వడ్ల సంతోష్ (19), వడ్ల రేఖ (28), వడ్ల ప్రభావతి (40), వడ్ల ఈశ్వర్ (42), వడ్ల శ్రీకాంత్ (19)లపై చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్​లో సీఐ రాజశేఖర్ కేసు నమోదు చేశారు. జిల్లా కోర్టులో శుక్రవారం కేసు పూర్వపరాలు పరిశీలించిన జిల్లా అడిషనల్​జడ్జి జి.సుదర్శన్ నిందితులైన తొమ్మిది మందికి జీవిత కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. అలాగే రూ.5 వేలు జరిమానా కూడా విధించారు. ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి జీవిత ఖైదు విధించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.