స్పీడ్గా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు..నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు రైతులకు ఊరట

స్పీడ్గా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు..నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు రైతులకు ఊరట
  • చకచకా దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్
  • రూ.122.96 కోట్లతో పనులు
  • వచ్చే మార్చి కల్లా 12,239 ఎకరాలకు సాగునీరు

నల్గొండ, వెలుగు : నాగార్జునసాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగునీటి అందించే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్పీడ్ అందుకున్నాయి. ఎన్నో ఏండ్లుగా సాగర్ చివరి ఆయకట్టు భూముల రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడేండ్ల క్రితం అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమయ్యాయి. 

ఈ లిఫ్ట్ ద్వారా సాగర్ ఆయకట్టు పరిధిలోని ముదిమాణిక్యం మేజర్ కాల్వ చివరి భూములతోపాటు మొత్తం ఆరు గ్రామాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఈ లిఫ్ట్ నిర్మాణానికి అవసరమైన 36.11 ఎకరాల భూమిని సేకరించి దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టారు.

 అయితే దున్నపోతుల గండి, బాల్నేపల్లి, చాంప్ల తండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇటీవల ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ కుమార్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించారు. దీంతో పనులు చకచకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 30 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరందించేలా చర్యలు చేపట్టారు. 

రూ.122.96 కోట్లతో లిఫ్ట్ నిర్మాణ పనులు..

అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద కృష్ణానదిలో హాలియా వాగు కలిసే చోట దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మూడేండ్ల క్రితం రూ. 122.96 కోట్లతో ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణ పనులకు కావేరి ఇంజినీరింగ్ నిర్మాణ సంస్థ టెండర్ దక్కించుకోగా, 2022 మార్చి నుంచి 2025 మార్చి వరకు పూర్తి చేసేందుకు సదరు సంస్థ పనులను ప్రారంభించింది. 

అయితే రెండేండ్లలో కేవలం 10 శాతం పనులు మాత్రమే పూర్తి కావడంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై గతేడాది ఆగస్టులో దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిత ప్రాంతంలో రైతులు, ఇరిగేషన్ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులకు ఎదురైన అడ్డంకులు, ఇతర అంశాలపై చర్చించారు. 

వీటితోపాటు 2026 మార్చి వరకు పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థకు గడువు పెట్టింది. దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం 30 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఫోర్ బే, అప్రోచ్ ఛానెల్, ఎర్త్ వర్క్ పూర్తి కాగా, పంప్ హౌస్ కాంక్రీట్ పనులు నడుస్తున్నాయి. ఈ లిఫ్ట్ పనులు కంప్లీట్ అయితే చిట్యాల, బాల్నేపల్లి, అడవిదేవులపల్లి, ఉల్సాయి పాలెం, కొత్త నందికొండ, ముల్కచర్ల గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుంది. 

పనుల్లో వేగం పెంచాం 

దున్నపోతుల గండి, బాల్నేపల్లి, చాంప్ల తండా లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో వేగం పెంచాం. ప్రస్తుతం 30 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తాం. ‌‌‌‌ - కేశవ్, డీఈ, మిర్యాలగూడ ఇరిగేషన్ సబ్ డివిజన్–2  

మొత్తం 12,239 ఎకరాలకు సాగునీరు..

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ముదిమాణిక్యం మేజర్ కెనాల్ కింద సుమారు 6,300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. అయితే ఈ కెనాల్ పరిధిలోని ఎల్ –3, ఆర్ –-24, బంగారి కుంట, ఎల్ –-2, ఎల్-–3, ఆర్-–1 సబ్ మైనర్, ఎల్-–25 ఇతర డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ఉన్నప్పటికీ చివరి భూములకు  నీరు అందని పరిస్థితి నెలకొంది. 

దీంతో దున్నపోతుల గండి -బాల్నేపల్లి, -చాంప్ల తండా లిఫ్ట్ కు 258 క్యూసెక్కుల నీటిని కేటాయించారు. ముదిమాణిక్యం మేజర్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ తోపాటు చాంప్ల తండా వద్ద ఈ లిఫ్ట్ పరిధిలో నిర్మిస్తున్న రెండు కెనాల్స్ పూర్తయితే ఒక్క కెనాల్ కింద 6,300 ఎకరాలతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో కొత్తగా 5,939 ఎకరాలు కలిపి మొత్తం 12,239 ఎకరాలకు సాగునీరు అందనుంది.