సమగ్ర జీవిత చరిత్ర

సమగ్ర జీవిత చరిత్ర

పీవీ చనిపోయి దాదాపు 18 ఏండ్లు అవుతున్నది. ఆయన జీవన విశేషాలపై వచ్చిన పుస్తకాల సంఖ్య చాలా తక్కువ. ఒకటి, రెండు రచనలు వచ్చినా అవి పీవీ జీవితంలోని ఏదో ఒక ప్రధాన అంశాన్ని కేంద్రంగా చేసుకుని రాసినవే. అయితే, తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన విభాగం ఆచార్యులు, పరిశోధకులు, విమర్శకులు డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి రచించిన ‘‘విలక్షణ పి. వి.-– నరసింహారావు గారి జీవిత చరిత్ర” పుస్తకం ఇటీవలే వచ్చింది. వాస్తవికతపై ఆధారపడి చేసే వ్యాఖ్యలు, జీవితచరిత్రలకు కొత్త వన్నెలుగా నిలుస్తాయి. ‘‘విలక్షణ పి.వి.” పుస్తకం ఈ పద్ధతిలోనే ఉంటుంది.

తన రాజకీయ జీవితంలోని వివిధ సందర్భాలలో పీవీ తీసుకున్న నిర్ణయాలను ఇందులో ప్రధానంగా చర్చించారు. రచయిత తన అభిప్రాయాలు చెప్పేటప్పుడు, అందుకు బలాన్ని ఇచ్చే ప్రముఖుల గ్రంథాల నుంచి ఉదాహరణలు ఇచ్చారు. ఇవి పాఠకులకి విసుగు కలిగించకుండా జాగ్రత్తపడ్డారు. పుస్తకం రాయడానికి తెలుగు, ఇంగ్లీషు నుంచి దాదాపు యాభై గ్రంథాల్ని చదివినట్టు ఉపయుక్త గ్రంథసూచి ద్వారా తెలుస్తుంది. ఇందులో మాజీ రాష్ట్రపతులు ఆర్.వెంకటరామన్, ప్రణబ్ ముఖర్జీతోపాటు ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు సంజయ్ బారు, సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్ వంటి వారి గ్రంథాలు ఉన్నాయి.

పీవీ స్వభావాన్ని రచయిత సరిగ్గా గుర్తించారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎక్కువగా ‘స్వీయ రక్షణాత్మక ధోరణి’ పాటించారని వ్యాఖ్యానించారు.1952లో లోక్‌‌సభ ఎన్నికల్లో ఎదురైన ఓటమే దీనికి కారణమని సునిశిత దృష్టితో చూస్తే అర్థమవుతుంది. పీవీ తన స్వస్థలం హుజురాబాద్ నుండి కాకుండా సుదూరంలో ఉన్న మంథని నుండి అసెంబ్లీకి పోటీ చేయడం, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ తన పరిధికే పరిమితం కావడం, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా కేంద్రం ఆదేశాలపై ఆధారపడటం, ఇందిరాగాంధీ దారుణహత్య తర్వాత ప్రధాని పదవికి పోటీ పడకపోవడం ఇవన్నీ పీవీలోని స్వీయ రక్షణాత్మక ధోరణి చూపించేవే.ఈ పుస్తకం సర్వసమగ్ర జీవితచరిత్రగా చెప్పొచ్చు. ఇందులో మొత్తం 27 అధ్యాయాలు ఉన్నాయి. ‘‘ప్రధానులు, కొన్ని పోలికలు, మరికొన్ని విభేదాలు” అధ్యాయంలో భారత ప్రధానులందరితో పీవీని పోల్చి చూపారు రచయిత. అలాగే ‘‘స్వపక్ష మిత్రులు’’,- ‘‘విపక్ష నేస్తాలు’’ అనే రెండు అధ్యాయాలు పీవీ మిత్రుల్ని, శత్రువుల్ని స్పష్టంగా చెప్తాయి. నిజాం వ్యతిరేక పోరాటంలో  పీవీ సాయుధుడై పాల్గొన్న సంగతి, తెలుగు అకాడమీ ఏర్పాటు, గురుకుల  విద్యాసంస్థలు స్థాపించడం, రాష్ట్ర మంత్రిగా ఆరుబయట జైళ్లను ఆరంభించడం వంటి విలక్షణాలు పీవీలో ఉన్నాయని రచయిత చెప్పారు. ‘పీవీ బహుభాషా వైవిధ్యం’, ‘సాహిత్యంలో సన్నిహితులు’, ‘అక్షరవనంలో విలక్షణ గమనం’ అనే మూడు అధ్యాయాలు సాహితీప్రియులను ఆకట్టుకుంటాయి. 

– డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార్
ఫోన్: 99085 19151