
ముంబై: ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం అందరికీ స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు ఇప్పటికీ అనుసరణీయమని చెప్పారు. మరాఠా రాజుగా శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏండ్లయిన సందర్భంగా శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాయ్ గఢ్ కోటపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘ఈ రోజును మహారాష్ట్ర అంతటా పండగలా జరుపుకుంటారు. శివాజీ పట్టాభిషేకం జరిగినప్పుడు ‘స్వరాజ్’ నినాదం మార్మోగింది. ప్రజల్లో జాతీయవాదం బలపడింది” అని ఆయన అన్నారు. శివాజీ పట్టాభిషేకం చరిత్రలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ‘‘శివాజీ ధైర్యానికి ప్రతిరూపం. ఆయన ప్రజల్లో బానిస మనస్తత్వాన్ని పోగొట్టారు. స్వరాజ్య కాంక్షను రగిలించారు. బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజల్లో.. స్వరాజ్యం సాధ్యమనే నమ్మకాన్ని కలిగించారు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు” అని చెప్పారు. శివాజీ ఆలోచనలే ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్భారత్’కు మూలమని తెలిపారు.
సంక్షేమమే ధ్యేయంగా పాలన..
ఛత్రపతి శివాజీ ప్రజల సంక్షేమమే ప్రాధాన్యంగా పరిపాలన కొనసాగించారని మోడీ చెప్పారు. ‘‘లీడర్ షిప్, పరిపాలన రెండింటిలోనూ శివాజీ ముందున్నారు. కోటలను ఆక్రమించి తన లీడర్ షిప్ చూపించారు. పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆయన స్వరాజ్‌తో పాటు సురాజ్‌ను ఏర్పాటు చేశారు. రైతులు, మహిళల సంక్షేమానికి పాటుపడ్డారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపారు” అని తెలిపారు. శివాజీ తన విజన్‌తో ఒక గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ‘‘శివాజీ హయాంలో నేవీ దళం బలంగా ఉండేది. ఆయన నేవీని విస్తరించిన తీరు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. అందుకే శివాజీ స్ఫూర్తితో పోయినేడాది మన నేవీ జెండాను మార్చినం” అని అన్నారు.